పెన్‌పాల్ లెటర్స్‌ను ఆవిష్కరించిన డీఈవో
భట్టిప్రోలు: అమెరికా సంయుక్త రాష్ట్రాలలోని నంబ్రస్కా రాష్ట్రంలోని నైహార్డ్ మహ నగరంలోని ఎలిమెంటరీ స్కూల్ విద్యార్థులు భట్టిప్రోలు మండలం ఐలవరం జిల్లా పరిషత్ హైస్కూల్ విద్యార్థులకు పంపిన ఉత్తరాలను బాపట్ల విద్యాశాఖాధికారి శ్రీరామ్ పురుషోత్తమ్ ఆదివారం స్వగృహంలో ఆవిష్కరించారు. ఐలవరం హైస్కూల్‌లో ఆంగ్లోపాధ్యాయులుగా పని చేస్తున్న పచ్చారు హరికృష్ణ గత ఏడేళ్లుగా వినూత్న కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా వివిధ దేశాలలోని స్కూళ్ల విద్యార్థులకు పెన్‌పాల్ (ఉత్తర ప్రత్యుత్తరాలు) స్కైప్ ద్వారా మాట్లాడటం వంటి కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు. నైహార్డ్ స్కూల్ విద్యార్థులతో గత కొంత కాలంగా ఐలవరం హైస్కూల్ విద్యార్ధులు ఉత్తర ప్రత్యుత్తరాలు నిర్విఘ్నంగా జరుగుతున్నాయి. శ్రీరామ్ పురుషోత్తమ్ మాట్లాడుతూ వినూత్న కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఉపాధ్యాయులు హరికృష్ణ పలువురికి ఆదర్శప్రాయుడని తెలిపారు. ఇదే స్ఫూర్తితో ఉపాధ్యాయులు కూడా ముందుకు వెళ్లాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో హై స్కూల్ విద్యార్థులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment