![మార్చి 5 నుంచి ఒంటిమిట్టలో మహాసంప్రోక్షణ](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/12/11rjpt201a-170076_mr-1739334219-0.jpg.webp?itok=WNmNMzMq)
మార్చి 5 నుంచి ఒంటిమిట్టలో మహాసంప్రోక్షణ
ఒంటిమిట్ట: ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో మార్చి 5 నుంచి 9వ తేదీ వరకు మహా సంప్రోక్షణ కార్యక్రమం శాస్త్రోక్తంగా నిర్వహించనున్నట్లు టీటీడీ జేఈఓ వి.వీరబ్రహ్మం తెలిపారు. ఇక్కడ జరుగుతున్న జీర్ణోద్ధరణ మరమ్మతులు, బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై మంగళవారం జేఈఓ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గర్భాలయంలో జీర్ణోద్ధరణ కోసం గత ఏడాది సెప్టెంబర్ 6 నుంచి 8వ తేదీ వరకు బాలాలయం నిర్వహించినట్లు తెలిపారు. సకాలంలో ఆలయ పునరుద్ధరణ పనులను పూర్తి చేయాలని టీటీడీ అధికారులను కోరారు. మార్చి 5 నుంచి 9వ తేదీ వరకు ఆలయంలో మహా సంప్రోక్షణ నిర్వహించి భక్తులకు మూలమూర్తి దర్శనం కల్పించనున్నట్లు తెలియజేశారు. కడప జిల్లా యంత్రాంగంతో సమన్వయం చేసుకొని స్వామివారి బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహిస్తామన్నారు. అనంతరం జేఈఓ కల్యాణ వేదిక వద్ద జరుగుతున్న అభివృద్ది పనులను అధికారులతో కలిసి పరిశీలించి పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో సీఈ సత్యనారాయణ, ఎస్‌ఈ వెంకటేశ్వర్లు, డిప్యూటీ ఈఓ పీవీ నటేష్ బాబు, విజీఓ సదాలక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment