రంగస్థలంతో సామాజిక చైతన్యం
యద్దనపూడి: సమాజంలోని వాస్తవ పరిస్థితులను ఎప్పటికప్పుడు అవలోకం చేసుకుంటూ ప్రజల కష్టాలను, కడగండ్లను ప్రేక్షకుల దృష్టికి తీసుకువచ్చే నాటకం మానవజీవితానికి దర్పణం వంటిందని పర్చూరు శాసనసభ్యుడు ఏలూరి సాంబశివరావు పేర్కొన్నారు. మండలంలోని అనంతవరం గ్రామంలో ఎన్టీఆర్ కళాపరిషత్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఉభయ తెలుగు రాష్ట్రాల నాటిక పోటీలకు శనివారం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ మరో ముఖ్య అతిథిగా ఏపీ క్రియేటివ్ కల్చర్ కమిషన్ చైర్మన్ పొడపాటి తేజశ్విని, రచయిత, దర్శకులు కందిమళ్ల సాంబశివరావు హాజరయ్యారు. ఏలూరి మాట్లాడుతూ నాటకంలోని పాత్ర తీరుతెన్నులు, స్వభావాన్ని చూపుతూ... తమ నటనా చాతుర్యంతో ప్రేక్షకుల హృదయాలను రంజింపచేయటం సులువేమీ కాదన్నారు. పాత్రలో పరకాయ ప్రవేశం చేస్తేనే ప్రేక్షకులను మెప్పించటం సాధ్యమవుతుందని వివరించారు. అలాంటి కళాకారులను నాటక పరిషత్‌ల ద్వారా ప్రోత్సహించటం అభినందనీయమన్నారు. పొడపాటి తేజశ్విని మాట్లాడుతూ నాటకాల ద్వారా సమాజానికి ఉపయోగపడే సందేశాత్మక అంశాలు ఎన్నో మిళితమై ఉంటాయన్నారు. మనస్సు దోచే సన్నివేశాలతో నవరసాలను అలవోకగా పలికిస్తూ ప్రేక్షకులను మంత్ర ముగ్ధులను చేసే కళామతల్లి ముద్దుబిడ్డలైన కళాకారులను గౌరవించుకోవాల్సిన ఆవశ్యకత అందరిపై ఉందన్నారు. అనంతవరం కళా పరిషత్ అధ్యక్షుడు గుదే పాండురంగారావు మాట్లాడుతూ మండలంలో మూడేళ్లుగా కళాపరిషత్ ద్వారా రాష్ట్రస్థాయి నాటిక పోటీలను విజయవంతంగా నిర్వహిస్తున్నామని నాటికలోని సందేశాలను గ్రహించి కొంతమందైనా మంచి మార్గంలో పయనిస్తే తమ లక్ష్యం నెరవేరినట్లేనన్నారు. కార్యక్రమంలో కొరిటాల వంశీకృష్ణ, గుదే తారకరామారావు, మద్దినేని జయరామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.
రంజింపజేసిన నాటికలు
తొలినాటికగా అరవింద ఆర్ట్స్ తాడేపల్లి వారి విడాకులు కావాలి నాటికలో దాంపత్య జీవితంలో ఆలుమగలు మధ్య అభిప్రాయభేదాలు, అపోహలు తలెత్తటం సహజం. అంతమాత్రం చేతే పంతాలకు పట్టుదలకు పోయి విడాకులు తీసుకోవాలనుకోవటం ఎంతవరకు సమజసం..? ఎటువంటి అపార్థాలకు తావులేకుండా సర్దుబాటు ధోరణిలో సంయమనం పాటించటం వల్ల ఆదర్శ దంపతుల్లా గడపచ్చు అంటూ నాటిక ఆద్యంతం ఆలోచింపజేసింది.
జనరల్ బోగీలు
మూడో నాటికగా శ్రీసాయి ఆర్ట్స్ కొలకలూరు వారి జనరల్ బోగీలు నాటికలో ...రైలు ప్రమాదాలు జరిగినప్పుడు జనరల్ బోగీల్లో ప్రయాణించేవారి వివరాలు ఉండవని, ప్రమాదవేళ్లల్లో బాధితుల వేదన వర్ణానతీతమని వివరించారు. ఈ దౌర్భాగ్యం పోవాలని జనరల్ బోగీలు సంఖ్య పెంచాలని ప్రయాణికుల వివరాలు రైల్వే వారి దగ్గర ఉండాలని రైలు ప్రమాదంలో గల్లంతైన తన కొడుకు ఆచూకీ కోసం ఓ తల్లి చేసిన పోరాటమే జనరల్ బోగీలు నాటిక సారాంశం.
ముగిసిన ఎన్టీఆర్ కళాపరిషత్
నాటిక పోటీలు
ఆలోచనలు రేకెత్తించిన ‘అసత్యం’
చైతన్య కళాస్రవంతి విశాఖపట్నం వారి అసత్యం నాటికలో ...దైవత్వమైనా, రాక్షసత్వమైనా అది మనిషి హృదయంలో ఉంటుంది. ప్రతి సత్యం వెనుక, ప్రతి అసత్యం వెనుక మనిషి స్వార్థమో, భయమో ఉంటుంది. అదే అతనికి మేలో, కీడో చేస్తుంది. అసలు ఏది సత్యం..? ఏది అసత్యం. కంటికి కనిపించేది అంతా సత్యం కాదు...కనపించనిదంతా అసత్యం కాదు. యథార్థమైనా సరే ఒక చెడుకు దోహదపడితే అది అసత్యం. అబద్ధమైనా సరే అది ఒక మంచికి దోహదపడితే అది సత్యం. అనేదే (అ) సత్యం కథ సారాంశం.
Comments
Please login to add a commentAdd a comment