వంట ఏజెన్సీ నిర్వాహకురాలు ఆత్మహత్యాయత్నం
చీరాల అర్బన్: మధ్యాహ్న భోజన పథకం ఏజెన్సీని రద్దు చేయడంతో మనస్తాపం చెందిన ఏజెన్సీ నిర్వాహకురాలు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన మంగళవారం బాపట్ల జిల్లా చీరాలలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. పట్టణంలోని కస్తూర్బా గాంధీ మున్సిపల్ హైస్కూలులో మధ్యాహ్న భోజన పథకం కాంట్రాక్టర్‌గా పనిచేస్తున్న పుష్పలత మంగళవారం పాఠశాలలో చీమల మందు నీళ్లలో కలుపుకొని ఆత్మహత్యాయత్నం చేసింది. గమనించిన హెల్పర్ పాఠశాల ఉపాధ్యాయులకు చెప్పడంతో ఆమెను హుటాహుటిన 108లో చీరాల ఏరియా వైద్యశాలకు తరలించారు. వైద్యశాలలో చికిత్స అందించారు. ఈ సంఘటనపై ఆమె భర్త కిషోర్ మాట్లాడుతూ గత 14 సంవత్సరాలుగా పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం కుకింగ్ ఏజెన్సీని నిర్వహిస్తున్నామన్నారు. అయితే కొద్ది నెలలుగా ఏజెన్సీ నిర్వహణ బాగాలేదంటూ ఏదో ఒక కారణంతో తమను తప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. విద్యార్థుల చేత తప్పుడు ఫిర్యాదు చేయించి ఏజెన్సీని రద్దు చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. గతంలో కూడా నోటీసు ఇవ్వడంతో వివరణ ఇచ్చామన్నారు. ఏజెన్సీ రద్దుకు పేరెంట్స్ కమిటీ ఆమోదం తెలిపారంటూ ఏజెన్సీ కాంట్రాక్టును రద్దు చేస్తున్నామని మంగళవారం హెచ్‌ఎం చెప్పారని, దీంతో మనస్తాపానికి గురై ఆత్మహత్యాయత్నానికి పాల్పడిందన్నారు. ఈ విషయమై స్కూల్ హెచ్‌ఎం కృష్ణమోహనరావు మాట్లాడుతూ మధ్యాహ్న భోజనం తయారు చేసే వంట మనిషి విధుల్లో నిర్లక్ష్యంగా ఉందని, ఆమెను తొలగిస్తూ మండల విద్యాశాఖాధికారి ఉత్తర్వులు ఇచ్చారన్నారు. భోజనం నాణ్యతగా ఉండడం లేదంటూ గతంలో రెండు నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు. అయినా ఎలాంటి మార్పు లేనందున తొలగిస్తూ నోటీసులు జారీ చేశామన్నారు. నోటీసులను ఆమెకు ఇవ్వగా తన భర్తతో చెప్పి తీసుకుంటానని చెప్పి వెళ్లిందన్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆమెను తొలగించామన్నారు.
ఏజెన్సీ రద్దు చేయడంతో మనస్తాపం
Comments
Please login to add a commentAdd a comment