తల్లి మందలించిందని విద్యార్థిని ఆత్మహత్య
రామసముద్రం : ఓ యువకుడి మాయలో పడి మొబైల్‌లో చాటింగ్ చేస్తుండగా గమనించిన తల్లి బాలికను మందలించింది. దీంతో మనస్థాపానికి గురైన విద్యార్థిని ఇంట్లో ఉన్న విషం తాగి ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన రామసముద్రం మండలంలో శనివారం సాయంత్రం చోటుచేసుకుంది. ఎస్‌ఐ వెంకటసుబ్బయ్య, మృతురాలి కుటుంబీకులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కర్ణాటక రాష్ట్రం, రాయల్పాడుకు చెందిన ఆదినారాయణ, సుకన్యలకు కన్నేశ్వరి(16), జ్యోతి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ క్రమంలో భర్త తాగి బాధిస్తుండటంతో భర్తపై కోపంతో అలిగి పిల్లలతో కలిసి సుకన్య రామసముద్రంలోని బంధువుల ఇంటికి వచ్చేసి అద్దె ఇంట్లో ఉంటూ కుమార్తెలను కర్ణాటకలోని సోమయాజులపల్లెలో చదివించుకుంటోంది. పాఠశాలకు వెళ్తూ కన్నెశ్వరి అక్కడ ఓ యువకుడిమాయలో పడి చాటింగ్‌లు చేయడం, ఫోన్ మాట్లాడడం చేస్తుండటంతో తల్లి మందలించింది. దీంతో బాలిక విషం తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. గమనించిన కుటుంబీకులు రామసముద్రం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం మదనపల్లెకు తీసుకెళ్లారు. జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment