అమ్మచెరువుమిట్టలో ఆక్రమణల తొలగింపు
మదనపల్లె : అమ్మచెరువుమిట్ట హౌసింగ్ లేఅవుట్‌లో ప్రజా అవసరాల కోసం ఖాళీగా ఉంచిన స్థలంలో అక్రమార్కులు నిర్మించిన పునాదులను బుధవారం రెవెన్యూ అధికారులు తొలగించారు. అమ్మచెరువుమిట్టలో కమ్యూనిటీ పర్పస్ కోసం వదలిన స్థలంలో కొందరు వ్యక్తులు దౌర్జన్యంగా ఆక్రమించుకుని పునాదులు నిర్మించినట్లు స్థానికులు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో ఫిర్యాదు చేశారు. దీంతో ఆర్‌ఐ శేషాద్రి, వీఆర్‌ఓలు శివశంకర్, భరత్, కల్యాణి, శ్రీనివాసులు అమ్మచెరువుమిట్టకు వెళ్లి జేసీబీ సహాయంతో పునాదులు తొలగించారు.
భూకబ్జాదారులపై కఠిన చర్యలు తీసుకోవాలి
రాయచోటి అర్బన్ : రాయచోటి పట్టణ పరిధిలో ప్రభుత్వ భూములను కబ్జా చేస్తున్న వారిపై అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ పార్టీ రాష్ట్ర నేత బి.ఓబయ్య, అన్నమయ్య జిల్లా నేత ఎం.విశ్వనాథ డిమాండ్ చేశారు. పట్టణ పరిధిలోని మాసాపేట ఇందిరమ్మ కాలనీలో కబ్జాకు గురైన ప్రభుత్వ స్థలాలను వారు బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కాలనీకి సమీపంలోని ప్రభుత్వ స్థలంలో కొందరు కబ్జాదారులు అక్రమంగా ఇళ్లకు పునాదులను నిర్మించారన్నారు. మరికొందరు స్థలాలను కబ్జాచేసి పేదలకు ఇష్టారాజ్యంగా విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారని ఆరోపించారు. విషయం తెలిసినప్పటికీ రెవెన్యూ యంత్రాంగం చూసీచూడనట్లు వ్యవహరిస్తుండడం దారుణమన్నారు. కబ్జాకు గురైన స్థలాలను స్వాధీనం చేసుకుని అర్హులకు పంచిపెట్టాలన్నారు. లేనిపక్షంలో పేదలతో కలిసి ఆందోళన చేపడతామన్నారు.
అట్టపెట్టలతో
అయోధ్య రామ మందిరం
పుల్లంపేట : దళవాయిపల్లి ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు రమణ అట్టపెట్టెలతో అయోధ్య రామ మందిరం నమూనా తయారు చేశారు. అయోధ్య రామ మందిరంలో బాలరాముని ప్రాణ ప్రతిష్ట జరిగి ఏడాది పూర్తయిన సందర్భంగా దీన్ని తయారు చేసినట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment