పరాకాష్టకు ‘అధికార’ దౌర్జన్యాలు
హైవే వెంట నిర్వహిస్తున్న రెస్టారెంట్‌కు దారి లేకుండా తవ్వేసిన వైనం
పర్చూరు (చినగంజాం): అధికార పార్టీ దౌర్జన్యాలు పెచ్చుమీరుతున్నాయి. ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలైనా పూర్తి కాకుండానే వారి అధికార దర్పాన్ని చూపిస్తున్నారు. పర్చూరు మండలం పెద్దివారిపాలెం గ్రామానికి చెందిన కొడవలి అప్పయ్యచౌదరి అపర్ణ రెస్టారెంట్ పేరుతో పర్చూరు హైవే పక్కన హోటల్ నడుపుకొంటున్నాడు. తాను హోటల్ నడుపుకొనేందుకు స్థలాన్ని లీజుకు తీసుకొని పక్కా నిర్మాణం చేసుకొని గత కొంత కాలంగా నిర్వహిస్తున్నాడు. ఈనేపథ్యంలో పర్చూరు గ్రామ పంచాయతీ హోటల్ ముందు భాగంలో ఆర్‌అండ్‌బీ రోడ్డును ఆక్రమించుకొని, డ్రైనేజీ నీరు పోనివ్వకుండా మూసేశాడంటూ ఈ నెల 4 వతేదీ అప్పయ్య చౌదరికి నోటీసులు జారీ చేశారు. నోటీసులు జారీ చేసిన వెంటనే 5వ తేదీ మంగళవారం పంచాయతీ కార్యదర్శి తన వెంట పోలీసు సిబ్బందిని తీసుకొని రెండు పొక్లెయిన్‌లు సైతం తెచ్చి హడావుడిగా హోటల్‌కు అడ్డంగా ఆర్‌అండ్‌బీ రోడ్డుకు సమాంతరంగా మట్టిని తొలగించారు. ఫలితంగా హోటల్‌కు వెళ్లే మార్గాన్ని పూర్తిగా తొలగించారు.
రాజకీయ కక్షతోనే..
తాను ఎటువంటి ఆటంకం లేకుండా హోటల్ నిర్వహించుకుంటున్నానని.. అధికార పార్టీ నాయకులు తనపై కక్ష కట్టి హోటల్ మార్గాన్ని తొలగించి ఇబ్బందులకు గురిచేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని హోటల్ నిర్వాహకుడు అప్పయ్య చౌదరి ఆరోపిస్తున్నాడు. నోటీసులు ఇచ్చి సమాధానం ఇచ్చే అవకాశం లేకుండా వెంటనే మార్గంలోని మట్టిని తొలగించి భారీగా గొయ్యి చేశారన్నారు. తాను పెద్దివారిపాలెం సర్పంచ్‌గా ఉన్నానని, వైఎస్సార్ సీపీకి కార్యకర్తగా ఉన్న తనపై అప్పటి అధికార టీడీపీ తనపై కేసులు పెట్టి ఇబ్బందులకు గురిచేశారని, మళ్లీ ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటినుంచి తనపై కక్ష సాధించే కార్యక్రమంలో భాగంగా ఇబ్బందులు గురిచేస్తున్నారని చెప్పాడు. ప్రతి రోజు హోటల్ దగ్గరకు పోలీసులు వచ్చి మానసికంగా భయాందోళనకు గురిచేస్తూ మంగళవారం ఈ దుశ్చర్యకు పాల్పడ్డారని తెలిపాడు. అధికార పార్టీ వేధింపులు భరించలేని పరిస్థితిలో ఇటీవల సర్పంచ్ పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరానని అన్నాడు. అయినప్పటికీ అధికార పార్టీ వారు నాపై దౌర్జన్యం ఆపక మంగళవారం ఈ దారుణానికి పాల్పడ్డారని తెలిపారు. భవిష్యత్‌లో మరికొన్ని చర్యలు నాపై చేపట్టి ఇబ్బందులు గురి చేసే అవకాశం ఉంటుందని ఆయన ఆవేదనతో మాట్లాడారు. ఈ విషయమై గ్రామ కార్యదర్శి మస్తాన్‌వలిని వివరణ కోరగా రెస్టారెంట్ పక్కన ఉన్న అంబేడ్కర్ సామాజిక భవనం నిర్వాహకులు, హ్యూమన్ రైట్స్ వారు పంచాయతీలో వర్షపు నీరు పోయే మార్గం లేకు ఇబ్బందిగా ఉందని పంచాయతీలో ఫిర్యాదు చేసిన మీదట 4వ తేదీ సదరు హోటల్ యాజమాన్యానికి నోటీసులు జారీ చేసి మంగళవారం డ్రైనేజీకి అనుకూలంగా మట్టి తొలగించామని చెప్పారు. బుధవారం హోటల్‌కు మార్గం కల్పిస్తామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment