దేవుడి సన్నిధి.. విశ్వాసుల పెన్నిధి | - | Sakshi
Sakshi News home page

దేవుడి సన్నిధి.. విశ్వాసుల పెన్నిధి

Published Mon, Dec 23 2024 2:02 AM | Last Updated on Mon, Dec 23 2024 2:03 AM

దేవుడ

దేవుడి సన్నిధి.. విశ్వాసుల పెన్నిధి

● క్రిస్మస్‌ పండుగకు సిద్ధమైన చర్చిలు ● 109 సంవత్సరాలు దాటిన సెయింట్‌ మార్క్స్‌ సెంటినరీ లూథరన్‌ చర్చి ● 90 ఏళ్లు పూర్తి చేసుకున్న సెయింట్‌ లూక్స్‌ లూథరన్‌ చర్చి ● 70 ఏళ్లవుతున్న పునీత ఆంథోనీస్‌ (ఆర్సీఎం) చర్చి

చీరాల రూరల్‌: తీర ప్రాంతంలో ముఖ్య పట్టణమైన చీరాల అనగానే వాడరేవు, చేనేతలు, మత్స్యకారులు, సినిమా షూటింగ్‌ ప్రాంతాలు మనకు గుర్తొస్తాయి. కానీ ఇక్కడి పురాతన చర్చిలు కూడా అంతే ప్రసిద్ధం. ఎంతో ప్రాముఖ్యత సంతరించుకున్నాయి. ఘన చరిత్ర ఉంది. వందేళ్ల కిందటి చర్చీలు, వందేళ్లకు దగ్గరగా మరికొన్ని ఉన్నాయి. పురాతన చర్చిలను నేటి తరం కూడా అపురూపంగా చూసుకుంటున్నారు. మరమ్మతులు వెంటనే చేపట్టి నిత్యనూతనంగా ఉంచుతున్నారు.

1916లో సెయింట్‌ మార్క్స్‌ సెంటినరీ

లూథరన్‌ చర్చి నిర్మాణం

స్థానిక చర్చి కాంపౌండ్‌లో ఎంతో సువిశాలమైన ప్రదేశంలో మిషనరీలు 1916లో సెయింట్‌ మార్క్స్‌ లూథరన్‌ చర్చిని నిర్మించారు. మొదట్లో కొద్దిమంది సభ్యులతో ప్రారంభమైన ఈ చర్చి ప్రస్తుతం వందల సంఖ్యలో విశ్వాసులు వచ్చి ఆరాధనలో పాల్గొంటున్నారు. చర్చిని ఏర్పాటు చేసిన అప్పటి మిషనరీలు పిల్లలు చదువుకునేందుకు బోర్డింగ్‌ స్కూలు, వైద్య కోసం కింగ్‌ సింగర్‌ ఆస్పత్రిని నిర్మించారు. ఆధ్యాత్మికానికే గాక ప్రజలకు విద్య, వైద్యం అందించడంలో వెనుకడుగు వేయలేదు. ఎంతో ఘన చరిత్ర ఉన్న ఈ చర్చి 2016లోనే వందేళ్లు పూర్తిచేసుకుంది. ఇప్పటికీ ఈ చర్చి మరమ్మతులకు గురికాలేదు అంటే ఆశ్చర్యపడక తప్పదు. వందేళ్లు పూర్తి చేసుకోవడంతో ప్రస్తుతం సెయింట్‌ మార్క్స్‌ ‘సెంటినరీ’ లూథరన్‌ చర్చి పేరుతో ఉదహరిస్తున్నారు. కాలక్రమంలో విశ్వాసులు అధికంగా వస్తుండడంతో లోపల బాల్కనీ కూడా నిర్మించారు. వెనుక ప్రదేశంలో కోట్లాది రూపాయలు వెచ్చించి నూతన చర్చిని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణం స్లాబు దశకు చేరుకుంది. చైర్మన్‌గా దేటా అశోక్‌ కుమార్‌ కొనసాగుతున్నారు.

1955లో రోమన్‌ కాథలిక్‌ చర్చి

(పునీత ఆంథోని) నిర్మాణం

పట్టణ పరిధిలోని మరియమ్మపేటలో రెండెకరాల విస్తీర్ణంలో 1955కు ముందు ఆర్‌సీఎం చర్చి గుంటూరు రీజియన్‌లో ఉండేది. 1955లో రైట్‌ రెవరెండ్‌ బిషప్‌ ఫాదర్‌ జేవియర్‌ చర్చి నిర్మాణాన్ని ప్రారంభించి పూర్తి చేయించారు. అప్పటి నుంచి ఆరాధనలు నిరంతరాయంగా కొనసాగుతున్నాయి. విశ్వాసులు అధిక సంఖ్యలో వస్తుండడంతో కొత్త చర్చి నిర్మాణం చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. దీని పరిధిలో పట్టణంలోని అరిటాకుల పేట, వాకావారిపాలెం, ఐక్యనగర్‌, వేటపాలెం, కారంచేడు, పర్చూరు చర్చీలు కూడా చీరాల చర్చికిందనే కొనసాగుతున్నాయి. దీన్ని తల్లి సంఘంగా విశ్వాసులు పిలుచుకుంటారు. ప్రస్తుతం ఈ చర్చికి ఫాదర్‌ జగన్‌ పాస్టర్‌గా వ్యవహరిస్తున్నారు. ఇప్పటి వరకు 23 మంది ఫాదర్లుగా విధులు నిర్వర్తించారు. అప్పట్లో విద్య, వైద్యం కోసం చర్చి ఆవరణలోనే స్కూలు, ఆస్పత్రి నిర్మాణం చేశారు. ఇవి అనేక ఏళ్లుగా సేవలందించాయి. ప్రస్తుతం సెయింట్‌ ఆన్స్‌ స్కూలు చీరాల పట్టణంలో అతి పెద్దదిగా కొనసాగుతుండడం గమనార్హం.

అనేక చర్చీలకు నిలయం

పేరు ప్రఖ్యాతులు గాంచిన ఈ చర్చిలతో పాటు పేరాలలోని సెయింట్‌ మార్క్స్‌, జాన్‌పేటలోని సెయింట్‌ జాన్స్‌ ప్యారిష్‌ , ఉజిలిపేటలోని సెయింట్‌ పీటర్స్‌, శాంతి నగర్‌లోని లూథరన్‌, ఉజిలిపేటలోని క్రిస్టియన్‌ అసెంబ్లీ ప్రేయర్‌, బ్రదరన్‌, మన్నా చర్చీలను దశాబ్దాల కిందట నిర్మించారు. కుందేరు ఒడ్డున బెరాకా, హోసన్నా మినిస్ట్రీస్‌, బైబిల్‌ మిషన్‌ చర్చిలు కూడా సేవలు అందిస్తున్నాయి. వీటితో పాటు చీరాల పట్టణంలో 200 పైగా చర్చీలు ఉన్నాయి.

ఆధ్యాత్మికతతో పాటు సామాజిక సేవా లక్ష్యం

ఆరాధన కార్యక్రమాలకు హాజరయ్యే విశ్వాసులను కేవలం చర్చిలకే పరిమితం చేయకుండా ఇతరులపై ప్రేమ, జాలి, దయ, సహృదయం వంటి అంశాలపై బోధిస్తాం. విశ్వాసులకు అవసరమైన మౌలిక సౌకర్యాల కల్పన, విద్య, వైద్యం, సంక్షేమం వంటి అంశాలను పరిగణలోనికి తీసుకుని ఆనాటి పెద్దలు చర్చిలను నిర్మించారు.

–ఫాదర్‌ జగన్‌, పునీత ఆంథోని చర్చి

No comments yet. Be the first to comment!
Add a comment
దేవుడి సన్నిధి.. విశ్వాసుల పెన్నిధి1
1/3

దేవుడి సన్నిధి.. విశ్వాసుల పెన్నిధి

దేవుడి సన్నిధి.. విశ్వాసుల పెన్నిధి2
2/3

దేవుడి సన్నిధి.. విశ్వాసుల పెన్నిధి

దేవుడి సన్నిధి.. విశ్వాసుల పెన్నిధి3
3/3

దేవుడి సన్నిధి.. విశ్వాసుల పెన్నిధి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement