సీఐ క్షమాపణ కోసం ఎమ్మెల్యే ఓవరాక్షన్
సాక్షి టాస్‌్కఫోర్స్: సీఐ తన మాట వినలేదన్న ఆగ్రహంతో ఆయన క్షమాపణ చెప్పాలంటూ అనంతపురం జిల్లా తాడిపత్రి టీడీపీ ఎమ్మెల్యే జేసీ అస్మిత్‌రెడ్డి మంకుపట్టు పట్టారు. ముక్కుసూటిగా వ్యవహరించే తాడిపత్రి రూరల్ అప్‌గ్రేడ్ పోలీసు స్టేషన్ సీఐ లక్ష్మికాంతరెడ్డి క్షమాపణ చెప్పాలంటూ మందీ మార్బలంతో పోలీసు స్టేషన్ వద్ద ధర్నాకు దిగారు. ఎప్పుడూ రద్దీగా ఉండే తాడిపత్రి– కడప అంతర్‌జిల్లా రహదారిపై మూడున్నర గంటలకుపైగా వాహనాల రాకపోకలను అడ్డుకుని ప్రయాణికులు, ప్రజలకు నరకం చూపించారు.
జరిగిందిదీ: కూటమి అధికారంలోకి వచ్చాక తాడిపత్రి నియోజకవర్గంలో ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతోంది. అధికార పారీ్టకి చెందిన వారు పెన్నా నది నుంచి ట్రాక్టర్ల ద్వారా ఇసుక తెచ్చి పలు ప్రాంతాల్లో డంప్ చేసి.. అక్కడి నుంచి టిప్పర్లలో సజ్జలదిన్నె, తలారి చెరువు, ఊరుచింతల మీదుగా వైఎస్సార్ జిల్లాలోకి తరలిస్తున్నారు. ఎమ్మెల్యే జేసీ అనుచరులు సోమవారం అర్ధరాత్రి తలారి చెరువు సమీపంలో కాపు కాచి సొంత పార్టీ వారికే చెందిన రెండు ఇసుక టిప్పర్లను అడ్డుకున్నారు.
ఆర్జాస్ స్టీల్ ప్లాంట్ సమీపంలోని ఇసుక డంప్ వద్దకు కూడా వెళ్లి అక్కడున్న రెండు టిప్పర్లు, ట్రాక్టర్ తీసుకొచ్చి రూరల్ అప్‌గ్రేడ్ పోలీసు స్టేషన్‌లో అప్పగించారు. ఇసుక తరలిస్తున్న వారిపై కేసు పెట్టాలంటూ ఎమ్మెల్యే మంగళవారం అనుచరుల ద్వారా ఫిర్యాదును పోలీసు స్టేషన్‌కు పంపించారు. పోలీసు స్టేషన్‌కు వెళ్లిన ఎమ్మెల్యే అనుచరులు సీఐ తమతో దురుసుగా ప్రవర్తించారని ఎమ్మెల్యేకు ఫోన్ చేసి చెప్పారు. దీంతో ఆయన నేరుగా సీఐకి ఫోన్ చేశారు. ఇరువురి మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం జరిగింది. దీంతో ఆగ్రహించిన ఎమ్మెల్యే తన అనుచరులతో కలిసి తాడిపత్రి రూరల్ అప్‌గ్రేడ్ పోలీసు స్టేషన్ ఎదుట ధర్నాకు సిద్ధమయ్యారు.
తాడిపత్రి – కడప అంతర్ జిల్లా రహదారిపై ధర్నాకు దిగారు. దీంతో రహదారిపై వందలాది వాహనాలు నిలిచిపోయాయి. ప్రయాణికుల ఇబ్బందులను తాడిపత్రి డీఎస్పీ జనార్దన్ ఎమ్మెల్యేకు వివరించినా ఆయన పట్టించుకోలేదు. దీంతో విషయాన్ని ఎస్పీ దృష్టికి తీసుకెళ్లారు. ఉన్నతాధికారుల సూచన మేరకు వీడియో కాల్‌లో ‘వెరీ సారీ ఎమ్మెల్యే సర్’ అని సీఐ సారీ చెప్పారు. దీంతో ఎమ్మెల్యే అక్కడి నుంచి వెనుదిరిగారు.
Comments
Please login to add a commentAdd a comment