ఏపీఎండీసీ ఉద్యోగుల తొలగింపు తగదు
ఓబులవారిపల్లె : ఏపీఎండీసీలో పని చేస్తున్న ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులను కూటమి ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా ఒకే సారి వందలాది మందిని తొలగించం దారుణమని రాష్ట్ర వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు విమర్శించారు. సోమవారం ఆయన వైఎస్‌ఆర్ జిల్లా ఓబులవారిపల్లెలో విలేకరులతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రం రావణకాష్టంగా మారిందని, వారు చేస్తున్న అరాచకాలకు అడ్డూ అదుపులేకుండా పోయిందన్నారు. ఏపీఎండీసీలో పని చేస్తున్న దాదాపు 123 మంది ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులను ఒకే సారి తొలగించి నియంతృత్వాన్ని ప్రదర్శించారని పేర్కొన్నారు. దీంతో వందలాది మంది కుటుంబాలు రోడ్డున పడ్డాయన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తమ పాలనలో పార్టీలకు, కులాలకు అతీతంగా రాష్ట్రంలో దాదాపు రెండు లక్షల మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించారని గుర్తు చేశారు. యువగళం పాదయాత్రలో ఎన్నికల ప్రచారంలో చంద్రబాబునాయుడు, నారా లోకేష్‌లు రాష్ట్రంలో నిరుద్యోగులకు 20 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. అధికారంలోకి వచ్చి ఆరునెలలు పూర్తి అయినా ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదని విమర్శించారు. 20 లక్షల ఉద్యోగాల సంగతీ దేవుడెరుగు, ప్రస్తుతం పని చేస్తున్న ఉద్యోగులను తొలగించి వారి కడుపు కొడుతూ నిరుద్యోగులుగా మార్చేస్తున్నారని విమర్శించారు. రెండు లక్షల అరవై వేల మంది వలంటీర్లను, పదహైదు వేల మంది మద్యం షాపుల్లో పని చేస్తున్న ఉద్యోగులను, 123 మంది ఏపీఎండీసీ ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులను తొలగించారన్నారు. ఇందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేష్ బాధ్యత వహించాలని అన్నారు. ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను సామాజిక మాధ్యమాల్లో ప్రశ్నించిన ప్రజలపై కేసులు నమోదు చేయడం, వారిపై థర్డ్ డిగ్రీ ఉపయోగించి పౌరులకు రాజ్యంగం కల్పించిన భావస్వేచ్ఛ హక్కును కాలరాస్తున్నారని విమర్శించారు. వీటన్నింటిపై వైఎస్సార్‌సీపీ రాబోవు రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని పేర్కొన్నారు.
రోడ్డున పడ్డ కుటుంబాలు
యువగళం హమీలు ఎక్కడ ?
రాష్ట్ర అధికార ప్రతినిధి కొరముట్ల
Comments
Please login to add a commentAdd a comment