‘గోల్డెన్‌’ డేస్‌! | Gold prices have fallen drastically | Sakshi
Sakshi News home page

‘గోల్డెన్‌’ డేస్‌!

Published Thu, Aug 1 2024 4:55 AM | Last Updated on Thu, Aug 1 2024 4:55 AM

Gold prices have fallen drastically

భారీగా తగ్గిన బంగారం ధరలు

కేంద్రం దిగుమతి సుంకాన్ని తగ్గించడమే దీనికి కారణం

దీంతో 10 గ్రాములపై రూ.5,800 దాకా తగ్గుదల

ధర తగ్గడం, పెళ్లిళ్ల సీజన్‌ కావడంతో రద్దీగా బంగారు దుకాణాలు.. పెట్టుబడిగా పుత్తడిని కొంటున్న ప్రజలు

బంగారం ధరలు దిగొచ్చాయి. గత ఐదేళ్లుగా జెట్‌ స్పీడ్‌తో దూసుకెళ్తూ  రెట్టింపైన ధరలు ఒక్కసారిగా  తగ్గుముఖం పట్టాయి. ఈ స్థాయిలో ధరలు తగ్గడం చరిత్రలో ఇదే తొలిసారి.  దిగుమతి సుంకాన్ని తగ్గిస్తూ కేంద్ర  ప్రభుత్వం తీసుకున్న నిర్ణయమే దీనికి  కారణం. దీంతో బంగారం దుకాణాలు కొనుగోలుదార్లతో కిటకిటలాడు తున్నాయి. ‘శ్రావణం’ పెళ్లిళ్ల సీజన్‌  కావడంతో కొనుగోళ్లు మరింత  ఊపందుకున్నాయి. 

రాష్ట్రవ్యాప్తంగా బంగారం విక్రయాలు ఇలా.. (కేజీల్లో )
రోజుకు 107
నెలకు 3,210
ఏడాదికి  38,520

సాక్షి ప్రతినిధి, కర్నూలు: బంగారం ధరలు ఇటీవల వేగంగా పెరిగాయి. 2000 సంవత్సరంలో 10 గ్రాముల బంగారం ధర రూ.5 వేలుంటే.. 2019 నాటికి రూ.35 వేలకు చేరింది. గత ఐదేళ్లలో ఏకంగా రెట్టింపై.. రూ.70 వేల మార్క్‌ను దాటింది. 24 క్యారెట్ల ధర అత్యధికంగా రూ.75,050కు చేరితే, 22 క్యారె­ట్‌ రూ.68,800 వరకూ ట్రేడ్‌ అయింది.  బంగారం, వెండి, ప్లాటినంతో పాటు విలువైన లోహాలపై 10 శాతం బీసీడీ(బేసిక్‌ కస్టమ్‌ డ్యూటీ) ఉండేది. 

దీనికి అదనంగా ఏఐడీసీ(అగ్రికల్చర్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవలప్‌మెంట్‌ సెస్‌) 5% ఉండేది. కేంద్రం బీసీడీని 5శాతం, ఏఐడీసీని 4% తగ్గించింది. దీంతో కస్టమ్స్‌ సుంకాన్ని కేవలం 6 శాతానికే పరి­మి­తం చేసింది. జీఎస్‌టీలో మాత్రం మార్పు­ల్లేవు.. 3 శాతంగానే ఉంది. దీంతో మొత్తంగా జీఎస్‌టీతో కలిపి బంగారు, వెండిపై 18 శాతం ఉన్న సుంకం 9 శాతానికి తగ్గింది. దీంతో బంగారు, వెండి ధరలు భారీగా తగ్గాయి. ఈ వారం రోజుల్లో 10 గ్రాముల బంగారంపై రూ.6 వేల దాకా తగ్గింది. రూ.63 వేల వరకూ తగ్గిన బంగారం తిరిగి కాస్త పెరిగి రూ.63,850 చేరింది.  

ధరలు మరింత తగ్గే అవకాశం 
22 క్యారెట్ల ధర రూ.68,800 నుంచి రూ.63 వేలకు తగ్గింది. అంటే 5,800 తగ్గిందన్నమాట. కొన్ని ప్రాంతాల్లోని మార్కెట్లలో రూ.6 వేలకు పైగా తగ్గింది. అయితే మరింతగా ధరలు తగ్గే అవకాశం ఉందని మార్కెట్‌ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఈ నెల 5వ తేదీ నుంచి శ్రావణమాసం మొదలవుతుంది. పెళ్లిళ్ల సీజన్‌ కావడంతో బంగారు కొనుగోలుకు డిమాండ్‌ పెరిగింది. వివాహాల కోసం అన్ని వర్గాలు అనివార్యంగా కొనుగోలు చేయాల్సిన పరిస్థితి. ఈ కారణంగానే ప్రస్తుతం ధరలు స్థిరంగా ఉన్నాయని, శ్రావణం తర్వాత 10 గ్రాములపై మరో రూ.2 వేలు లేదా 3 వేల వరకూ ధరలు తగ్గే అవకాశం ఉందని ట్రేడ్‌ వర్గాల అంచనా.    

కొనుగోలుదారులతో కిటకిట   
శ్రావణమాసం, పైగా ధరలు భారీగా తగ్గడంతో బంగారం దుకాణాలు రద్దీగా మారాయి. నగదు దాచుకున్న వారు వడ్డీలకు డబ్బులివ్వడం కంటే బంగారంపై పెట్టుబడి పెట్టడం మేలని భారీగా కొనుగోలు చేస్తున్నారు. మూడు నెలల తర్వాత బంగారం ధర తిరిగి పుంజుకుంటుందని.. 24 క్యారెట్ల ధర రూ.80 వేల వరకూ చేరొచ్చని వ్యాపారులు చెబుతున్నారు. మరి కొద్దిరోజుల్లో శ్రావణ మాసం ప్రారంభం కానున్న నేపథ్యంలో బంగారం రేటు ఇంకా పెరిగే అవకాశం ఉందని మార్కెట్‌ వర్గాల అంచనా. 

ఏడాదికి రూ.28.89 వేల కోట్లు   
మలబార్, ఖజానా, జోయ్‌ అలూక్కాస్, లలిత లాంటి ప్రముఖ కార్పొరేట్‌ కంపెనీలు 10 వరకూ ఉన్నాయి. దాదాపు ప్రతి ఉమ్మడి జిల్లాలో వీటి బ్రాంచ్‌లున్నాయి. వీటిలో ప్రముఖమైన నాలుగు సంస్థల్లో రోజూ 1–1.5 కిలోల బంగారం విక్రయిస్తున్నట్టు తెలుస్తోంది. తక్కిన వాటిలో అరకిలో వరకూ విక్రయం అవుతోంది. వీటితో పాటు స్వర్ణకారుల దుకాణాల్లో విక్రయాలున్నాయి. 

ఇలా కార్పొరేట్‌ కంపెనీలు, స్వర్ణకారుల దుకాణాల్లో 13 ఉమ్మడి జిల్లాల్లో రోజూ సగటున 107 కిలోల బంగారం విక్రయం అవుతోందని తెలుస్తోంది. అంటే రాష్ట్రంలో నెలకు 3,210 కిలోలు విక్రయం జరుగుతోంది. రోజువారి బంగారం ధరలతో పాటు.. దానికి తరుగు, జీఎస్టీ కలిపితే సగటున ఒక కిలో రూ.75 లక్షల వరకూ పలుకుతోంది. ఈ లెక్కన నెలకు రూ.2,407 కోట్ల చొప్పున.. ఏడాదికి రూ.28.89 వేల కోట్ల విక్రయాలు జరుగుతున్నాయి. దీన్నిబట్టే బంగారం వ్యాపారం ఏ స్థాయిలో జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు.  

స్మగ్లింగ్‌ నివారణకే సుంకం తగ్గింపు.. 
బంగారు విక్రయాలు ‘భారత్‌’లో ఎక్కువ. దీంతో కేంద్రం దీనిపై మొన్నటి వరకూ జీఎస్టీతో కలిపి 18 శాతం సుంకం వసూలు చేసేది. దుబాయి, సౌదీ, కువైట్‌తో పాటు పలు గల్ఫ్‌ దేశాల్లో భారత్‌తో పోలి్చతే సుంకం సగాని కంటే తక్కువగా ఉంది. దీంతో గల్ఫ్‌కు, భారత్‌కు 10 గ్రాములపై రూ.7 వేల వరకూ ధరల్లో వ్యత్యాసం ఉంది. అందువల్లే గల్ఫ్‌ నుంచి వచ్చేవారు అక్రమంగా బంగారాన్ని తెచ్చేవారు. 

చెన్నై, హైదరాబాద్, బెంగళూరు, వైజాగ్, విజయవాడ విమానాశ్రయాల్లో నిత్యం ‘గోల్డ్‌ స్మగ్లింగ్‌’ వెలుగు చూసేది. పట్టుబడకుండా దేశంలోకి పోర్టులు, ఎయిర్‌పోర్ట్‌ల ద్వారా భారీగా చేరుతోందని కేంద్రం గ్రహించింది. స్మగ్లింగ్‌కు గల కారణాలపై ఆరా తీస్తే ధరల్లో వ్యత్యాసమేనని స్పష్టమైంది. అక్రమంగా వచ్చిన బంగారాన్ని కొనుగోలు చేసి నగలు తయారు చేసి మార్కెట్‌లో విక్రయిస్తున్నారు. దీంతో మన ఖజానాకు గండిపడుతోంది. 

ధరల్లో వ్యత్యాసాన్ని తగ్గించగలిగితే స్మగ్లింగ్‌ తగ్గుతుందని, అప్పుడు కొనుగోళ్లు దేశీయంగానే జరుగుతాయి కాబట్టి ఖజానాకు లాభం చేకూరుతుందని భావించిన కేంద్రం సుంకాన్ని తగ్గించింది. దీంతో పాటు బంగారాన్ని పెట్టుబడిగా భావించి కొనుగోలు చేసే వారి సంఖ్య ఎక్కువ. ధరలు తగ్గిస్తే నగదును దాచుకున్న వారు బంగారాన్ని కొనే అవకాశం ఉంది. దీంతో మార్కెట్‌లో నగదు చెలామణి పెరిగి.. దేశ ఆరి్థక వృద్ధికి దోహదపడుతుందని భావించి సుంకాన్ని తగ్గించారు. 

ధరలు తగ్గడం సంతోషకరం 
మొన్నటి దాకా బంగారం కొనాలంటే ధరలు షాక్‌ కొట్టేవి. 10గ్రాములు కొనాలంటే తరుగుతో కలిపి రూ.80 వేలు అయ్యేది. వారం కిందట ధరలు భారీగా తగ్గాయని తెలిసింది. మా అమ్మ నగలు కొందాం, మళ్లీ పెరుగుతాయంట అని చెప్పడంతో కొనుగోలు చేసేందుకు వచ్చాం. ధరలు తగ్గడంతో తులంపై రూ.5 వేల నుంచి  6 వేల దాకా ఆదా అవుతోంది.     –  అఖిల, కర్నూలు 

ధరలు తగ్గాయని కొనేందుకు వచ్చా.. 
బంగారం ధర తగ్గడమన్నది శుభావార్తే. పెళ్లిళ్ల సీజన్‌ కావడంతో సామాన్య, మధ్య తరగతి వారికి వెసులు బాటు లభించినట్టే. ధరలు తగ్గాయని తెలియగానే మళ్లీ పెరుగుతాయేమోనన్న ఆందోళనతోనే కొనేందుకు వచ్చాం. మా నాన్న గిఫ్ట్‌గా గోల్డ్‌ ఇప్పిస్తున్నారు. అయితే ధరలు ఇంకా తగ్గాలి. సామాన్యులకు మరింత  అందుబాటులోకి రావాలి.      – డాక్టర్‌ దివ్య, పీజీ విద్యార్థి, విశ్వభారతి క్యాన్సర్‌ హాస్పిటల్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement