ట్రాన్స్‌ఫార్మర్ల దొంగలు అరెస్టు
రాజంపేట : రాజంపేట, రైల్వేకోడూరు, ఓబులవారిపల్లె, నందలూరు మండలాల పరిధిలో వ్యవసాయ పొలాల్లో వరుసగా ట్రాన్స్‌ఫార్మర్లు, వైర్ల దొంగతనాలకు పాల్పడిన ఏడుగురిని అరెస్టు చేసినట్లు మన్నూరు సీఐ ఎస్‌ఎం అలీ తెలిపారు. బుధవారం ఆయన విలేకరులకు వివరాలు వెల్లడించారు. నిందితులను రాజంపేట–రాయచోటి రోడ్డులోని బ్రాహ్మణపల్లె సమీపంలో 33 కేవీ సబ్‌స్టేషన్ వద్ద అదుపులోకి తీసుకున్నామన్నారు. ఏపీఎస్పీడీసీఎల్ ఏఈ లగిడి ఈశ్వరరాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు. అరెస్టయిన వారిలో పాకం శ్రీనివాసులు(మన్నూరు), బత్తల హరిప్రసాద్(శంకరాపురం, గుండ్లూరు), భూదేవల శ్రీనివాసులు(ఎగువగడ్డ, రాజంపేటటౌన్), మనుబోలు గణేష్(బలిజపల్లె, రాజంపేట టౌన్), కంభంపాటి వెంకటరమణ(గడ్డివీధి, రాజంపేట టౌన్), చెంచు వెంకటేశ్ (బోయనపల్లె), జ్యోతిప్రసాద్(గుండ్లూరు) ఉన్నారని తెలిపారు. వీరంతా జల్సాలకు అలవాటుపడి ట్రాన్స్‌ఫార్మర్ల దొంగలయ్యారన్నారు. మన్నూరు పోలీసు స్టేషన్ పరిధిలో 22 ట్రాన్స్‌ఫార్మర్లు, రాజంపేట అర్బన్ పరిధిలో 2 ట్రాన్స్‌ఫార్మర్లు, రైల్వేకోడూరు పరిధిలో 2 ట్రాన్స్‌ఫార్మర్లు, ఓబులవారిపల్లె పరిధిలో 1 ట్రాన్స్‌పార్మర్, నందలూరు పరిధిలో 1 ట్రాన్స్‌ఫార్మర్ చోరీకి గురయ్యారన్నారు. నిందితుల నుంచి రూ.2 లక్షల 5వేలు విలువ కలిగిన 200 కేజీల కాపర్ వైరు, రూ.25 వేలు విలువ కలిగిన ఐదు సీసీ కెమెరాలు స్వాధీనం చేసుకున్నామన్నారు. ఎస్‌ఐ నాగేశ్వరరావు, ఏఎస్‌ఐలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment