లారీ డ్రైవర్లపై ఖాకీ జులుం
మదనపల్లె: ఇద్దరు లారీ డ్రైవర్లపై తాలూకా పోలీసులు ఖాకీ జులుం ప్రదర్శించి ఓ డ్రైవర్ కాలు విరగ్గొట్టిన ఘటన మంగళవారం రాత్రి జరిగింది. జార్ఖండ్ రాష్ట్రం ధన్‌బాగ్‌కు చెందిన ఎండీ.అబీద్ కుమారుడు ఎండీ.నాహీద్(39) లారీ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. సొంత రాష్ట్రంలో పనులు లేకపోవడంతో ఉపాధి కోసం శ్రీ సత్యసాయిజిల్లా కదిరికి వలస వచ్చాడు. మంగళవారం ముదిగుబ్బ నుంచి తమిళనాడులోని ఈరోడ్ పేపర్‌మిల్లుకు కట్టెల లోడు వేసుకుని బయలుదేరాడు. రాత్రి 11.30 గంటల సమయంలో లారీ మదనపల్లె మండలం తట్టివారిపల్లె వెంగమాంబ సర్కిల్ వద్దకు రాగా, అక్కడ వాహనాలను తనిఖీ చేస్తున్న తాలూకా సీఐ కళా వెంకటరమణ, పోలీసులు లారీని ఆపారు. బండిని పక్కకు పెట్టి రికార్డులు, అనుమతిపత్రాలు తేవాల్సిందిగా కోరారు. లారీ డ్రైవర్ నాహిద్ రికార్డులు చూపించాక, ఐదువేలు జరిమానా కట్టాల్సిందిగా పోలీసులు ఆదేశించారు. దీంతో డబ్బులు తనవద్ద లేవని, ఓనర్‌తో మాట్లాడాల్సిందిగా డ్రైవర్ చెప్పాడు. పోలీసులు ఓనర్‌తో మాట్లాడితే...ఆయన తమ వద్ద అన్ని అనుమతులు ఉన్నాయని, పెనాల్టీ కట్టాల్సి వస్తే...అందుకు సంబంధించి బిల్లు ఇస్తే కట్టేందుకు తాను సిద్ధమేనని చెప్పాడు. వెనుకే తమకు చెందిన మరో లారీ వస్తోందని చెప్పాడు. దీంతో లారీ వచ్చేవరకు బండిలో ఉండాల్సిందిగా నాహిద్‌కు పోలీసులు చెప్పారు. అరగంట తర్వాత కదిరికి చెందిన మహబూబ్‌బాషా ఈరోడ్ పేపర్‌మిల్లుకు లారీలో కట్టెలలోడు వేసుకుని అక్కడకు వచ్చాడు. అతడి లారీని ఆపి రికార్డులు చూపమని పోలీసులు అడిగారు. చూపాక, ఫైన్ కట్టాలని పోలీసులు చెప్పారు. దీంతో అతను తమ యజమానితో మాట్లాడాలని చెప్పాడు. ఇద్దరు లారీ డ్రైవర్లు ఒకేలా చెప్పడంతో కోపం తెచ్చుకున్న సీఐ కళా వెంకటరమణ, ముందు లారీ డ్రైవర్ నాహీద్‌ను తీసుకురావాల్సిందిగా సిబ్బందిని ఆదేశించాడు. లారీ వద్దకు వెళ్లిన పోలీసులు, లాఠీలతో డోరును బలంగా కొట్టి నిద్రపోతున్న డ్రైవర్ నాహిద్‌ను కిందకు రావాల్సిందిగా గదమాయించారు. రికార్డులు మరోసారి తేవాల్సిందిగా కోరారు. లారీ బాక్స్‌లోని రికార్డులు తీసేలోపు ఎంతసేపు చేస్తావురా అంటూ బూతులు మాట్లాడటం ప్రారంభించారు. దీంతో కదిరికి చెందిన డ్రైవర్ మహబూబ్‌బాషా, అతడికి తెలుగు రాదని చెప్పాడు. ఇంతలో నాహిద్, తనను తిడుతున్న పోలీసులతో, నేను ఏం తప్పుచేశాను. ఏమన్నా యాక్సిడెంట్ చేసి పారిపోతున్నానా..? లేక దొంగవస్తువులు తోలుతున్నానా? నా వద్ద రికార్డులు లేవా ? ఎందుకు కొడుతున్నారంటూ హిందీలో ప్రశ్నించాడు. దీంతో చిర్రెత్తిపోయిన పోలీసులు మాకే ఎదురుచెపుతావా అంటూ లారీలో నుంచి డ్రైవర్ నాహిద్‌ను కిందకు లాగారు. డ్రైవర్ ఎదురు ప్రశ్నించిన విషయాన్ని సీఐ కళా వెంకటరమణకు పోలీసులు చెపితే, ఆయన నాహిద్ వద్దకు వచ్చి బూతులు మాట్లాడుతూ.. కింద పడవేసి కాలితో తన్ని, పోలీసులు విచ్చలవిడిగా చితకబాదారు. దీంతో డ్రైవర్ నాహిద్ స్పృహతప్పి పడిపోగా, వీడు యాక్టింగ్ చేస్తున్నాడు, మరో నాలుగు తగిలించండంటూ సీఐ పోలీసులను పురమాయించాడు. అనంతరం అక్కడి నుంచి పోలీసులు వెళ్లిపోగా, స్పృహతప్పి పడి ఉన్న డ్రైవర్ నాహిద్‌ను బుధవారం ఉదయం మహబూబ్‌బాషా ఆస్పత్రికి తీసుకువచ్చాడు. పరీక్షించిన వైద్యు లు ఎడమకాలు విరిగిపోయినట్లు నిర్ధారించారు. దీంతో మరో డ్రైవర్ మహబూబ్‌బాషా, స్థానిక లారీ అసో సియేషన్‌కు జరిగిన విషయం చెప్పడంతో రాష్ట్రీయ చాలక్ ఏక్తా మహామంచ్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షు డు బాబ్‌జాన్, తోటి డ్రైవర్లతో కలిసి ఆస్పత్రికి చేరుకు ని బాధితుడికి అండగా నిలిచారు. తాలూకా సీఐ కళా వెంకటరమణపై డీఎస్పీకి ఫిర్యాదు చేయాలని అసోసియేషన్ సభ్యులు తీర్మాణించుకున్నారు. ఈలోపు జిల్లా ఆస్పత్రి పరిశీలనకు వచ్చిన ఎమ్మెల్యే షాజహాన్‌బాషా బాధితుడిని పరామర్శించి, న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. దీంతో తనకు ఇబ్బంది కలుగుతోందని తెలుసుకున్న తాలూకా సీఐ కళావెంకటరమణ, జిల్లా ఆస్పత్రికి చేరుకుని కావాలనే రాద్ధాంతం చేస్తున్నారని డ్రైవర్ మహబూబ్‌బాషాతో వాగ్వాదానికి దిగారు. ఆస్పత్రి ఆవరణలో అందరూ చూస్తుండగా, పోలీసు విధులకు ఆటంకం కలిగించి, కాలర్ పట్టుకున్నావని, నీపై కేసు పెట్టి లోపల వేస్తానంటూ బెదిరించారు. స్టేషన్‌కు పద అంటూ చొక్కా పట్టుకుని లాగారు. తాను రానంటున్నా, బలవంతంగా లాక్కెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో లారీ అసోసియేషన్ సభ్యులు బాధితులను తామే డీఎస్పీ కార్యాలయానికి తీసుకువస్తామని, మీరు వెళ్లాలని చెప్పడంతో అక్కడి నుంచి సీఐ వెళ్లిపోయారు. బాధితులతో కలసి అసోసియేషన్ సభ్యులు డీఎస్పీ కార్యాలయానికి చేరుకున్నారు. సమయానికి డీఎస్పీ అందుబాటులో లేకపోవడంతో మరోసారి సీఐ వారితో వాగ్వాదానికి దిగి బ్లాక్ మెయిల్ చేస్తున్నారా అంటూ వారిని బెదిరించారు. తాము న్యాయం కోసం ఇక్కడకు వచ్చామని, బతుకుతెరువుకు డ్రైవర్‌గా పనిచేసే తమపై ఇలాంటి జులుం ప్రదర్శిస్తే తామెలా బతకాలని వాపోయారు. డీఎస్పీతో ఫోన్‌లో మాట్లాడిన అసోసియేషన్ సభ్యులు.. ఆయన రాక కోసం సాయంత్రం వరకు కార్యాలయం వద్దే వేచి చూశారు. ఈ విషయమై తాలూకా సీఐ కళా వెంకటరమణ మాట్లాడుతూ... వాహనాల తనిఖీలో భాగంగా లారీని నిలిపి రికార్డులు చూపమని అడిగితే జార్ఖండ్ డ్రైవర్ నాహిద్ నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో పాటు పోలీసులపై ఎదురుతిరిగాడన్నారు. దీంతో మందలించామన్నారు. తప్పితే పోలీసులు అతడిపై దాడి చేయలేదన్నారు. డీఎస్పీ కొండయ్యనాయుడు లారీ డ్రైవర్స్ అసోసియేషన్ సభ్యుల సమక్షంలో పోలీసులకు, బాధితులకు మధ్య రాజీ కుదిర్చినట్లు తెలిసింది.
జార్ఖండ్ డ్రైవర్ కాలు విరగ్గొట్టిన
పోలీసులు
బాధితుడికి అండగా
లారీ అసోసియేషన్ నాయకులు
రాజీ కుదుర్చుకునేందుకు
పోలీసుల విశ్వప్రయత్నాలు
కుదరకపోవడంతో కేసులు పెడతామని బెదిరింపులు
తాలూకా సీఐ ఆగడాలపై
డీఎస్పీకి బాధితుల ఫిర్యాదు
Comments
Please login to add a commentAdd a comment