ఆశలను చిదిమేసిన ఆర్టీసీ బస్సు
చీరాల: క్రిస్మస్ పండుగ చేసుకోకముందే ఆ కుటుంబంలో ఆనందం ఆవిరైంది. మృత్యువు కంటి దీపాన్ని ఆర్పేసింది. కళ్ల ముందే కుమారుడు చనిపోవడంతో ఆ దంపతులు పుట్టెడు దుఃఖంలో మునిగిపోయారు. ఆనందోత్సాహాలతో పండుగను జరుపుకుందామనుకున్న ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. గుండెలవిసేలా రోదించారు. పండుగ సందర్భంగా నూతన వస్త్రాలు కొనుగోలు చేసేందుకు ఆ కుటుంబం బాపట్ల నుంచి చీరాల వచ్చింది. షాపింగ్ పూర్తి చేసుకుని వెళ్తుండగా బస్సు రూపంలో మృత్యువు కబళించింది. ప్రమాదంలో కుమారుడు మృతి చెందగా తల్లిదండ్రులకు గాయాలయ్యాయి. ఈ హృదయ విదారక ఘటన ఆదివారం సాయంత్రం చీరాల రైల్వే ఓవర్ బ్రిడ్జిపై చోటుచేసుకుంది. అందిన వివరాల మేరకు.. బాపట్లలోని ఆనందపేటకు చెందిన ప్రవీణ్‌కుమార్ భార్య దివ్య కుమారుడు రాహుల్ (9), కుమార్తె జెస్సీతో కలిసి క్రిస్మస్ పండుగ సందర్భంగా నూతన వస్త్రాలు కొనుగోలు చేసేందుకు చీరాల వచ్చారు. పని పూర్తయిన తర్వాత తిరిగి బాపట్ల వెళ్తుండగా చీరాల రైల్వే ఓవర్ బ్రిడ్జిపై ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొంది. ఈఘటనలో రాహుల్ అక్కడికక్కడే మృతిచెందాడు. ప్రమాదంలో దంపతులు ప్రవీణ్‌కుమార్, దివ్యలకు తీవ్రగాయాలు కావడంతో వారిని చికిత్స నిమిత్తం చీరాల ఏరియా వైద్యశాలకు తరలించారు. సమాచారం అందుకున్న చీరాల వన్‌టౌన్ సీఐ శ్రీనివాసరావు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చీరాల ఏరియా వైద్యశాలకు తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని డ్రైవర్ సహా బస్సును అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
పండుగకు షాపింగ్ చేసి బాపట్ల వెళ్తుండగా ఘటన ఆర్టీసీ బస్సు ఢీకొని బాలుడి మృతి క్రిస్మస్ వేడుకలు జరుపుకోకుండానే ఆనందం ఆవిరి
Comments
Please login to add a commentAdd a comment