పరిసరాల పరిశుభ్రత అందరి బాధ్యత
గుంటూరు వెస్ట్: పరిసరాల పరిశుభ్రత అందరి బాధ్యతని, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో దీనిపై నిరంతరం అవగాహన పెంచాలని జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి పేర్కొన్నారు. ప్రపంచ మరుగుదొడ్ల దినోత్సవ కార్యక్రమం మంగళవారం కలెక్టరేట్‌లోని వీడియో సమావేశ మందిరంలో జరిగింది. ఇందులో కలెక్టర్ మాట్లాడుతూ.. ‘మా టాయ్‌లెట్– మా గౌరవం‘ నినాదంతో నవంబర్ 19 నుంచి డిసెంబర్ 10వ వరకు కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతోందన్నారు. ఉపాధి హామీ పథకం ద్వారా లిక్విడ్ వేస్ట్ నిర్వహణకు వ్యక్తిగత సోప్ పిట్‌లు, కమ్యూనిటీ సోప్ పిట్‌లు ఏర్పాటు చేయాలని చెప్పారు. గో వ్యర్థాలు అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో గోబర్ గ్యాస్ ప్లాంట్‌లకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని పేర్కొన్నారు. గ్రామాల్లో సురక్షిత తాగునీరు అందించేందుకు జల్‌జీవన్ మిషన్ పనులు సక్రమంగా అమలు చేయాలన్నారు. రోజూవారీ కార్యక్రమాల అమలును జిల్లా, మండల స్థాయి అధికారులు పర్యవేక్షించాలని సూచించారు. ప్రపంచ మరుగుదొడ్ల దినోత్సవ పోస్టర్‌ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ పవార్ స్వప్నిల్ జగన్నాథ్, డీపీఓ సాయి కుమార్, ఐసీడీఎస్ పీడీ ఉమాదేవి, జిల్లా విద్యాశాఖాధికారి రేణుక, డీఎంహెచ్‌ఓ డీఐఓ డాక్టర్ శ్రావణ్ కుమార్, సర్పంచ్‌లు పాల్గొన్నారు.
గుంటూరు జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి
Comments
Please login to add a commentAdd a comment