దాచేపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం
దాచేపల్లి : దాచేపల్లిలోని అద్దంకి–నార్కెట్‌పల్లి హైవేపై ఆదివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గొర్రెల మందపైకి ట్రావెల్ బస్సు దూసుకెళ్లింది. ముగ్గురు గొర్రెల కాపరులు గాయపడ్డారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. రూ.36 లక్షలకుపైగా విలువ చేసే 182 గొర్రెలు మృత్యువాతపడ్డాయి. మరో 50 గొర్రెలు గాయ పడ్డాయి. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం .. తెలంగాణలోని నారాయణపేట జిల్లా కొంపల్లికి చెందిన లేయప్ప, కర్రెప్ప, ఆవుల మల్లేష్‌లు గొర్రెల కాపరులు. వీరికి 450 గొర్రెలు ఉన్నాయి. స్వగ్రామం నుంచి గొర్రెలను తోలుకుని దాచేపల్లి మండలం మాదినపాడుకి వస్తున్నారు. ఆదివారం తెల్లవారుజామున 5.30 గంటల సమయంలో గొర్రెల మంద దాచేపల్లి నగర పంచాయతీ పరిధిలోని నారాయణపురంలో అద్దంకి–నార్కెట్‌పల్లి హైవే ఫ్లైఓవర్ బ్రిడ్జి మీదకు చేరుకుంది. హైదరాబాద్ నుంచి ఇంకొల్లుకు ప్రయాణికులతో బయలుదేరిన ప్రైవేట్ ట్రావెల్ బస్సు అతివేగంగా వచ్చి గొర్రెల మందపైకి దూసుకెళ్లింది. ఘటనలో లేయప్ప, కర్రెప్ప గాయపడగా, మల్లేష్ తీవ్రంగా గాయపడ్డాడు. అతని పరిస్థితి విషమంగా ఉంది. 182 గొర్రెలు మృత్యువాతపడ్డాయి. మరో 50 గొర్రెలకుపైగా గాయపడ్డాయి. గొర్రెల మృతదేహాలు చెల్లాచెదురుగా పడడంతో రహదారి రక్తసిక్తంగా మారిది. తీవ్రంగా గాయపడిన కాపరి మల్లేష్‌ను గురజాల ప్రభుత్వ వైద్యశాలలో ప్రాథమిక చికిత్స అందించిన అనంతరం మెరుగైన వైద్యం కోసం నరసరావుపేట ప్రభుత్వ హాస్పిటల్‌కి తరలించారు. అతడి పరిస్థితి విషమంగా ఉంది.
బాధితులకు న్యాయం చేయాలని ఆందోళన
ఈ ఘటనలో బాధితులకు న్యాయం చేయాలని స్థానికులు ఆందోళన చేశారు. రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. ప్రభుత్వం, ట్రావెల్ బస్సు యాజమాన్యం నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. దీంతో ట్రాఫిక్ భారీగా స్తంభించింది. గామాలపాడు సర్పంచ్ జంగా సురేష్, వైఎస్సార్ సీపీ నేత ఉల్లేరు హనుమంతరావు, కౌన్సిలర్ షేక్ షరీఫ్‌తో పాటుగా స్థానికులు రాస్తారోకోలో పాల్గొన్నారు. ఎస్పీ కంచి శ్రీనివాసరావు ఘటన స్థలాన్ని పరిశీలించారు. గొర్రెల కాపరులతో మాట్లాడి నష్టం వివరాలు తెలుసుకున్నారు. రాస్తారోకో చేస్తున్న ఆందోళనకారులతో మాట్లాడారు. బాధితులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. దీంతో ఆందోళనకారులు శాంతించారు.
Comments
Please login to add a commentAdd a comment