ప్రతి ఫిర్యాదుకు పరిష్కారం చూపిస్తాం
– అదనపు ఎస్పీ వెంకటాద్రి
రాయచోటి : ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా అందుతున్న ఫిర్యాదులకు చట్టుపరిధిలో తప్పక పరిష్కారం చేస్తామని జిల్లా అదనపు ఎస్పీ వెంకటాద్రి పేర్కొన్నారు. సోమవారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఎస్పీ ఆదేశాల మేరకు జిల్లా అదనపు ఎస్పీ (అడ్మిన్) ఫిర్యాదు లను స్వీకరించారు. ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదులకు నిర్ణీత గుడువులోగా పరిష్కరించాలని పోలీసు అధికారులను ఆదేశించారు. ప్రజల నుంచి అదనపు ఎస్పీ నేరుగా ఫిర్యాదులను స్వీకరించి వారితో ముఖాముఖి మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఫిర్యాదులను సంబంధిత పోలీస్ అధికారులకు అప్పగించి సకాలంలో పరిష్కరించాలని ఆదేశించారు.
కుక్కల దాడిలో
మహిళకు గాయాలు
రామసముద్రం : కుక్కలు కాట్లాడుకుంటూ దారిలో వెళుతున్న మహిళపై పడటంతో గాయపడిన సంఘటన మండలంలోని చెంబకూరులో సోమవారం చోటు చేసుకుంది. చెంబకూరుకు చెందిన భారతమ్మ(60) దారిలో వెళుతుండగా కుక్కలు కాట్లాడుకుంటూ మహిళను కిందపడేశాయి. గాయాలపాలైన భారతమ్మను మదనపల్లె ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. గ్రామాల్లో కుక్కల బెడద అధికమైందని, రోడ్లపై ప్రయాణించాలంటే భయంగా ఉందని, అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
విద్యుదాఘాతంతో
పాడిఆవు మృతి
చిన్నమండెం : మండల పరిధిలోని దేవగుడిపల్లె గ్రామం జల్లావాండ్లపల్లెకు చెందిన రైతు శ్రీనివాసులురెడ్డికి చెందిన పాడిఆవు సోమవారం విద్యుదాఘాతంతో మృతి చెందినట్లు బాధిత రైతు తెలిపాడు. పాడి ఆవును గ్రామ సమీపంలో మేత కోసం వదలగా ట్రాన్స్‌ఫార్మర్‌కు ప్రమాదవశాత్తూ తగిలి మృత్యువాతపడింది. ఆవు విలువ సుమారు రూ.1.25 లక్షలు ఉంటుందన్నాడు. ప్రభుత్వం ఆదుకోవాలని బాధిత రైతు విజ్ఞప్తి చేశాడు.
25 లీటర్ల నాటుసారా స్వాధీనం
– నిందితుడి అరెస్ట్
మదనపల్లె : నాటుసారా తరలిస్తున్న వ్యక్తిని అరెస్ట్‌చేసి 25 లీటర్ల సారా స్వాధీనం చేసుకున్నట్లు ఎకై ్సజ్ సీఐ భీమలింగ తెలిపారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... మదనపల్లె మండలం బీకే.పల్లెకు చెందిన జి.కృష్ణ(59) ప్లాస్టిక్‌బ్యాగులో 25 లీటర్ల నాటుసారాను 500మి.లీ. చొప్పున 50 ప్యాకెట్లుగా ప్యాక్ చేసుకుని తరలిస్తుండగా, పట్టణంలోని సీటీఎం రోడ్డు పద్మావతి ఫంక్షన్ హాల్ వద్ద అరెస్ట్ చేశామన్నారు. నిందితుడి నుంచి సారా స్వాధీనం చేసుకుని, కేసు నమోదుచేసి రిమాండ్‌కు పంపినట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment