‘పచ్చ’ పంచాయితీ వాయిదా!
సాక్షి ప్రతినిధి,బాపట్ల: జిల్లా పచ్చపార్టీలో ఇంటిపోరు పంచాయితీ వాయిదా పడింది. జిల్లాలోని పలువురు పచ్చపార్టీ ప్రజాప్రతినిధుల మధ్య విబేధాలు పతాకస్థాయికి చేరి రోడ్డెక్కడంతో పంచాయితీ పెట్టి మందలించాలని ముఖ్యమంత్రి జిల్లా ఇన్‌చార్జి మంత్రి పార్థసారథిని ఆదేశించారు. దీంతో మంగళవారం డీఆర్‌సీ సమావేశానికి బాపట్ల వచ్చిన ఇన్‌చార్జి మంత్రి మధ్యాహ్నం తర్వాత జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలతో పార్టీలో రచ్చపై పంచాయితీ పెట్టేందుకు సిద్ధమయ్యారు. అయితే ప్రధానంగా గొడవ పడుతున్న బాపట్ల ఎమ్మెల్యే నరేంద్రవర్మ, ఎంపీ కృష్ణప్రసాద్‌లు డీఆర్‌సీకి హాజరు కాలేదు. బాపట్ల ఎమ్మెల్యే వర్మ విదేశాలకు వెళ్లగా ఎంపీ కృష్ణప్రసాద్ డీఆర్సీ సమీవేశానికి డుమ్మా కొట్టారు. ఇక అక్రమాలు, అవినీతి ఆరోపణలతోపాటు సొంతపార్టీ నేతల నుంచి వ్యతిరేకత ఎదుర్కొంటున్న పర్చూరు నియోజకవర్గ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు సైతం విదేశాల్లో ఉండడంతో డీఆర్‌సీకి రాలేదు. ఇదే పరిస్థితుల్లో కొట్టు మిట్టాడుతున్న చీరాల ఎమ్మెల్యే డీఆర్‌సీకి హాజరైనా బాపట్ల, పర్చూరు ఎమ్మెల్యేలతోపాటు ఎంపీ అందుబాటులో లేకపోవడంతో ఇన్‌చార్జి మంత్రి పచ్చనేతల పంచాయితీని వాయిదా వేశారు. జిల్లా మంత్రులు అనగాని సత్యప్రసాద్, గొట్టిపాటి రవికుమార్‌లతో మాట్లాడిన ఇన్‌చార్జి మంత్రి వారి సూచనల మేరకు అందరూ ఉన్నప్పుడు పంచాయితీ నిర్విహించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. దీంతో సాయంత్రం జిల్లా టీడీపీ కార్యాలయంలో కార్యకర్తలతో సమావేశం నిర్వహించి మంత్రి వెళ్లి పోయారు.
టీడీపీ నేతలపై జనసేన, బీజేపీ నేతల ఫిర్యాదు..
జిల్లాలోని టీడీపీ ఎమ్మెల్యేలు తమను పట్టించుకోవడంలేదని, కలుపుకొని పోవడంలేదని జిల్లాకు చెందిన జనసేన, బీజేపీ నేతలు కొందరు జిల్లా ఇన్‌చార్జి మంత్రి కొలుసుల పార్థసారధి, మంత్రి అనగాని సత్యప్రసాద్‌లకు ఫిర్యాదు చేశారు. మంగళవారం జిల్లాకు వచ్చిన మంత్రులను కలిసి వారు టీడీపీ నేతల పై ఫిర్యాదులు చేసినట్లు సమాచారం. ఎన్నికల్లో తాము టీడీపీ అభ్యర్థుల గెలుపుకు కృషిచేశామని, గెలిచిన తర్వాత నాయకులు తమను పట్టించుకోవడంలేదని వారు చెప్పినట్లు తెలుస్తోంది. అధికారుల బదిలీల్లో టీడీపీ ఎమ్మెల్యేలు ఏకపక్షంగా వ్యవహరించారని, పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడినట్లు రెండు పార్టీల నేతలు ఫిర్యాదు చేశారు. బదిలీల్లో తమకు ఏమాత్రం ప్రాధాన్యత నివ్వలేదన్నారు. ముఖ్యంగా బాపట్ల తోపాటు జిల్లాలోని కొందరు శాసనసభ్యులు తమను ఏమాత్రం గౌరవించడంలేదన్నారు. ఎమ్మెల్యేలు చేస్తున్న పలు అక్రమాల వివరాలను సైతం మంత్రులకు ివివరించినట్లు సమాచారం. అందరినీ సమన్వపరిచి పరిస్థితులు చక్కదిద్దుతామని మంత్రులు జనసేన, బీజేపీ నేతలకు హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.
అందుబాటులో లేని బాపట్ల ఎంపీ, ఎమ్మెల్యేలు విదేశాల్లో ఎమ్మెల్యేలు నరేంద్రవర్మ, ఏలూరి సాంబశివరావు ఎంపీ కృష్ణప్రసాద్, ఎమ్మెల్యేనరేంద్రవర్మల మధ్య విభేదాలు డీఆర్సీకి ఎగనామం పెట్టిన ఎంపీ కృష్ణప్రసాద్
Comments
Please login to add a commentAdd a comment