కార్యాచరణకు సిద్ధమవుతున్న పార్టీలు, సంఘాలు
నోరు మెదపని కూటమి ఎమ్మెల్యేలు
కడప సెవెన్‌రోడ్స్: కొప్పర్తి ఎంఎస్‌ఎంఈ టెక్నాలజీ సెంటర్ కమ్ టెస్టింగ్ ఫెసిలిటీని అమరావతికి తరలిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తీసుకున్న నిర్ణయం జిల్లాలో ప్రకంపనలు రేపుతోంది. ఈ అంశంపై న్యాయపోరాటం చేస్తామని వైఎస్సార్ కాంగ్రెస్ ప్రకటించింది. సీపీఐ నాయకులు బుధవారం ఇందుకు సంబంధించిన జీఓ ప్రతులను దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు.
ప్రభుత్వ నిర్ణయాన్ని ఉపసంహరించుకోకపోతే ఆందోళనలు చేపడతామని రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ నాయకులు హెచ్చరించారు. వివిధ పార్టీలు, ప్రజా సంఘాలు భవిష్యత్ కార్యచరణకు సిద్ధమవుతున్నాయి. మీరా.. పెట్టరు....ఉన్న వాటిని అభివృద్ధి చెందిన అమరావతి ప్రాంతానికి తరలించుకుపోయి ప్రాంతీయ అసమానతలు మరింత పెంచుతారా.. ఇదే విజన్–2047 లక్ష్యమా? అని నేతలు ప్రశ్నిస్తున్నారు. ఇంత జరుగుతున్నా జిల్లాకు చెందిన ఎన్‌డీఏ కూటమి ఎమ్మెల్యేలు, నాయకులు నో రు మెదపకపోవడంపై సర్వత్రా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి.
వైఎస్‌ఆర్, జగన్ హయాంలోనే..
వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కొప్పర్తి మెగా ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. ఇందుకోసం అవసరమైన భూమిని సైతం సేకరించారు. నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎన్‌ఐసీడీసీ) ఆధ్వర్యంలో వైజాగ్–చైన్నె ఇండ్రిస్టియల్ కారిడార్ అభివృద్ధి అవుతోంది. ఇందులో భాగంగా కొప్పర్తి ఇండస్ట్రియల్ పార్కు ఉత్తర బ్లాక్ కోసం 3958 ఎకరాలు, దక్షిణ బ్లాక్‌కు 2781 ఎకరాలు కలిపి మొత్తం 6739 ఎకరాలను సేకరించి అభివృద్ధి చేశారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ ఏర్పాటైంది. మౌలిక సదుపాయాల కోసం రూ. 158.56 కోట్లను కేటాయించారు. అలాగే మైదుకూరు నుంచి పైపులైన్, ఎస్‌ఎస్ ట్యాంకు నిర్మాణం, కృష్ణాపురం నుంచి రైల్వేలైన్ వంటి పనుల కోసం ప్రధానమంత్రి గతిశక్తి పథకం కింద రూ. 225 కోట్లు మంజూరు చేయించారు. ఇప్పటికే అక్కడ కొన్ని పరిశ్రమలు ఏర్పాటై ఎంతోమంది ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పొందుతున్నారు.
టెక్నాలజీ సెంటర్ మంజూరు
కొప్పర్తి ఇండస్ట్రియల్ పార్కు మరింత అభివృద్ది చేసేందుకు గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి రూ. 250 కోట్ల వ్యయంతో టెక్నాలజీ సెంటర్‌ను తీసుకొచ్చారు. ఎంఎస్‌ఎంఈల మధ్య పోటీ పెంచేందుకు ఇది దోహదపడుతుంది. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విద్య, నైపుణాభివృద్ధి శిక్షణ ఇందులో కల్పిస్తారు. ఆలిండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఏఐసీటీఈ) అనుమతించిన యువతకు పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా, పోస్ట్ డిప్లొమా, అలాగే డిప్లొమా ప్రోగ్రామ్స్‌ను వివిధ ఇంజనీరింగ్ రంగాలకు సంబంధించిన కోర్సులను టెక్నాలజీ సెంటర్ అందిస్తుంది. దీంతోపాటు టూల్స్, మ్యానిఫ్యాక్చరింగ్, ఎంఎస్‌ఎంఈల అభివృద్ధ్దికి అవసరమైన సేవలు ఈ సెంటర్ ద్వారా పొందవచ్చు. ఇప్పటికే విశాఖలో ఒక సెంటర్ ఉండడంతో ప్రాంతాల మధ్య అభివృద్ధిలో అసమానతలు ఉండరాదన్న దృష్టితో జగన్ ప్రభుత్వం కొప్పర్తిలో ఈ సెంటర్‌ను మంజూరు చేయించింది.
నోరు మెదపని కూటమి నేతలు
రాయలసీమలోని ఇతర జిల్లాలతోపాటు ఉమ్మడి వైఎస్సార్ జిల్లాలో కూడా అధిక శాసనసభ స్థానాలను ప్రజలు టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలకు కట్టబెట్టారు. జిల్లాలో పారిశ్రామికాభివృద్ధి, నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాల పెంపునకు ఎంతగానో దోహదపడే కొప్పర్తి టెక్నాలజీ సెంటర్‌ను అమరావతి కి తరలిస్తూ ప్రభుత్వం మంగళవారం జీఓ ఎంఎస్ నెంబరు 56 జారీ చేసింది. దీనిపై ఎన్‌డీఏ కూటమి ప్ర జాప్రతినిధులుగానీ, నాయకులుగానీ నోరు మెదపక పోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment