మీ వైఫల్యాన్ని కప్పిపుచ్చేందుకు జగన్‌పై ఆరోపణలా? | YS Jagan questioned the government negligence in Veligonda | Sakshi
Sakshi News home page

మీ వైఫల్యాన్ని కప్పిపుచ్చేందుకు జగన్‌పై ఆరోపణలా?

Published Wed, Aug 21 2024 5:56 AM | Last Updated on Wed, Aug 21 2024 5:56 AM

YS Jagan questioned the government negligence in Veligonda

వెలిగొండలో ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ప్రశ్నించిన వైఎస్‌ జగన్‌

మాజీ సీఎం జగన్‌పై అబద్ధాలు వల్లె వేస్తూ మంత్రి గొట్టిపాటి విమర్శలు

గెజిట్‌ నోటిఫికేషన్‌లో వెలిగొండను చేర్చనివ్వకుండా అడ్డుకున్నారంటూ ఆరోపణలు

కృష్ణా జలాలపై రాష్ట్ర హక్కులను పరిరక్షించినదే వైఎస్‌ జగన్‌

సాక్షి, అమరావతి: పచ్చి అబద్ధాలకు బ్రాండ్‌ అంబాసిడర్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకు తగ్గట్లుగానే ఆయన మంత్రి వర్గ సహచరులు కూడా పచ్చి అబద్ధాలను వల్లె వేశారు. కడలి పాలవుతున్న కృష్ణా వరద జలాలను వెలిగొండ ప్రాజెక్టు ద్వారా కరువు ప్రాంతమైన ప్రకాశం జిల్లాకు అందించడంలో టీడీపీ ప్రభుత్వ వైఫల్యాన్ని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎక్స్‌ వేదికగా ప్రజల దృష్టికి తీసుకెళ్లారు. పూర్తయిపోయిన ఆ ప్రాజెక్టులో కేవలం రూ.1,200 కోట్లు వెచ్చించి నిర్వాసితులకు పునరావాసం కల్పిస్తే.. ప్రకాశం జిల్లాకు సాగు, తాగునీటిని అందించవచ్చుననే అంశాన్ని వైఎస్‌ జగన్‌ ఆ పోస్టులో ప్రస్తావించారు. 

వాస్తవాలను వివరించి ప్రభుత్వ వైఫల్యాన్ని మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ స్పష్టంగా చెప్పడంతో ప్రకాశం జిల్లా మంత్రులు గొట్టిపాటి రవికుమార్, డోలా బాలవీరాంజనేయస్వామి మీడియా ముందుకు వచ్చారు. చంద్రబాబు ప్రభుత్వం వైఫల్యాన్ని కప్పిపుచ్చడానికి వైఎస్‌ జగన్‌పైనే ఆరోపణలు చేశారు. కృష్ణా బోర్డు పరిధిని నిర్దేశిస్తూ 2021, జూలై 15న కేంద్ర జల్‌ శక్తి శాఖ జారీ చేసిన గెజిట్‌ నోటిఫికేషన్‌లో వెలిగొండ ప్రాజెక్టును చేర్చనివ్వకుండా అడ్డుకోవడం ద్వారా ప్రకాశం జిల్లాకు వైఎస్‌ జగన్‌ ద్రోహం చేశారంటూ వారిద్దరూ పచ్చి అబద్ధాలు వల్లె వేశారు. 

వాస్తవాలను వక్రీకరిస్తే అవాస్తవాలవుతాయా?
వైఎస్‌ జగన్‌ 2019, మే 30న సీఎంగా బాధ్యతలు స్వీకరించాక.. కృష్ణా వరద జలాలను ఒడిసి పట్టి రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయడంపై దృష్టి సారించారు. ఈ క్రమంలో 2020, అక్టోబర్‌ 6న జరిగిన అపెక్స్‌ కౌన్సిల్‌ రెండో సమావేశంలో కృష్ణా బోర్డు పరిధిని తక్షణమే నిర్దేశించి, ప్రాజెక్టులను బోర్డు అధీనంలోకి తెచ్చి రెండు రాష్ట్రాలకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. ఆ మేరకు కృష్ణా బోర్డు పరిధిని నిర్దేశిస్తూ 2021, జూలై 15న కేంద్ర జల్‌ శక్తి శాఖ గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది. అయితే విభజన చట్టంలో 11వ షెడ్యూలులోని ప్రాజెక్టులకు అనుమతి లేదని, వాటికి ఏడాదిలోగా అనుమతి తీసుకోవాలని ఆ నోటిఫికేషన్‌లో పేర్కొంది.

దీనిపై జగన్‌ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. వెలిగొండతో పాటు హంద్రీ–నీవా, గాలేరు–నగరి, తెలుగు­గంగ ప్రాజెక్టులకు విభజన చట్టం 11వ షెడ్యూలు ద్వారా అనుమతి ఉందని, వాటికి మళ్లీ అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదని నాటి సీఎం వైఎస్‌ జగన్‌ వాదించారు. దీంతో అప్పటి కేంద్ర జల్‌ శక్తి శాఖ మంత్రి షెకావత్‌ ఏకీభవించారు. ఆ నాలుగు ప్రాజెక్టులకు మళ్లీ అనుమతి తీసుకో­వాల్సిన అవసరం లేదంటూ 2022, జూలై 27న కేంద్రం గెజిట్‌ నోటిఫికేషన్‌ (ఉత్తర్వులు) జారీ చేసింది. 

హక్కులను తాకట్టు పెట్టింది బాబే..
విభజన చట్టంలో వెలిగొండ, హంద్రీ–నీవా, గాలేరు–నగరి, తెలుగుగంగ, కల్వకుర్తి(సా­మర్థ్యం పెంచనిది), నెట్టెంపాడు ప్రాజెక్టులను పూర్తి చేయడానికి కేంద్రం అనుమతి ఇచ్చింది. కానీ.. 2014 నుంచి 2019 వరకూ ఆ ప్రాజెక్టులకు అనుమతి లేదని కేంద్రం చెబుతూ వచ్చింది. వాటికి మళ్లీ అనుమతులు తీసుకోవా­ల్సిందేనని స్పష్టం చేస్తూ వచ్చింది. 

2016, సెప్టెంబర్‌ 21న నిర్వహించిన అపెక్స్‌ కౌన్సిల్‌ తొలి సమావేశంలో అప్పటి సీఎం చంద్రబాబు వెలిగొండ, హంద్రీ–నీవా, తెలుగుగంగ, గాలేరు–నగరికి మళ్లీ అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదని కనీసం వాదించలేక­పోయారు. తెలంగాణ సర్కార్‌ అనుమతి లేకుండా చేపట్టిన ప్రాజెక్టు­లను అడ్డుకోవడంలో విఫలమ­య్యారు. ఓటుకు కోట్లు కేసులో అడ్డంగా దొరికి­పోయిన చంద్రబాబు.. కృష్ణా జలాలపై రాష్ట్ర హక్కులను తెలంగాణకు తాకట్టు పెట్టారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement