హత్యకేసులో నిందితుల అరెస్టు
గురజాల రూరల్ : హత్య కేసులో నిందితులను అరెస్టు చేసినట్లు డీఎస్పీ బి.జగదీష్ తెలిపారు. స్థానిక డీఎస్పీ కార్యాలయంలో మంగళవారం విలేకరుల సమావేశంలో కేసు వివరాలు వెల్లడించారు. డీఎస్పీ కథనం ప్రకారం.. తెలంగాణ రాష్ట్రం హయత్ నగర్ మండలం కుట్లురు గ్రామవాసి మహమ్మద్ షరీఫ్ మృతదేహం ఈనెల 12న అంబాపురం–గోగులపాడు గ్రామాల మధ్య పంట కాలువలో లభించింది. తొలుత పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. అనంతరం పోస్టుమార్టం రిపోర్టు ఆధారంగా హత్యగా భావించి విచారణ చేచేపట్టారు. ఎస్పీ కంచిశ్రీనివాసరావు ఆదేశాల మేరకు బృందాలుగా ఏర్పడి దర్యాప్తు చేశారు. విచారణలో గురజాల మండలం పాత అంబాపురం గ్రామానికి చెందిన ఆనం అంకిరెడ్డి పొలాలకు షరీఫ్ కూలీలను తీసుకు వచ్చేవాడని, కూలీలకు ఇవ్వాల్సిన డబ్బులు రూ.లక్ష కోసం ఒత్తిడి చేస్తుండడంతో విసుగుచెంది ఈనెల 11న రాత్రి ఆనం అంకిరెడ్డి, అతని భార్య ఆనం సైదమ్మతోపాటు అదే గ్రామానికి చెందిన కసుకుర్తి సంసోన్ సాయంతో పథకం ప్రకారం మొద్దు కత్తితో షరీఫ్ తలపై కొట్టి, మెడపై కాలుతో నొక్కి హత్య చేసినట్టు తేలింది. అనంతరం మృతదేహాన్ని గోనెసంచుల్లో చుట్టి, ఆర్థరాత్రి సమయంలో పంట కాలువలో పడవేసి వచ్చినట్లు డీఎస్పీ తెలిపారు. పోలీసులు హత్య గురించి తెలుసుకున్నట్టు పసిగట్టిన నిందితులు పారిపోయేందుకు యత్నిస్తుండగా గ్రామంలోని పాత రైసుమిల్లు వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.నిందితులను కోర్టుకు హజరుపర్చినట్లు డీఎస్పీ తెలిపారు. సమావేశంలో సీఐ పి.భాస్కర్‌రావు, ఎస్‌ఐ వినోద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
విద్యార్థులకు క్రీడలూ ముఖ్యమే
గుంటూరు రూరల్: విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించాలని చలపతి ఫార్మసీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ నాదెండ్ల రామారావు తెలిపారు. మంగళవారం నగర శివారు లాం నందున్న కళాశాలలో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో రెండు రోజులపాటు నిర్వహించనున్న అంతర కళాశాలల పురుషులు, మహిళల చదరంగం పోటీలు ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ.. మంగళవారం 6 టీమ్‌లు పాల్గొన్నాయని, బుధవారం ఫైనల్ ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు, క్రీడాకారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment