అయ్యో.. పాపం
‘‘ఒంటిపై బట్టలేక.. చలికి వెట్టలేక ..ఆకలికి డొక్కలు ఎండిపోతుండగా.. పాలు లేక పెదాలు తడి ఆరిపోతుండగా.. క్యార్.. క్యార్ మంటున్న శిశువు ఏడుపు అరణ్యవేదనగానే మిగిలింది. చలిపులికి గజగజ వణుకుతూ.. రాత్రంతా దోమలు, చీమలు, ఎలుకలకు దేహాన్ని అప్పగించి ఏం చేయలేని.. నిస్సహాయ స్థితిలో ఏడ్చేందుకు సైతం శక్తిలేక మూలుగుతూ పడిఉన్న ఆ శిశువును చూసి చెమ్మగిల్లని కళ్లు లేవు.. వేదనపడని హృదయాలు కానరావు. పేగు బంధాన్ని మరిచి.. బొడ్డుకున్న పేగుతో సహా అలాగే కుప్పతొట్టి పక్కన వదిలేసిన వైనం చూపరులను చలింపజేసింది. కళ్లు తెరిచిన తొలిరోజు తల్లి పొత్తిళ్లలో వెచ్చగా ఉంటూ.. ఆకలి తీర్చుకోవాల్సిన శిశువు.. దిగంబరిగా ఉంటూ రాత్రంతా ప్రాణాల కోసం పోరాడడం అందరినీ కలిచివేసింది.’’
సంతమాగులూరు (అద్దంకి రూరల్): అప్పుడే పుట్టిన ఆడశిశువును గుర్తుతెలియని వ్యక్తులు పొలాల్లో వదిలేసి వెళ్లిన ఘటన బాపట్ల జిల్లా సంతమాగులూరు మండలంలోని ఫత్తేపురం గ్రామంలో మంగళవారం జరిగింది. అటుగా పొలాలకు వెళుతున్న స్థానిక రైతులు పసిపాప ఏడుపు విని పొలాల్లోని వెళ్లి చూడగా ఆడశిశువు అక్కడ ఉంది. స్థానికుల సమాచారంతో ఎస్‌ఐ పట్టాభిరామయ్య వివరాలు సేకరించారు. ఆ పసిపాపను సంరక్షించి పాపకు వైద్యం చేయించేందుకు ఒంగోలు రిమ్స్‌కు తరలించారు.
అప్పుడే పుట్టిన బిడ్డను వదిలేసిన తల్లి స్థానికుల సమాచారంతో వైద్యశాలకు చేర్చిన పోలీసులు
Comments
Please login to add a commentAdd a comment