గడప గడపకూ మన ప్రభుత్వం వర్క్‌షాప్‌లో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
ఎమ్మెల్యేల పనితీరు ప్రజల్లో బాగుంటే ఆ ఎమ్మెల్యేలను కొనసాగిస్తాం. ప్రజల్లో గ్రాఫ్ బాగా లేకపోతే ఆ ఎమ్మెల్యేలను కొనసాగించడం కుదరదు. ప్రతి ఒక్కరూ ఇది గుర్తుంచుకోండి. ఈ విషయం ఎందుకు చెబుతున్నానంటే కొన్ని కోట్ల మంది మనపై ఆధారపడి ఉన్నారు. కోట్ల మంది పేదలకు మంచి జరుగుతోంది. కొంతమంది ఎమ్మెల్యేల పనితీరు బాగా లేకపోతే.. వాళ్లను అక్కడే కొనసాగించడం వల్ల వారికీ నష్టం, పార్టీకీ నష్టం. కోట్లాది మంది పేదలకూ నష్టం జరుగుతుంది. మనం సర్వే చేసినప్పుడు మీ గ్రాఫ్‌లు బలంగా ఉండాలి. దీనికి గడప గడపకూ కార్యక్రమం ఉపయోగపడుతుంది. ప్రజలకు చేరువగా ఉండేందుకు బాగా ఉపయోగపడుతుంది. దీనివల్ల మీ గ్రాఫ్ పెరుగుతుంది. సర్వేలు అనుకూలంగా లేకపోతే.. టికెట్లు ఇవ్వకపోతే.. నన్ను బాధ్యుడ్ని చేయొద్దు. రాజకీయాలను సీరియస్‌గా తీసుకోవాలి.
– సీఎం జగన్
సాక్షి, అమరావతి: ‘‘మరో తొమ్మిది నెలల్లో ఎన్నికలు రాబోతున్నాయి. ఇవాళ్టి నుంచి మనం వేసే ప్రతి అడుగు చాలా కీలకం. 175కు 175 శాసనసభ స్థానాల్లోనూ మనం గెలవాలి. ఇంతకు ముందుకన్నా బ్రహ్మాండమైన మెజార్టీలు రావాలి. మన లక్ష్యం అదీ. అందుకే గడప గడపకూ కార్యక్రమాన్ని సీరియస్‌గా తీసుకోవాలి..’’ అని సీఎం వైఎస్ జగన్ మార్గనిర్దేశం చేశారు. బుధవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ‘గడప గడపకూ మన ప్రభుత్వం’ కార్యక్రమంపై ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గాల సమన్వయకర్తలు, ప్రాంతీయ సమన్వయకర్తలతో సీఎం జగన్ వర్క్ షాప్ నిర్వహించారు.
175కు 175 స్థానాల్లో విజయబావుటా ఎగురవేసేందుకు చేపట్టాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు. నాలుగేళ్లలో రాష్ట్రంలో ఎన్నడూ లేనివిధంగా తెచ్చిన మార్పులను ‘వై ఏపీ నీడ్స్ జగన్..?’ (ఏపీకి జగన్ ఎందుకు కావాలి..?) అనే కార్యక్రమం ద్వారా ప్రతి ఇంటికీ తెలియజేద్దామని పిలుపునిచ్చారు. ‘నెగెటివ్ మీడియాను అడ్డం పెట్టుకుని మారీచుల్లా మనపై యుద్ధం చేస్తున్నారు.. ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారం చేస్తున్న వారితో మనం యుద్ధం చేస్తున్నాం. ఆ దుష్ఫ్రచారాన్ని ప్రతి గడపలోనూ తిప్పికొట్టాలి..’ అని సూచించారు. వర్క్ షాప్‌లో ముఖ్యమంత్రి జగన్ ఇంకా ఏమన్నారంటే..
ప్రతి లబ్ధిదారుడినీ చైతన్యం చేయాలి..
ఇవాళ మూడు ప్రధాన కార్యక్రమాలపై అవగాహన కల్పిస్తున్నాం. ఇందులో మొదటిది ఈ నెల 23వతేదీన ప్రారంభించబోతున్న జగనన్న సురక్ష కార్యక్రమం. రెండోది.. గడపగడపకూ మన ప్రభుత్వం. ఇక మూడో అంశం ‘‘వై ఏపీ నీడ్స్ జగన్..?’’ అనే కార్యక్రమం. నాలుగేళ్ల పరిపాలనలో గొప్పగా, దేశానికే ఆదర్శంగా నిలబడగలిగిన పనులు ఏం చేశామన్న విషయాలతోపాటు వాటికి సంబంధించి ఆధారాలతో సహా అవగాహన కలిగించేలా ‘వై ఏపీ నీడ్స్ జగన్..’ కార్యక్రమాన్ని కూడా చేపట్టబోతున్నాం.
మనం రాక్షసులతోనూ, మారీచులతోనూ యుద్ధం చేస్తున్నాం. ప్రతి ఒక్కరూ చైతన్యవంతులు అయితేనే మనపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని తగినవిధంగా తిప్పికొట్టగలిగే పరిస్థితి ఉంటుంది. మనం చేస్తున్న మంచి ఏమిటన్నది ప్రతి మనిషి దగ్గరికి, ప్రతి కుటుంబం వద్దకు పదేపదే తీసుకెళ్లాలి. ఈ దుష్ప్రచారాన్ని తిప్పికొట్టగలిగే పరిస్థితిలోకి ప్రతి లబ్ధిదారుడిని తయారు చేయాలి. ఇది చాలా ముఖ్యమైన అంశం.
ఆ భావనే ఆశీస్సులుగా మారి..
వచ్చే ఎన్నికల్లో మనం 175కు 175 నియోజకవర్గాలూ గెలవాలి. ఆ దిశగా అడుగులు పడాలి. అదేం కష్టమైన పనికాదు. ఎందుకంటే.. రాష్ట్రంలో సగటున 87 శాతం కుటుంబాలకు మంచి జరిగింది. గ్రామీణ ప్రాంతాల్లో 92 శాతం కుటుంబాలకు మంచి జరగ్గా పట్టణ ప్రాంతాల్లో 84 శాతానికి మేలు జరిగింది. ప్రతి నియోజకవర్గంలోనూ, ప్రతి గ్రామంలోనూ ఇదే పరిస్థితి.
అన్ని చోట్లా ఇదే పరిస్థితి ఉన్నప్పుడు.. దేవుడి దయతో మన ప్రభుత్వం మంచి చేయగలిగిందని ప్రతి ఇంటికి వెళ్లి చెప్పి ఆ ఇంట్లో ప్రతి అక్కచెల్లెమ్మ మనసులో ఇది నిజమే కదా అనే భావనను తేవాలి. ఆ భావనే ఆశీస్సులుగా మారి ప్రతి ఇళ్లూ మనకు ఓటు వేస్తుంది. అది జరిగితే ప్రతి గ్రామం మనకు ఓటు వేస్తుంది. ప్రతి నియోజకవర్గం ఆటోమేటిక్‌గా మనకే ఓటు వేసే పరిస్థితి వస్తుంది. 175కు 175 స్థానాల్లో మనం విజయం సాధిస్తాం.
జగనన్న సురక్షతో సమస్యల పరిష్కారం..:
► మీతోపాటు క్యాడర్‌ను కూడా యాక్టివేట్ చేసి గృహ సారథులు, వలంటీర్లు, సచివాలయ కన్వీనర్లను ఏకం చేస్తూ ముందుకు సాగాలి. ఇప్పటికే ‘జగనన్నకు చెబుదాం’ కార్యక్రమం కొనసాగుతోంది. ఎక్కడైనా, ఏదైనా సమస్య మీరు ప్రయత్నం చేసినప్పటికీ పరిష్కారం కాకపోతే దాన్ని పరిష్కరించేలా భరోసా ఇస్తూ ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. దీనికి అనుబంధంగా, అదనంగా ‘జగనన్న సురక్ష’ కార్యక్రమం కొనసాగుతుంది.
► ‘జగనన్న సురక్ష కార్యక్రమం’ ద్వారా మొత్తం సచివాలయ వ్యవస్థ, వలంటీర్ల వ్యవస్థ, గృహ సారథుల వ్యవస్థ ప్రతి ఇంటికీ వెళ్లి జల్లెడ పడుతుంది. అర్హులై ఉండి కూడా ఇంకా ఎవరైనా మిగిలిపోయి పథకాలకు దూరం కాకూడదనే లక్ష్యంతో జల్లెడ పట్టే కార్యక్రమం జరుగుతుంది. ఇంకా ఎక్కడైనా అర్హులు మిగిలిపోయిన వారు ఉంటే కుటుంబంలో విభజన చేసి రేషన్ కార్డు అందించడం నుంచి వివిధ రకాల సర్టిఫికెట్లు అక్కడికక్కడే మంజూరు చేసే కార్యక్రమం జరుగుతుంది. ప్రతి ఇంటికి వెళ్లి కాసేపు గడిపి సర్టిఫికెట్స్ పరంగా, పథకాల పరంగా సమస్యలుంటే జగనన్న సురక్ష కార్యక్రమం ద్వారా పరిష్కరిస్తాం.
► మండల స్థాయి అధికారులు ప్రతి సచివాలయంలో ఒకరోజు పాటు గడుపుతారు. తహసీల్దార్, పంచాయితీరాజ్ ఈవో ఒక బృందంగా.. ఎంపీడీవో, డిప్యూటీ తహసీల్దార్ మరొక బృందంగా ఏర్పడతారు. షెడ్యూల్ ప్రకారం సచివాలయాలకు వెళతారు. ఏ తేదీన ఎక్కడకు వెళతారో ముందే ప్రకటిస్తారు. ఉత్సాహం ఉన్నవారు ఎవరైనా ఇందులో పాల్గొనవచ్చు.
► సచివాలయం పరిధిలో ప్రతి కుటుంబాన్నీ అధికారులతో కూడిన ఈ బృందాలు కలుస్తాయి. ప్రజల నుంచి సమస్యలు తెలుసుకోవడం, సర్టిఫికెట్ల జారీకి అవసరమైన డాక్యుమెంట్లు, పథకాల అర్హతకు సంబంధించిన పత్రాలు తీసుకుంటారు. వీటిని తీసుకుని తిరిగి గ్రామ, వార్డు సచివాలయాల వద్దకు చేరుకుంటారు. అక్కడ ప్రతి వినతికీ సర్వీసు నంబరు, టోకెన్ కేటాయించి ఆయా కుటుంబాలకు అందచేస్తారు.
► వారం తర్వాత అధికారులతో కూడిన బృందం ఆయా గ్రామ, వార్డు సచివాలయాలకు చేరుకుని సర్టిఫికెట్లు జారీ చేసే కార్యక్రమం చేపడుతుంది. అర్హులందరికీ పథకాలు మంజూరు చేస్తారు. ఒక పండగ వాతావరణంలో గ్రామానికి సంబంధించిన సమస్యలన్నీ
పరిష్కరిస్తారు. దీనివల్ల నూరు శాతం కార్యక్రమం సంతృప్తిగా జరుగుతుంది.
► జగనన్న సురక్ష కార్యక్రమం క్యాంపుల్లో దాదాపు 11 రకాల సర్టిఫికెట్లు జారీ చేస్తారు. కులం, ఆదాయం, జనన ధృవీకరణ, వివాహం, ఫ్యామిలీ మెంబర్, డెత్, బియ్యం కార్డులు, కుటుంబాల విభజన, సీసీఆర్సీ, మ్యుటేషన్లు, ఫోన్ నంబర్లకు ఆధార్ లింకేజి లాంటివన్నీ అందించే కార్యక్రమం జరుగుతుంది.
► మండలంలో ప్రతి రోజూ రెండు క్యాంపులు జరుగుతాయి. నియోజకవర్గంలో ఎన్ని మండలాలుంటే అన్నింటా రెండేసి క్యాంపులు చొప్పున జరుగుతాయి. ప్రతి క్యాంపు దగ్గర ఎమ్మెల్యేలు కనిపించాలి. జగనన్న సురక్ష కార్యక్రమంపై ఈ నెల 23 నుంచి శిక్షణ కార్యక్రమాలు జరుగుతాయి. జూలై 1 నుంచి క్యాంపులు ప్రారంభం అవుతాయి.
దుష్ఫ్రచారాన్ని ఎక్కడికక్కడ తిప్పికొట్టండి..
► గతంలో చంద్రబాబు పాలన, ఇవాళ మన ప్రభుత్వంలో జరిగిన కార్యక్రమాలతో నాడు – నేడు కంటెంట్ తయారు చేసి ప్రజల దగ్గరకు చేర్చాలి. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ–5 ద్వారా వెలువడుతున్న వ్యతిరేక కథనాలకు సంబంధించి నిజాలేమిటో ప్రజలకు వివరిస్తూ నెగెటివ్ మీడియా చేస్తున్న దుష్ఫ్రచారాన్ని తిప్పికొట్టాలి.
► ప్రభుత్వం చేస్తున్న మంచిని సోషల్ మీడియా ద్వారా ప్రజలకు తెలియజేయాలి. సోషల్ మీడియాను విస్తృతంగా వాడుకోవాలి. అబద్ధాలు, విష ప్రచారాలను పూర్తిస్థాయిలో తిప్పికొట్టాలి. రాబోయే రోజుల్లో మనపై దుష్ప్రచారం పెరుగుతుంది. సోషల్ మీడియాలో అబద్ధాలను ఇంకా ఎక్కువగా ప్రచారంలోకి తెచ్చే కార్యక్రమం చేస్తారు. ఇంత దారుణమైన ఎమ్మెల్యే ఎవరూ లేరంటూ వ్యక్తిత్వ హననానికి పాల్పడతారు. ప్రతి ఒక్కరిపైనా వ్యక్తిత్వ హననానికి పాల్పడతారు. వీటిని ఎదుర్కొంటూ ముందుకు పోవాలి. గ్రామ స్ధాయి నుంచి మన సోషల్ మీడియా టీమ్‌లను తయారు చేసుకోవాలి. ఈ కౌంటర్ మెకానిజం కచ్చితంగా ఉండాలి. దీనికి సిద్ధం కావాలి.
ప్రతి ఇంటిని జల్లెడ పడుతూ...
‘‘జగనన్న సురక్ష’ కార్యక్రమం ద్వారా ప్రతి గ్రామంలో ఏ చిన్న సమస్య ఉన్నా పరిష్కారం కావాలి. ఏకంగా 1.50 లక్షల మంది సచివాలయ సిబ్బంది, 2.60 లక్షల మంది వలంటీర్లు, 3 వేల మంది మండల స్థాయి సిబ్బంది, 26 మంది సీనియర్ ఐఏఎస్‌లు, 7.5 లక్షల మంది గృహ సారథులు, సచివాలయ కన్వీనర్లు ప్రతి గ్రామంలో ఒక రోజు కేటాయిస్తూ 15 వేల క్యాంపులు నిర్వహిస్తారు. 30 రోజులపాటు జరిగే ఈ కార్యక్రమం ద్వారా ప్రతి ఇంటిని జల్లెడ పట్టి ఇంకా ఎవరైనా అర్హులు ప్రభుత్వ పథకాలకు దూరమయ్యారేమో పరిశీలించి వారికి కూడా ప్రయోజనం చేకూర్చేలా చర్యలు తీసుకుంటారు. ఇలా ప్రతి సమస్యను పరిష్కరించాలన్న ధృక్పథంతో అడుగులు వేస్తోన్న పరిస్ధితి దేశ చరిత్రలో ఎక్కడా ఉండదు. ఈ రాష్ట్రంలో మాత్రమే జరుగుతోంది’’
– ‘జగనన్న సురక్ష’పై సీఎం జగన్
Comments
Please login to add a commentAdd a comment