ఇళ్ల నిర్మాణంలో ఏపీది అగ్రస్థానమని కేంద్రం కితాబు
ఆంధ్రప్రదేశ్‌లో అత్యధికంగా పట్టణ పేదలకు 21.37 లక్షల ఇళ్ల నిర్మాణం
రెండో స్థానంలో 17.76 లక్షల ఇళ్లతో ఉత్తరప్రదేశ్
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం 31 లక్షలకు పైగా పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ
17005 కాలనీల్లో ఇళ్ల నిర్మాణాలు
ఈ ఏడాది మే నాటికి 21.31 లక్షల ఇళ్లకు రూ.12,295 కోట్లు వ్యయం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ప్రతి పేద కుటుంబం సొంతింట్లో నివసించాలని, అక్క చెల్లెమ్మలు సంతోషంగా ఉండాలనే తలంపుతో గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం చేపట్టిన ఇళ్ల నిర్మాణం రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రస్థానంలో నిలబెట్టింది. పట్టణ పేదల ఇళ్ల నిర్మాణంలో ఆంధ్రప్రదేశ్ నంబర్ 1 అని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. పట్టణ పేదల ఇళ్ల నిర్మాణాల్లో ఆంధ్రప్రదేశ్ ఉత్తమ పనితీరు కనపరిచిందని ప్రశంసించింది.
ప్రధాన మంత్రి అవాస్ యోజన (పట్టణ) కింద భారత దేశంలో వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో గణనీయమైన పురోగతి సాధించినట్లు తెలిపింది. పేదలందరికీ ఇళ్లు అనే విస్తృత లక్ష్యం పట్ల రాష్ట్రాలు సామూహిక నిబద్ధతను ప్రతిబింబిస్తున్నాయని పేర్కొంది. పట్టణ పేదల ఇళ్ల నిర్మాణాల్లో ఉత్తమ పనితీరు కనపరుస్తున్న పది రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉందని తెలిపింది. రెండో స్థానంలో ఉత్తరప్రదేశ్ ఉన్నట్లు పేర్కొంది.
ప్రధాన మంత్రి ఆవాస్ యోజన (పట్టణ) కింద ఈ ఏడాది జూన్ 10 నాటికి దేశవ్యాప్తంగా 1.18 కోట్ల ఇళ్లు మంజూరు చేయగా ఇందులో 1.14 కోట్ల ఇళ్ల నిర్మాణాలు ప్రారంభమయ్యాయని కేంద్రం పేర్కొంది. ఇందులో 83.67 లక్షల ఇళ్లు నిర్మాణాలు పూర్తయ్యాయని తెలిపింది. ఈ పథకం కింద 1,99,652 కోట్లు వ్యయం చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా ఇప్పటి వరకు 1,63,926 కోట్లు విడుదల చేసినట్లు తెలిపింది. ఇందులో 1,51,246 కోట్లు వ్యయం చేసినట్లు పేర్కొంది. అదనంగా మరో 16 లక్షల ఇళ్లు కొత్త సాంకేతిక పరిజాŠక్షనాన్ని ఉపయోగించి నిర్మిస్తున్నట్లు వెల్లడించింది.
రాష్ట్రంలో 31 లక్షలకు పైగా ఇళ్ల స్థలాలు
గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం పేదలందరికీ ఇళ్లు పేరుతో ఏకంగా 31 లక్షలకు పైగా స్థలాలను మహిళల పేరిట పంపిణీ చేసి, 17005 కాలనీల్లో పెద్ద ఎత్తున ఇళ్ల నిర్మాణాన్ని ఓ యజ్ఞంలా చేపట్టింది. ఇందు కోసం వేల ఎకరాల ప్రైవేటు భూములను సైతం సేకరించింది. ఈ ఏడాది మే నెలాఖరుకి 21.31 లక్షల ఇళ్ల నిర్మాణానికి రూ.12,295.87 కోట్లు వ్యయం చేసింది. ఇందులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వాటా ఉంది. పేదల ఇళ్ల కోసం ఊర్లను తలపించేలా పెద్ద కాలనీలు అభివృద్ధి చేసింది.
ఆ కాలనీల్లో అన్ని రకాల మౌలిక సదుపాయాలను కల్పించేందుకు చర్యలు చేపట్టింది. తొలి దశలో 15 లక్షలకుపైగా ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేసింది. ఇంత పెద్ద ఎత్తున పేదల ఇళ్ల నిర్మాణం ఇప్పటివరకు దేశంలో ఏ రాష్ట్రంలోనూ జరగలేదు. పేద అక్కచెల్లెమ్మల సొంతింటి కల నెరవేర్చడానికి గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం చేపట్టిన చర్యలే ఇప్పుడు రాష్ట్రాన్ని ప్రథమ స్థానంలో నిలబెట్టింది.
Comments
Please login to add a commentAdd a comment