అదనపు పనులు చేయించొద్దని ఆశల ధర్నా
రాయచోటి అర్బన్ : ఆశ కార్యకర్తల చేత అధికారులు అదనపు పనులు చేయించరాదని సీపీఎం జిల్లా కార్యదర్శి శ్రీనివాసులు అన్నారు. ఏపీ ఆశ వర్కర్స్ యూనియన్ రాష్ట్రకమిటీ పిలుపు మేరకు సోమవారం జిల్లా కలెక్టరేట్ వద్ద ఆశ వర్కర్లు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆశ వర్కర్లపై కిందిస్థాయి అధికారుల వేధింపులు తీవ్రం కావడానికి జిల్లా వైద్యాశాఖ అధికారుల అలసత్వమే కారణమన్నారు. సీటీఎం పీహెచ్‌సీలో ఆశ వర్కర్లకు జనరల్ ఓపి డ్యూటీలు చేయాలని వైద్యాధికారులు వేధిస్తున్నారని, చేయ లేమంటున్న ఆశలను విధుల నుంచి తొలగిస్తామంటూ బెదిరిస్తుండడం దారుణమన్నారు. ఇంద్ర ధనుస్సు హౌస్ హోల్డ్స్ సర్వేకు సంబంధించిన ఫార్మెట్స్ ఇవ్వకుండా ఆశల చేత జిరాక్స్‌లకు డబ్బులు ఖర్చుచేయిస్తుండడం తగదన్నారు. ప్రభుత్వం రికార్డులు సరఫరా చేయకపోవడంతో వాటి కొనుగోలుకు ఒకొక్క ఆశవర్కరు రూ. 1500 నుంచి 2500 వరకు ఖర్చుచేస్తున్నారన్నారు. ఆశలకు అందుతున్న జీతం మీటింగ్‌లు, జిరాక్స్, రికార్డుల కొనుగోలుకు సరిపోతే వారు ఎలా బతుకుతారంటూ ఆయన మండిపడ్డారు. ఆశ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు జయమ్మ, మెహతాజున్సీసాలు మాట్లాడుతూ గతంలో నిర్వహించిన సమ్మె సందర్భంలో ప్రభుత్వం ప్రకటించిన అంశాలకు జీఓలను విడుదల చేసి వెంటనే ఆదుకోవాలన్నారు. ఈమేరకు ఆశ కార్యకర్తలు జిల్లా కలెక్టర్ చామకూరి శ్రీధర్‌కు వినతిపత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి రామాంజులు, ఆశ వర్కర్ల సంఘం నేతలు ఫామీద, లావణ్య, రమా, మణి, గాయత్రి, సుధామణి, చెంగమ్మ, ఓబులమ్మ, గంగాదేవి, రాములమ్మ, శ్యామల, నందిని, చంద్రకళ, అనిత, సరోజ, మంజుల, నిర్మల, షాహీద పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment