జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ రాజకీయ నటనలో కూడా ఆరితేరే పనిలో ఉన్నట్టున్నారు. టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి వైఫల్యాలను తెలివిగా చంద్రబాబుపై నెట్టేసి తనకేమి సంబంధం లేనట్టు.. తానేమీ గతంలో హమీ ఇవ్వనట్లు తప్పించుకోవాలని చూస్తున్నారు. కొద్ది రోజుల క్రితం గ్రామ సభల కార్యక్రమంలో పవన్ మాట్లాడుతూ.. ‘‘ఉన్న పళంగా అద్బుతాలు చేయాడానికి నా దగ్గర మంత్ర దండం లేదు .నాకు ప్రజాబలం ఉండవచ్చు ఏమో కాని పాలన అనుభవం లేదు. సీఎం చంద్రబాబు వద్ద నేర్చుకోవడానికి సిద్దంగా ఉన్నా’’ అని అన్నారు .ఈ ప్రకటనలో ఏ మాత్రం చిత్తుశుద్ది అయినా కనిపిస్తోందా?.
సినిమాలో గనుక డైరెక్టర్లు రాసి ఇచ్చిన డైలాగులు చదివేసి ఆ సినిమా వైఫల్యం చెందినా.. తనకు సంబంధం లేదు అన్నట్టుగా వ్యవహరించే మాదిరిగానే రాజకీయాల్లోనూ పవన్ ప్రవర్తిసున్నట్టు కనిపిస్తోంది. ఆసత్యాలు, అర్ధ సత్యాలు చెప్పడంలో పవన్ ఘనాపాటిగానే మారారు. 2024 శాసన సభ ఎన్నికల ప్రచారంలో పవన్ ఎన్ని మాటలు చెప్పారో గుర్తుకు తెచ్చుకోండి. అప్పుడు తన వద్ద, చంద్రబాబు వద్ద మంత్ర దండం ఉన్నట్టుగానే.. ఎంతో అనుభవజ్ఞుడైనట్లుగానే ఇష్టారీతిలో వాగ్ధానాలు చేశారే. మరి అప్పుడు తాము అద్భుతాలు చేయలేం అనే సంగతి వీరికి తెలియాదా?. తెలుసు.. అయినా ప్రజలను ఎలా మోసం చేయాలి? అనే దాంట్లో పవన్ కూడా ఎక్కడ వెనక్కు తగ్గలేదు.
టీడీపీ అధినేత చంద్రబాబుతో కూటమి కట్టి బీజేపీ కాళ్లావేళ్లా పడి దానిని కూడా కూటమిలో కలిపిన పవన్.. ఇప్పుడు మంత్ర దండం గురించి కథలు చెబుతున్నారు. జనసేన కార్యకర్తలను, జనాలను పిచ్చివాళ్లను చేయాలని అనుకుంటున్నారు .అప్పట్లో చంద్రబాబుతో కలిసి వీరిద్దరు ఉమ్మడి మ్యానిఫేస్టో విడుదల చేసారా ? లేదా?.
.. అప్పుడు ఈ హమీల గురించి చంద్రబాబు చెబుతుంటే తనకు అనుభవం లేదని, అవన్నీ అయనే చూసుకుంటారని పవన్ చెప్పారా? అదేమి లేదే ?. పైగా అచరణ సాధ్యం కాని దిక్కుమాలిన హమీలన్నింటిని చంద్రబాబు తో పాటు ఈయన కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేసారు కదా?. 2014 లో మాదిరి ఆ హామీలకు పూచీ తనది అని అన్నారా? లేదా? దానికి సంబంధించిన వీడియోలు అందుబాటులో ఉన్నాయి.
వాటిని ఆయన ఒక్కసారి చూసుకుంటే.. తాను జనాన్ని మోసం చేశానా? లేదా? అనేది అయనకే అర్ధం అవుతుంది. ఇప్పుడు అమాయకంగా ఫేస్ పెట్టి చంద్రబాబుకు పాలనానుభవం ఉందని.. ఆయన దగ్గర నేర్చుకుంటానని కథలు చెబితే సరిపోతుందా?. ఆరోజుల్లో ఎన్నికల మ్యానిఫేస్టోను దగ్గర పెట్టుకుని... టీడీపీ సూపర్ సిక్స్ లోని అంశాలను సభల్లో ఏ అనుభవంతో చదివారు!. తల్లికి వందనం పేరుతో పిల్లలకు ఎంతమంది ఉంటే అంత మందికి పదిహేను వేల రూపాయల చొప్పున ఇస్తామని పవన్ అన్నారా లేదా ? మహిళలకు నెలకు రూ.2,500, నిరుద్యోగ భృతి రూ.3,000, బీసీలకు 50 ఏళ్లకే పింఛన్ అంటూ.. ప్రజలకు చెప్పి ఊరించారా లేదా ?. యువతకు ఒక్కొకరికి పది లక్షల రూపాయల అర్ధిక సాయం చేస్తామని హమీ ఇచ్చారు. ఇవన్నీ ఏ అనుభవం లేకుండా చెప్పారా!.
హామీల పేరుతో ప్రజలను పవన్ ఫూల్ చేశారు. ఏ మంత్రదండం ఉందని ఈ వాగ్ధానాలు చేశారు?. ఇప్పుడు అనుభవం లేదంటూ కాకమ్మ స్టోరీలు చెబుతున్నారు. అంటే దాని అర్ధం చంద్రబాబుదే ఈ పాపం అంతా అని చెప్పకనే చెబుతున్నారా?. అంతే కాదు మాటలు మార్చడంలో కూడా పవన్ ఏం తక్కువ తినలేదు.
తాజా ఊదాహరణ ఏంటంటే జగన్ హయంలో ఏక్కడైన పరిశ్రమల ప్రమాదాలు జరిగితే సేప్ఠి అడిట్ ఎందుకు చేయలేదు అని ప్రశ్నించిన ఈయన.. ఇప్పుడు సంబంధిత శాఖ మంత్రిగా సేఫ్టీ అడిట్ చేస్తే పరిశ్రమలు వెళ్లిపోతాయని అంటూ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. గతంలో వైస్సార్‌సీపీ మీద విరుచుకుపడిన ఈయన.. ఇప్పుడు నోరు తెరవకపోవడంలో మాత్రం అనుభవం సంపాదించారు. చంద్రబాబు నాయుడు వద్ద మరీ లొంగుబాటుగా వ్యవహరిస్తున్నారా? నటిస్తున్నారా? తెలియదు కాని మొత్తం మీద రాజకీయ సినిమా అయితే బాగానే నడుపుతున్నారు.
ఈయనకు రాజకీయ అనుభవం లేదా? అంటే.. 2009 నుంచి రాజకీయాల్లోనే ఉన్నారు. అబద్దాలు ,మాట మార్చడాలు తెలియదా? అంటే.. చంద్రబాబుతో పోటీపడి మరీ అబద్దాలు చెబుతూనే ఉన్నారు. మాటలు మారుస్తునే ఉన్నారు. యాభై ఏళ్ల వయసు దాటిన పవన్.. ఇప్పుడు తాను నోట్లో వేలు వేసుకుంటే కొరకని పసిబాలుడిలాగా మాయ చేసి.. తన సినీ నటనను ప్రదర్శిస్తున్నారు. ఆంధ్రా ప్రజలను పిచ్చి వాళ్లను చేశాంలే! అని లోపల సంతోషపడుతూ.. పైకి మాత్రం తెలివిగా తప్పించుకునే కథలు చెబుతున్నారు.
2009 లోనే ఈయన ప్రజ రాజ్యంలో యువరాజ్యం అధినేతగా ఉన్నారు. ఆరోజుల్లో చంద్రబాబును ఉద్దేశించి ఏమనే వారో తెలుసా?.. అవినీతి కిటికీలు తెరిచింది చంద్రబాబే అని ధ్వజం ఎత్తేవారు. 2009లో టీడీపీ-బీఆర్‌ఎస్(అప్పటి టీఆర్ఎస్), సీపీఎం, సిపీఐలతో ఏర్పాటు అయిన కూటమిని.. దోపిడి దొంగల కూటమిగా పవన్ అభివర్ణించేవారు. చంద్రబాబును గజదొంగతోను..కేసీఆర్‌ను తడిగుడ్డలతో గొంతులు కోసేవారిగా పోల్చారు. ఆ తర్వాత 2014 వచ్చేసరికి జనసేన పార్టీని స్థాపించి అదే చంద్రబాబుతో జట్టు కట్టి తనవల్లే కూటమి గెలిచిందని చెప్పకున్నారు.
ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా అని పవన్ తరచూ చెబుతుండేవారు. కానీ పైకి ప్రశ్నిస్తూ.. లోపల రాజీపడుతున్నారని చాలా మంది పవన్ మీద అభిప్రాయం పెంచుకున్నారు. టీడీపీతో కలిసి కాపురం చేసి ఆ తర్వాత వేరుపడి చంద్రబాబును, లోకేష్ వేలకోట్ల రూపాయల అవినీతి చేస్తున్నారని పవన్ ఆరోపణలు చేశారు. 2019 లో వామపక్షాలు,బిఎస్పీతో పోత్తుపెట్టుకుని ఓటమిపాలయ్యారు. అప్పట్లో జన్మభూమి కమిటీలను దగుల్బాజీ కమిటీలని ధ్వజమెత్తారు.
ఆ తర్వాత 2024లో అదే చంద్రబాబుతో.. మరోవైపు ప్రత్యేక హోదా బదులు పాచిపోయిన లడ్డూలు ఇచ్చారంటూ విమర్శించిన బీజేపీతోనూ పొత్తు పెట్టుకుని అధికారంలోకిచ్చారు. ఇచ్చిన హమీలు చాలా వరకు దొంగ హమీలు అని ఆయనకు తెలుసు కాబట్టే ఎక్స్‌పీరియెన్స్ లేదని చెప్పి తప్పించుకోవాలని చూస్తున్నారు. ఇన్నేళ్లుగా రాజకీయాల్లో ఉన్న వ్యక్తికి పాలన అనుభవం లేనంత మాత్రాన ఏమీ చేయలేనట్టుగా మాట్లాడితే.. అసలు ఆయన మంత్రి పదవికి అర్హుడు అవుతారా? అన్న ప్రశ్న పుడుతుంది.
పవన్ వ్యాఖ్యలు.. ఆయన్ని ఎన్నుకున్న ప్రజలను అవమానించడం కాదా?. అయనకు సహకరించడానికి ఐఎఎస్ లు ,పలువురు అధికారులు ఉంటారు. ఏమి చేయాలనుకున్నా వారికి చెబితే సరిపోతుంది. ఒకపక్క వైస్సార్‌సీపీపై దారుణమైన ఆరోపణలు ,విమర్శలు చేయడానికి అబద్దాలు ఆడడానికి.. తన అనుభవాన్ని ఉపయోగిస్తున్న పవన్, హమీల విషయంలో మాత్రం ప్రజలను మాయ చేయాలని అనుకుంటున్నారు. పవన్‌తో పాటు ఇతర మంత్రులు పలువురు సైతం కొత్తగా పదవుల్లోకి వచ్చిన వారే కదా!. వారు ఎవరు ఇలా చేతకాని మాటలు ఎందుకు చెప్పడం లేదు?. ఈయన మాత్రమే ఎందుకు మాట్లాడుతున్నారు. అంటే ఒక పార్టీ అధినేతగా చంద్రబాబుతో కలిసి అబద్దపు హమీలు ఇచ్చారు కనుక. దానికి తాను కూడా బాధ్యుడు కనుక. ఆ బాధ్యత నుంచి తప్పుకోవడానికి పవన్ తన సినీ నటన అనుభవాన్నే రాజకీయాల్లో ప్రదర్శిస్తున్నారు అని అనడంలో ఎవరికీ సందేహం అక్కర్లేదు.
:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు
Comments
Please login to add a commentAdd a comment