పని చేయకపోతే తొలగిస్తాం
ఆర్‌అండ్‌బీ అధికారుల సమీక్షలో జిల్లా కలెక్టర్ జె.వెంకటమురళి
బాపట్లటౌన్/చీరాలటౌన్: రహదారులపై ఏర్పడిన గుంతలను పూడ్చే విషయంలో కాంట్రాక్టర్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే వారిని వెంటనే తొలగించాలని జిల్లా కలెక్టర్ జె.వెంకటమురళి తెలిపారు. కలెక్టరేట్‌లో మంగళవారం గుంతల రహిత కార్యక్రమంపై ఆర్‌అండ్‌బీ అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 337 కి.మీ పొడవైన రహదారులపై 67 పనులను గుర్తించినట్లు తెలిపారు. ఇందుకోసం రూ.17.23 కోట్ల నిధులను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిందన్నారు. ప్రస్తుతం 12 పనులే ప్రారంభం కావడంపై కలెక్టర్ అసంతృప్తి వ్యక్తంచేశారు. మరికొన్ని పనులు టెండర్ దశ దాటి గుత్తేదారులకు పనులు అప్పగించినప్పటికీ ప్రారంభం కాలేదన్నారు. టెండర్లు దక్కించుకుని పనులు మొదలు పెట్టకపోతే నోటీసులు జారీ చేయాలన్నారు. నోటీసుల జారీచేసినప్పటకీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే వారిని తక్షణమే తొలగించాలన్నారు. ఆర్‌అండ్‌బీ డీఈ గీతారాణి, డీఈ అరుణ, ఇంజినీరింగ్ అధికారులు పాల్గొన్నారు.
ఎస్టీల అభివృద్ధికి ప్రత్యేక కృషి..
ఎస్టీల అభివృద్ధి, సంక్షేమానికి ప్రభుత్వం ప్రత్యేకంగా కృషి చేస్తుందని జిల్లా కలెక్టర్ జె.వెంకటమురళీ తెలిపారు. మంగళవారం మండలంలోని ఈపురుపాలెం శేఖరస్వామి పుట్ట సమీపంలోని స్ట్రయిట్ కట్ కాలువ కరకట్టపై నివాసం ఉంటున్న ఎస్టీల (యానాదులు) గృహాలను కలెక్టర్ పరిశీలించారు. గిరిజన సంఘం నాయకుడు దేవరకొండ రాము ఆధ్వర్యంలో 100 మంది యానాదులకు కలెక్టర్ చేతుల మీదుగా దుప్పట్లు పంపిణీ చేశారు. అనంతరం మాట్లాడుతూ ఎస్టీల సమస్యలను పరిష్కరించి వారికి అండగా నిలిచి అన్ని రకాల సమస్యలను సత్వరమే పరిష్కరించేందుకు ప్రతి నెలా నాలుగో శుక్రవారం ప్రత్యేకంగా గ్రీవెన్స్ సెల్ నిర్వహిస్తున్నామని చెప్పారు. డీఎంహెచ్‌ఓ విజయమ్మ, ఆర్డీఓ టి.చంద్రశేఖరనాయుడు, తహసీల్దార్ గోపీకృష్ణ, ఎంపీడీఓ శివసుబ్రమణ్యం, ఇతర అధికారులు, సిబ్బంది ఉన్నారు.
ప్రతి ఇంటికి స్వచ్ఛమైన తాగునీరు..
ప్రతి ఇంటికి స్వచ్ఛమైన తాగునీటిని అందించేందుకు అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని జిల్లా కలెక్టర్ జె.వెంకటమురళీ తెలిపారు. కలెక్టరేట్‌లో మంగళవారం జిల్లా వాటర్, శానిటేషన్ మిషన్ కమిటీ సమావేశం నిర్వహించారు. కమిటీలో చైర్మన్‌గా కలెక్టర్, కన్వీనర్ ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ వ్యవహరించారు. వీరితోపాటు 14 శాఖల జిల్లాస్థాయి అధికారులు ఈ కమిటీలో సభ్యులుగా ఉన్నారు. కొళాయి కనెక్షన్‌లతో స్వచ్ఛమైన నీటిని ప్రతి ఇంటికి అందించడం, స్వచ్ఛభారత్ మిషన్ ద్వారా పారిశుద్ధ్య కార్యక్రమాలు పక్కాగా జరిగేలా చూడటం కమిటీ బాధ్యత అని కలెక్టర్ పేర్కొన్నారు. జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో 3.64 లక్షల గృహాలు ఉండగా, 1.48 లక్షల గృహాలకు కొళాయిలు బిగించినట్లు తెలిపారు. జలజీవన్ మిషన్ కింద జిల్లాకు మంజూరైన పనుల్లో 994 పెండింగ్ పనులు చేపట్టడానికి అనుమతి పొందాల్సి ఉందన్నారు. సీపీడబ్ల్యూ పథకాల నిర్వహణ, మరమ్మతులకు రూ.6.9 కోట్లు నిధులు కావాలని కమిటీ ఏకగ్రీవంగా తీర్మానించినట్లు కలెక్టర్ ప్రకటించారు. చీరాల, వేటపాలెం మండలాల్లో నీటి సమస్య శాశ్వత పరిష్కారానికి రూ.160 కోట్ల నిధులు కావాలని ప్రభుత్వానికి ప్రతిపాదన పంపాలన్నారు. ప్రభుత్వ పాఠశాలలు, వసతి గృహాలు, రెసిడెన్షియల్, ఆశ్రమ పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలన్నింటిలోనూ సామాజిక మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. సమావేశంలో కమిటీ కన్వీనర్ ఆర్‌డబ్ల్యూ ఎస్‌ఈ అనంతరాజు, అనుబంధ శాఖల జిల్లా అధికారులు, ఇంజినీర్లు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment