చైర్మన్ విశ్వనాథరెడ్డితో మాట్లాడుతున్న జేడీ రామాంజనేయులు, ఏడీఎం కళ్యాణి
లక్కిరెడ్డిపల్లి : కంచే చేను మేసిన చందంగా లక్కిరెడ్డిపల్లి మార్కెట్ యార్డులో రూ. 10,25,825లు నిధులను స్వాహా చేసిన వైనం సోమవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జేడీ రామాంజనేయులు, ఏడీఎం కళ్యాణిలు చైర్మన్ విశ్వనాథరెడ్డితో కలిసి రికార్డులు పరిశీలించగా మార్కెట్ యార్డులో పనిచేస్తున్న ఓ ఉద్యోగి రూ. 10,25,825లు నిధులు స్వాహా చేసినట్లు తేలింది. గత ఏడాది జూన్‌లో బదిలీపై లక్కిరెడ్డిపల్లికి వచ్చిన కార్యదర్శి రోజువారీగా అన్ని అకౌంట్లు పరిశీలిస్తుండేవారు. ఆయన రాకముందు లక్కిరెడ్డిపల్లి మార్కెట్ యార్డులో రూ. 6,06,940 ఆఫీసు ఖర్చులకు సంబంధించి నిధులు ఉండేవని, ఈ మొత్తాన్ని ఎవరికీ తెలియకుండా కార్యదర్శి ఒక్కడే రోజు కొద్దికొద్దిగా కాజేశాడని వారు తెలిపారు. ప్రస్తుతం ఆఫీసు యార్డు ఖాతాలో రూ. 11,006లు మాత్రమే ఉన్నట్లు చూపించారు. ఇప్పటికే ఆయన మార్కెట్ యార్డు ఖాతాలో నుంచి రూ. 5,95,934లు నిధులు స్వాహా చేసినట్లు తెలుస్తోందన్నారు. అదే ఆఫీసులో పనిచేస్తున్న మరో ఉద్యోగి రమణమ్మ ఖాతాలో పీఎఫ్ కింద రూ. 7,23,131లు ఉండేదని, ఆమె ఖాతాలో నుంచి రూ. 4,29,891లు కాజేసినట్లు తేలిందన్నారు. మొత్తం రూ. 10,25,825లు నగదును కార్యదర్శి స్వాహా చేసినట్లు రికార్డుల ప్రకారం స్పష్టమైందన్నారు. దీనిపై ఆ ఉద్యోగిని ప్రశ్నిస్తే తిరిగి డబ్బులు చెల్లిస్తానులే అని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పినట్లు యార్డు చైర్మన్ విశ్వనాథరెడ్డి తెలిపారు. ఈ విషయాన్ని వెంటనే ఆయన రాష్ట్ర కమిషనర్, జేడీ, ఏడీఎంల దృష్టికి తీసుకెళ్లారు. సోమవారం జేడీ రామాంజనేయులు, ఏడీఎం కళ్యాణీలు లక్కిరెడ్డిపల్లి మార్కెట్ యార్డుకు చేరుకొని రికార్డులు పరిశీలించారు. కాగా సోమవారం కార్యదర్శి విధులకు హాజరు కాలేదు. రికార్డులు పరిశీలించిన అధికారులు కార్యదర్శిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.
మార్కెట్ యార్డులో
హస్తలాఘవం ప్రద ర్శించిన సెక్రటరీ
అధికారుల పరిశీలనలో
వెలుగు చూసిన స్వాహా పర్వం
Comments
Please login to add a commentAdd a comment