రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
పెద్దతిప్పసముద్రం : మండలంలోని టి.సదుం పంచాయతీ చెన్నరాయునిపల్లి సమీపంలో సోమవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో రామాంజి(35) మృతి చెందాడు. కర్ణాటక రాష్ట్రం చిలకలనేర్పు సమీపంలోని తులగనూరుకు చెందిన రామాంజి తన భార్య లక్ష్మిదేవి, కుమారుడు నిఖిల్ (6)తో కలసి ద్విచక్ర వాహనంలో వెళుతుండగా చెన్నరాయునిపల్లి సమీపంలో ప్రమాదవశాత్తు ద్విచక్ర వాహనం ట్రాక్టర్‌ను ఢీకొంది. ఘటనలో రామాంజి తీవ్రంగా గాయపడగా గ్రామస్థులు 108 వాహనం ద్వారా చికిత్స నిమిత్తం బి.కొత్తకోట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే పరిస్థితి విషమించి మార్గమధ్యంలో అతడు మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. ఘటనలో గాయపడిన భార్యా, కుమారుడిని చింతామణి ఆసుపత్రికి తరలించారు.
ఒంటిమిట్ట రామయ్యను
దర్శించుకున్న ఎస్పీ
ఒంటిమిట్ట : ఆంధ్రా భద్రాద్రిగా విరాజిల్లుతున్న ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయాన్ని సోమవారం అన్నమయ్య, కడప ఉమ్మడి జిల్లాల ఎస్పీ వి విద్యాసాగర్ నాయుడు సతీసమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వారికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి ఆలయ ప్రదక్షణగావించి, బాలాలయంలోని సీతారామ లక్ష్మణ విగ్రహాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వారిని సత్కరించి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.
బీచ్ వాలీబాల్
జిల్లా జట్టుకు ఎంపిక
నందలూరు : బీచ్ వాలీబాల్ అండర్–19 బాలురు, బాలికల జట్టును నాగిరెడ్డిపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని చెయ్యేరు ఒడ్డున ఎంపిక చేసినట్లు ఎస్‌జీఎఫ్ సెక్రటరీ శారద తెలిపారు. ఈ సందర్భంగా సోమవారం ఆమె మాట్లాడుతూ ఈ ఎంపికలలో 30 మంది క్రీడాకారులు పాల్గొన్నారన్నారు. బాల బాలికలలో ఇద్దరు క్రీడాకారులు మెయిన్ టీమ్‌కు ఎంపిక చేశామన్నారు. స్టాండ్ బైలుగా రెండు టీమ్‌లకు నలుగురిని ఎంపిక చేసినట్లు తెలిపారు. ఎంపికై న క్రీడాకారులు ఈనెల 23, 24వ తేదీలలో బాపట్లలో నిర్వహించే రాష్ట్రస్థాయి పోటీలలో పాల్గొంటారని తెలిపారు. బీచ్ వాలీబాల్ పోటీలకు టంగుటూరు ఫిజికల్ డైరెక్టర్ గణేష్ బాబు సెలక్టర్‌గా వ్యవహరించారన్నారు. పీఈటీ జగన్, ఫిజికల్ డైరెక్టర్లు, కోచ్‌లు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment