కన్నబిడ్డలను కాటేసిన తండ్రి అరెస్టు
మదనపల్లె : కన్న కూతుళ్లపై అఘాయిత్యానికి పాల్పడిన కసాయి తండ్రిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు డీఎస్పీ డి.కొండయ్యనాయుడు తెలిపారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ...నిమ్మనపల్లె మండలం కొండయ్యగారిపల్లె పంచాయతీ వెంకోజిగారిపల్లె దాసరిపేటకు చెందిన చెన్నూరుబోయకొండ(30) కూలి పనులకు వెళుతూ, కుటుంబాన్ని నిర్లక్ష్యం చేసి మద్యానికి బానిసయ్యాడు. దీంతో అతడి భార్య చిట్టెమ్మ జీవనోపాధి కోసం ఊరురా తిరుగుతూ గాజులు విక్రయించేంది. వీరికి ఒక కుమారుడు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. తల్లి ఇంటిపట్టున లేకపోవడంతో అమ్మమ్మ పిల్లల బాగోగులు చూసుకునేది. ఈనెల 6వ తేదీన బోయకొండ ఇద్దరు కూతుళ్లు కడుపునొప్పి తాళలేకపోతున్నామంటూ అమ్మమ్మ, మేనమామతో చెప్పుకున్నారు. వారు ఎందుకని ఆరా తీయగా, తండ్రి చేసిన అఘాయిత్యాన్ని వివరించారు. దీంతో వారు సమాచారాన్ని తల్లి చిట్టెమ్మకు తెలపడంతో ఆమె నిమ్మనపల్లె పోలీస్ స్టేషన్‌లో భర్త బోయకొండపై ఫిర్యాదు చేసింది. రూరల్ సర్కిల్ సీఐ రమేష్ ఘటనా స్థలానికి వెళ్లి విచారించారు. ప్రాథమికంగా తండ్రి బోయకొండ బిడ్డలపై అఘాయిత్యానికి పాల్పడినట్లు నిర్ధారణ కావడంతో పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. డీఎస్పీ దర్బార్ కొండయ్యనాయుడు విచారణ చేశారు. నిందితుడు బోయకొండను శనివారం అరెస్టు చేసి రిమాండ్ నిమిత్తం కోర్టులో హాజరుపరిచినట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment