బంగారు షాపులపై వాణిజ్య పన్నుల శాఖ దాడులు
బి.కొత్తకోట : బి.కొత్తకోటలోని బంగారు దుకాణాలపై రాష్ట్ర వాణిజ్య పన్నులశాఖ అధికార బృందాలు బుధవారం మధ్యాహ్నం ఆకస్మిక దాడులు చేశాయి. కడప, తిరుపతి, మదనపల్లె నుంచి వచ్చిన పన్నులశాఖ అధికారులు ఐదు బృందాలుగా ఏర్పడి దుకాణాలపై దాడులు జరిపి తనిఖీలు చేపట్టారు. రాత్రి వరకు సోదాలు కొనసాగాయి. ఇటీవల రశీదులు లేకుండా బ్లాక్‌లో బంగారు, వెండిని బెంగళూరు నుంచి తరలించి దుకాణాలకు విక్రయిస్తున్నట్టు ఫిర్యాదులు అందాయి. దీంతో ఈ సోదాలు చేపట్టారు. మదనపల్లెతోపాటు వివిధ ప్రాంతాలకు చెందిన ఏసీటీఓ, డీసీటీఓ, సిబ్బంది సోదాల్లో పాల్గొన్నారు. సోదాలను మూడు దుకాణాల్లో చేపట్టగానే మిగిలిన దుకాణాలు మూతపడ్డాయి. బంగారాన్ని ఎక్కడి నుంచి తెస్తున్నారు, వాటికి బిల్లులు ఉన్నాయా లేవా, తెచ్చిన బంగారాన్ని విక్రయించిన రశీదులు, వాటికి పన్నుల చెల్లింపు, ఇతర రికార్డులను పరిశీలిస్తున్నారు. ఆదాయానికి సంబంధించి ఐటీ రిటర్న్‌ల దాఖలు, ఇన్‌వాయిస్‌లపై ఆరా తీస్తున్నారు. దుకాణాల్లో సోదాలు చేసిన అధికారులు వారి ఇళ్లలోనూ సోదాలు చేశారు. కాగా గత 20 ఏళ్లుగా బి.కొత్తకోటలో బంగారు దుకాణాలు చిల్లర దుకాణాల్లా వెలుస్తున్నాయి. బంగారు నగల వ్యాపారంలో ఎలాంటి అనుభవం లేని వ్యక్తులు కూడా నగల దుకాణాలను ఏర్పాటు చేశారు. దీంతో ఇక్కడ రోజుకు కనీసం రూ.2 కోట్లకుపైగా నగల వ్యాపారం జరుగుతున్నట్టు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment