ఎందుకంటే రాజును బట్టే రామోజీ!! | Eenadu Paper False Articles On AP Govt About Sand And Crop insurance | Sakshi
Sakshi News home page

రాజును బట్టే రామోజీ

Published Thu, Nov 26 2020 3:01 AM | Last Updated on Thu, Nov 26 2020 9:28 AM

Eenadu Paper False Articles On AP Govt About Sand And Crop insurance - Sakshi

సాక్షి, అమరావతి: మీరు ఏ నిర్ణయం తీసుకున్నా.. మా లైన్‌ మాకుంది!!.అదే ‘ఈనాడు’ ధోరణి. ఏనాడైనా ఇదే ధోరణి!!. ఎందుకంటే రాజును బట్టే రామోజీ!!. రాజు చంద్రబాబైతే రామోజీ కలం సిగ్గుతో చితికిపోతుంది. వేరొకరైతే నిగ్గదీత ముసుగేసుకుంటుంది. బుధవారం ‘ఈనాడు’లో వండి వార్చిన కథనాలు చూస్తే ఎవరికైనా అనిపించేది ఇదే. ఎందుకంటే నారా వారు వ్యవసాయ రుణాల్ని మాఫీ చేస్తామని ఎగ్గొట్టినా... ఐదేళ్లు పంటనష్టం చెల్లించకపోయినా కిమ్మనని రాజగురువు... రైతుకు పంటల బీమా ఆలస్యమౌతోందంటూ గగ్గోలు పెట్టేశారు. ఇక ‘ఆస్తిపన్ను మోత’ అంటూ అచ్చోసిన కథనంలో 350 చదరపుటడుగులలోపు ఇళ్లలో ఉన్నవారికి పన్ను పూర్తిగా మినహాయించటం... స్థానిక సంస్థల నిధుల్ని వాటికే ఇస్తుండటం వంటి వాస్తవాల్ని మాత్రం కప్పెట్టేశారు. పన్ను 10 రెట్లు పెరుగుతోందంటూ అబద్ధాలు కుమ్మేశారు!!.

‘ఇసుక మరింత  ప్రియం’ కథనం మరీ ఘోరం. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్ని పిలుస్తామని, వారు ముందుకు రాకుంటే ప్రైవేటు వారికిస్తామని సీఎం జగన్‌ ముందే చెప్పారు. ఇక ఇదే అదనుగా కేంద్ర ప్రభుత్వ సంస్థలెలాగూ రావని, కావాల్సిన వారికి కట్టబెట్టడానికే ఇదంతా చేస్తున్నారని టీడీపీ తరఫున తెగ రాసేసింది ఈనాడు. తీరా ఎన్‌ఎండీసీ వంటి కేంద్ర సంస్థలు ముందుకొచ్చేసరికి... వాటి వల్ల ధర పెరుగుతుందంటూ మరో కథనం వండేశారు. వీళ్లనేమనాలి? అసలు వీళ్లకు సమాచార వారధులైన పత్రికల్ని నడిపే హక్కుందా? ఎవరి మెప్పు కోసం ఇన్ని అబద్ధాలు? కావాలంటే ‘ఈనాడు’ కథనాల్లో నిజానిజాలేంటో మీరే చూడండి... (‘అచ్చోసిన’ ఆరు అబద్ధాలు)

పంటల బీమాపై పచ్చ డ్రామా..
ప్రభుత్వ ఆధ్వర్యంలోనే పంటల బీమా ఇస్తున్నప్పుడు నష్టం జరిగిన వెంటనే అంటే అక్టోబర్లో జరిగిన పంట నష్టానికి నవంబర్లోనే పరిహారం ఇచ్చేయవచ్చని టీడీపీ తరఫున ఈనాడు వకాల్తా పుచ్చుకుంది. టీడీపీ అధికారంలో ఉండగా 2012 నాటి పంట నష్టాన్ని 2014–19 మధ్య కూడా చెల్లించలేదు. రూ.87,612 కోట్లు రుణమాఫీ వాగ్దానం చేసి మొత్తం ఎగ్గొట్టి చివరికి మూడు విడతల్లో రూ.15,000 కోట్లు కూడా రైతులకు ఇవ్వలేదు. అయినా ఈనాడులో ఏరోజూ ఒక బ్యానర్‌ వార్త రాలేదు. ఇక ఇప్పటి పరిస్థితి చూస్తే...

  • ఈ సీజన్‌లో పంటల కోతలు జనవరి నెలాఖరు వరకు ఉంటాయి. ఆ తరవాతే దిగుబడికి సంబంధించిన అంచనాలు వేస్తారు. అది పూర్తయితేనే పంట నష్టానికి పరిహారాన్ని నిర్ణయించే వీలుంటుంది. ఇవేమీ లేకుండా, పోనీ టీడీపీ సర్కారు ఎప్పుడైనా పంటల బీమా ఇచ్చి ఉంటే... మా చంద్రబాబు ఇంత ఘనంగా చేశాడని చెప్పుకునేందుకు అవకాశం ఉండేదేమో! ఈనాడు కథనంలో గత ప్రభుత్వం ఏం చేసిందన్న వివరాలు లేవు. 
  • బీమా ప్రీమియం చెల్లించేది ప్రభుత్వమే. కంపెనీలు వేరు కావచ్చు. కానీ చెల్లింపులన్నిటినీ బీమా నియంత్రణ, అభివృద్ధి అథారిటీ (ఐఆర్‌డీ)  మార్గదర్శకాలకు లోబడే చేయాలి. నష్టపోయిన పార్టీలకు ఐఆర్‌డీఏ మార్గదర్శకాల ప్రకారమే బీమా వస్తుంది. బీమా.. రైతు భరోసా... సున్నా వడ్డీ... ఏ పథకమైనా ముఖ్యమంత్రికి రైతుల మీద ప్రేమ ఉండబట్టే సవ్యంగా జరుగుతున్నాయి. లేదంటే ప్రభుత్వాలుంటాయా? చంద్రబాబు సర్కారు ఎందుకు కూలిందో తెలియదా..? రైతుల నుంచి సామాజిక వర్గాల వరకు అందరికీ చేసిన అన్యాయం వల్లేగా?
  • చంద్రబాబు ఐదేళ్లు సీఎంగా ఉన్నప్పుడు ఏ ఒక్క ఏడాదిలో అయినా పంట నష్టానికి సంబంధించిన క్రాప్‌ ఇన్సూరెన్స్‌ను కనీసం తర్వాత ఏడాదిలోనైనా ఇచ్చారా? 2012లో బీమాను 2019లో వైఎస్సార్‌ సీపీ అధికారంలోకి వచ్చాక డబ్బులు కట్టి రైతులకు ఇప్పించింది. 2019కి సంబంధించి అంటే గతేడాది పంటల బీమాను వచ్చే నెలలో ఇవ్వబోతోంది. ఇది తెలిసే ఎల్లో మీడియా తప్పుడు ప్రచారానికి దిగింది. ఒక సీజన్‌కు సంబంధించిన ఇన్‌పుట్‌ సబ్సిడీని తర్వాత సీజన్‌ ప్రారంభానికి ముందే చెల్లించిన ఘనత కేవలం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వానికే సాధ్యమైంది. ఇలాంటి విషయాలను చెప్పటానికి ఈనాడుకు మనసు రాదు మరి!!.

ఆస్తి పన్ను డబ్బులు స్థానిక సంస్థలకే..
ఆస్తిపన్ను మోత అంటూ ప్రచురించిన కథనంలో అన్నీ అర్థసత్యాలే. రాష్ట్ర ప్రభుత్వం ఒక విధాన నిర్ణయం తీసుకోవటం వెనక కారణాలను వివరిస్తే ఈ కథనాన్ని తప్పుబట్టాల్సిన అవసరమే ఉండదు. ఎందుకంటే ఇది ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం ఒక్కటే అమలు చేస్తున్న సంస్కరణ కాదు. పొరుగునున్న కర్ణాటక, మహారాష్ట్ర కూడా ఇదే విధానాన్ని అమలు చేస్తున్నాయి. ఇది కేంద్రం నిర్దేశించిన విధానం. రాష్ట్రాలకు ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితులు పెంచే క్రమంలో కొన్ని అత్యుత్తమ విధానాలను, సంస్కరణలను తెస్తూ దానికి పన్ను సంస్కరణల్ని లింక్‌ చేసింది. ఆ ప్రకారం కేంద్రం జారీచేసిన ఉత్తర్వుల్లోని అంశాలను రాష్ట్రాలు అమలు చేశాయి. మిగతా రాష్ట్రాలతో పోలిస్తే మన రాష్ట్రమే తక్కువ రేటులో పెంపును అమలు చేసింది. పైపెచ్చు ఆస్తి సొంతదార్లకు భారం కాకుండా జాగ్రత్తలు తీసుకుంది.

ఆస్తి పన్ను కూడా 10– 15 శాతానికి మించకుండా పెంచాలని నిర్ణయించింది. 350 చదరపు అడుగుల్లో ఉంటున్న వారికి రూ.50 మాత్రమే పన్ను వేయటం ఈనాడుకు కనిపించలేదు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం భవనానికీ, ఆ భవనం ఉన్న స్థలానికీ కూడా కలిపి పన్ను వేయబోతోందని రాశారు. ఇది తప్పు. పన్నుల్ని 10 రెట్లు పెంచుతున్నారన్నది మరో తప్పు. పెరుగుదల 0.10 శాతం నుంచి 0.50 శాతం మాత్రమే ఉండబోతోంది. గతంలో పెంపునకు ఒక ప్రాతిపదిక ఉండేది కాదు. ప్రస్తుత విధానంలో ఇష్టం వచ్చినట్టు పెంచటానికి సాధ్యం కాదు. అదీకాకుండా ఆస్తి పన్నుకు సంబంధించిన డబ్బులు రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు రావు. ఆ డబ్బులు స్థానిక సంస్థలకే చెందుతాయి. తద్వారా స్థానిక సంస్థలు, అవి అందించే సేవలు మెరుగుపడటంతోపాటు బలోపేతం అవుతాయి. 

ఇసుకపై గాలి వార్తలు..
మొన్నటి వరకూ ఇదే ఈనాడులో ఎవరో శేఖర్‌రెడ్డికి రాష్ట్రంలో ఇసుకంతా ప్రభుత్వం అప్పగించబోతోందని, ఆయన బినామీలకు కూడా కొన్ని ప్రాంతాలను ఇస్తున్నారని రాసేశారు. తాజాగా కథనంలో కేంద్ర ప్రభుత్వ సంస్థకు ఇస్తున్నారని, తద్వారా టన్నుకు రూ.100 పెరగబోతోందని రాశారు. మరి శేఖరరెడ్డి మీద రాసిన వార్తకు విలువేమిటి? దీన్నేమనాలి? ధరలను చూసినా... ఇసుక ధరలను రాష్ట్ర ప్రభుత్వం ప్రాంతాల వారీగా, దూరం ప్రాతిపదికన నిర్ణయిస్తోంది. ఇసుక ధరకు అప్పర్‌ లిమిట్‌ పెడుతోంది. అదీగాక పక్క రాష్ట్రాల్లో ధరను బట్టి స్థానికంగా పెంచితే అందులో తప్పేముంది? ఇసుక అందరికీ అందుబాటులో ఉండాలి. అందుబాటు ధరలో ఉండాలి. విధానం అమలు పారదర్శకంగా జరగాలి. అవినీతి లేకుండా ఖజానా ఆదాయం పెరగాలి అన్నది తమ లక్ష్యమని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. రోజుకు వంద అబద్ధాలు రాసైనా టీడీపీని బతికించుకోవాలన్న ఆశ తప్ప నిజాలు చెప్పాలన్న ఆలోచనే ఈనాడుకు, మరో టీడీపీ తోక పత్రికకు లేవన్నది ఏ రోజు, ఏ వార్తను చూసినా అర్థంకాక మానదు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement