సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి
బాపట్ల: అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేసినప్పుడే బాపట్ల జిల్లా అభివృద్ధి పట్టాలపై పరుగులెడుతుందని జిల్లా ఇన్‌చార్జి మంత్రి, రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. జిల్లా అభివృద్ధి సమీక్ష కమిటీ సమావేశం మంగళవారం స్థానిక కలెక్టరేట్‌లో జరిగింది. సమావేశంలో జిల్లా అభివృద్ధిపై ప్రజాప్రతినిధులు సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం డీఆర్‌సీ సమావేశంలో చర్చించిన అంశాలపై జిల్లా ఇన్‌చార్జి మంత్రి పార్థసారథి మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ప్రజాస్వామ్యంలో ప్రజా ప్రతినిధులు, అధికారులు కలిసి పనిచేస్తేనే ప్రజలకు మేలు జరుగుతుందని మంత్రి పార్థసారథి చెప్పారు. బాపట్ల జిల్లాకు 95 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉందని, పర్యాటకంగా వివిధ ప్రాజెక్టులతో అభివృద్ధి చేయగలిగితే అన్ని రంగాలలో రాణించగలమన్నారు. సూర్యలంక బీచ్ అభివృద్ధికి సమగ్ర ప్రణాళిక రూపొందించి నివేదిస్తే సత్వరమే అమలులోకి తెస్తామన్నారు. ఎన్టీఆర్ హౌసింగ్ కింద గతంలో నిర్మించుకున్న గృహాలకు నిధులు మంజూరు చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మంత్రి చెప్పారు. ప్రస్తుతం బాపట్ల జిల్లాలో 50,415 గృహాలు మంజూరు కాగా, 16, 362 గృహాల నిర్మాణం పూర్తయిందన్నారు.
కాల్వల ఆధునికీకరణ వేగవంతం చేయాలి
–గొట్టిపాటి రవికుమార్, జిల్లా మంత్రి
పంటకాల్వల ఆధునికీకరణ పనులు జిల్లాలో వేగంగా చేపట్టాలి. పంట కాలువలలో నీటి ప్రవాహంపై అధికారులు పర్యవేక్షణ ఉండాలి. నీటి విడుదల సమయంలోనే కాలువల మరమ్మతులు ఎలా చేస్తారు? ఎత్తిపోతల పథకాలు నిరుపయోగంగా మారుతున్నాయి, వాటిపై ప్రత్యేక దృష్టి సారించాలి. భావనాసి రిజర్వాయర్‌కు నీరందించే ప్రక్రియ వేగంగా చేపట్టాలి. బాపట్ల జిల్లాకు 200 ట్రాన్‌ఫార్మర్లు వచ్చాయి. రూ.88 కోట్లు ఖర్చు అవుతాయి. రెండు నెలల్లో వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు పూర్తి చేయాలి.
అభివృద్ధికి సహకరించాలి
– అనగాని సత్యప్రసాద్, జిల్లా మంత్రి
ఎన్టీఆర్ భరోసా పింఛన్లలో నకిలీ ధ్రువీకరణ పత్రాలు ఉంటే విచారించి తొలగించాలి. అర్హులైన ప్రతి ఒక్కరికి పింఛన్ అందించాలి. జల వనరుల శాఖ అధికారులు క్షేత్ర పరిశీలన లేకపోవడంతోనే చివరి భూములకు సాగునీరు అందడం లేదు. దీంతో రైతు లు నష్టాల పాలవుతున్నారు. అయినా జల వనరులు, డ్రైనేజీ శాఖ అధికారులకు ఇవేమి పట్టడం లేదు.
జిల్లా ఇన్‌చార్జి మంత్రి కొలుసు పార్థసారథి కలెక్టరేట్‌లో జిల్లా అభివృద్ధి సమీక్ష సమావేశం ఉచిత ఇసుక సక్రమంగా అమలు కావడం లేదు జిల్లాలో కాల్వల ఆధునికీకరణ చేపట్టాలి సమస్యలను సమావేశం దృష్టికి తీసుకొచ్చిన ప్రజాప్రతినిధులు
‘స్వర్ణాంధ్ర–2047’ కోసం కృషి
–జె.వెంకట మురళి, జిల్లా కలెక్టర్
స్వర్ణాంధ్ర–2047 విజన్ బాపట్ల లక్ష్యంతో యంత్రాంగం చిత్తశుద్ధితో పనిచేస్తుందది. వ్యవసాయ రంగం ద్వారా రానున్న ఐదేళ్లలో రూ.38 వేల 165 కోట్లు ఆదాయం లక్ష్యంగా నిర్ణయించుకున్నాం. పారిశ్రామిక రంగంలో రూ.13,862 కోట్లు, సేవారంగంలో రూ.23,033 కోట్లు ఆదాయం సాధించాలని లక్ష్యం. దీపం–2 పథకం కింద జిల్లాలోని 3.53 లక్షల మంది లబ్ధిదారులకు ఏడాదికి రూ.87.48 కోట్లు ప్రభుత్వం ఖర్చు చేస్తోంది. ఇటీవల కృష్ణానది విపత్తుతో దెబ్బతిన్న గృహాలు, పంటలకు రూ.69 కోట్ల పరిహారం ప్రభుత్వం చెల్లించింది.
గుంటూరు ఛానల్ విస్తరణపై ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు మాట్లాడగా, నిషేధిత భూముల నుంచి పట్టా భూములను తొలగించాలని మరో ఎమ్మెల్సీ మాధవరరావు సమావేశం దృష్టికి తీసుకొచ్చారు. ఉచిత ఇసుక సక్ర మంగా అమలు చేయడం లేదని, చీరాల, పర్చూరు నియోజక వర్గాల్లో ఇష్టానుసారంగా అక్రమార్కులు తవ్వుకెళుతున్నారని, ఇసుక అక్రమ తవ్వకాలు అరికట్టాలని చీరాల ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య కోరగా, కాల్వలపై లస్కర్లను నియమించాలని వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనంద్‌బాబు సమావేశం దృష్టికి తీసుకొచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment