40 వేల ఎకరాల్లో అడవుల పెంపకం
బి.కొత్తకోట: అన్నమయ్య జిల్లాలో అటవీశాఖకు రెవెన్యూ శాఖ కేటాయించిన 40వేల ఎకరాల్లో అడవుల పెంపకం చేపడుతున్నట్లు జిల్లా అటవీశాఖ అధికారి జగన్నాథ్ సింగ్ వెల్లడించారు. శనివారం బి.కొత్తకోట మండలం హార్సిలీ హిల్స్ పై అటవీ ప్రాంగణంలో ఆయన తనిఖీలు నిర్వహించారు. కాటేజీ నిర్మాణాలు తనిఖీ చేసి వాటిని త్వరితగతిన పూర్తి చేయాలని అటవీ సిబ్బందిని ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ 30 ఏళ్ల క్రితం జిల్లాలో 38 బ్లాకుల పరిధిలో రెవెన్యూ భూమి అటవీశాఖకు కేటాయించారన్నారు. ఇందులో కొందరికి డీకేటి పట్టాలు ఇచ్చినట్టు తెలిసిందన్నారు. ఈ పట్టాలను రద్దు చేయించి ఆక్రమణల తొలగింపుకు చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. ఈ భూమిలో మొక్క ల పెంపకం చేపట్టి అడవిగా పూర్తిస్థాయిలో అభివద్ధి చేస్తామన్నారు. హార్సిలీ హిల్స్ పై రూ.30 లక్షలతో కొత్తగా 5 కాటేజీల నిర్మాణం, పర్యాటకుల కోసం ట్రెక్కింగ్ పాత్, గార్డెన్ నిర్మాణ పనులు చేపట్టామన్నారు. తంబళ్లపల్లె సమీపంలోని మల్లయ్య కొండపై భక్తుల కోసం రూ.50 లక్షలతో కాటేజీల నిర్మాణం చేస్తున్నామన్నారు. బాలాయపల్లి, కోడూరు అటవీ ప్రాంతంలో దెబ్బతిన్న 16 కిలోమీటర్ల రహదారిని పునరుద్ధరిస్తున్నట్లు చెప్పారు. స్మగ్లింగ్ అడ్డుకోవడం, అగ్ని ప్రమాదాలు అరికట్టేందుకు ఈ రహదారి ఉపయోగపడుతుందని చెప్పారు. కర్ణాటక–ఆంధ్ర సరిహద్దుల్లో మూతపడిన చెక్ పోస్టులను తిరిగి తెరిపించేందుకు కృషి చేస్తామన్నారు. ఆయన వెంట సెక్షన్ ఆఫీసర్ అడపా శివకుమార్, సిబ్బంది ఉన్నారు.
హర్సిలీహిల్స్, మల్లయ్యకొండపై కాటేజీల నిర్మాణం
బాలాయపల్లి అడవిలో 14 కిలోమీటర్ల రోడ్డు
డీఎఫ్‌ఓ జగన్నాథ్ సింగ్ వెల్లడి
Comments
Please login to add a commentAdd a comment