300 లీటర్ల బెల్లం ఊట ధ్వంసం
నిజాంపట్నం: నాటుసారా తయారీకి ఉపయోగించే బెల్లం ఊటను ధ్వంసం చేసిన సంఘటన మండలంలోని అదవల గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ రేపల్లె, నగరం సీఐలు దివాకర్, శ్రీరామ్ ప్రసాద్‌లు తెలిపిన వివరాల మేరకు.. అదవల గ్రామ పరిసరాలలోని మడ అడవులలో నాటు సారా తయారు చేస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు దాడులు నిర్వహించారు. నాటు సారాకు వినియోగించే 300 లీటర్ల బెల్లం ఊట లభించింది. బెల్లం ఊటను ధ్వంసం చేశారు. తయారీదారులను త్వరలోనే అదుపులోకి తీసుకుంటామని సీఐ చెప్పారు. అదవలతోపాటు సమీపంలోని పలు గ్రామాలలో తమ నిఘా ఉందన్నారు. ఎవరైనా నాటుసారా తయారు చేసినా, విక్రయించినా, నాటుసారాకు అవసరమైన ముడి సరుకులు విక్రయించినా చట్టపరమైన చర్యలు ఎదుర్కొనక తప్పదని హెచ్చరించారు. దాడులలో సిబ్బంది కె.శ్రీనివాసరెడ్డి, కె.మధుసూదనరావు, పి.శ్రీనివాసరెడ్డి, కే.వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.
వాహనం ఢీకొని వ్యక్తి మృతి
మార్టూరు: జాతీయ రహదారిపై గుర్తుతెలియని వాహనం ఢీకొని ఒక వ్యక్తి మృతి చెందిన సంఘటన ఇసుక దర్శి గ్రామ సమీపంలో శనివారం మధ్యాహ్నం జరిగింది. స్థానికులు, సీఐ మద్దినేని శేషగిరిరావు వివరాలు.. ఇసుక దరిసి గ్రామానికి చెందిన దోరక నాగిరెడ్డి ( 54 )స్థానిక ఏలూరి క్యాంపు కార్యాలయంలో శనివారం నిర్వహించిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం కాలి నడకన ఇంటికి వెళుతున్నాడు. ఈ క్రమంలో జాతీయ రహదారిలో తూర్పు వైపు నుంచి పడమర వైపు దాటుతుండగా.. మార్టూరు నుంచి ఒంగోలు వైపు వెళ్లే వాహనం నాగిరెడ్డిని బలంగా ఢీ కొట్టి వెళ్లిపోయింది. ప్రమాద తీవ్రతకు అతను అక్కడికక్కడే మృతి చెందాడు. భార్య, పిల్లలు ఎవరూ లేని అనాథ అయిన నాగిరెడ్డి రెండు దశాబ్దాలుగా గ్రామంలోని వడ్డెర కాలనీవాసులతో కలిసి ఒక్కడే నివసిస్తున్నాడు. నాగిరెడ్డి ఇంటి సమీపంలో ఉండే అచ్చి పున్నారావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న సీఐ శేషగిరిరావు నాగిరెడ్డి మృతదేహానికి మార్టూరు ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్ట్ మార్టం నిర్వహించారు. మృతదేహాన్ని కాలనీవాసులకు అప్పగించగా వారే అంత్యక్రియలు పూర్తి చేశారు.
కొండవీడు కొండల్లో మహిళా కేడెట్ల ట్రెక్కింగ్
గుంటూరుఎడ్యుకేషన్: ఏపీ ట్రెక్–3 కార్యక్రమంలో భాగంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు చెందిన మహిళా ఎన్‌సీసీ కేడెట్లు శనివారం కొండవీడు చెక్‌పోస్టు నుంచి చారిత్రక కొండవీడు కోట వరకు ఏడు కిలోమీటర్లు ట్రెక్కింగ్‌లో ఉత్సాహంగా పాల్గొన్నారు. గుంటూరు ఎన్‌సీసీ గ్రూప్– 10 ఆంధ్ర గరల్స్ బెటాలియన్ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఎన్‌సీసీ డైరెక్టరేట్ సంయుక్తంగా అఖిల భారత మహిళా ట్రెక్కింగ్–3 పేరుతో శిబిరం ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా తొమ్మిది ఎన్‌సీసీ గ్రూపులకు చెందిన కేడెట్లు ట్రెక్కింగ్‌లో పాల్గొన్నారు. అనంతరం రెడ్డిరాజుల వారసత్వ మ్యూజియాన్ని సందర్శించా రు. కొండవీడుకోట చరిత్ర, ప్రాముఖ్యత గురించి సమాచారాన్ని తెలుసుకున్నా రు. గుంటూరు ఎన్‌సీసీ గ్రూప్ కమాండర్ కల్నల్ ఎస్.ఎం. చంద్రశేఖర్ మాట్లాడుతూ శారీరక శక్తి పరీక్షతో పాటు చారిత్రక అవగాహన కలిగించేందుకు ఏర్పాటు చేసిన ట్రెక్కింగ్ శిబిరంలో మహిళా కేడెట్లు ఉత్సాహంగా పాల్గొన్నారని తెలిపారు.
నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ
గుంటూరు ఎడ్యుకేషన్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు ప్లంబర్ వర్క్‌పై ఉచిత శిక్షణ కల్పించనున్నట్లు జిల్లాస్థాయి పారిశ్రామిక శిక్షణ సంస్థ (డీఎల్‌టీసీ) అసిస్టెంట్ డైరెక్టర్ బి.సాయివరప్రసాద్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు టెన్త్ సర్టిఫికెట్, ఆధార్ కార్డు, ఆధార్‌తో లింకై న మొబైల్ నంబరు వివరాలతో సంప్రదించాలని సూచించారు. ప్లంబర్ కోర్సు ద్వారా అపార్ట్‌మెంట్లు, గృహాల్లో పైప్ ఫిట్టింగ్ ద్వారా స్వయం ఉపాధి అవకాశాలతో పాటు పరిశ్రమల్లో ఉపాధిని పొందవచ్చని తెలిపారు. వివరాలకు 80746 07278, 83339 73929 నంబర్లలో సంప్రదించాలని ఆయన సూచించారు.
రూ.2.50 కోట్లు అప్పులు చేసిఎరువుల వ్యాపారి ఉడాయింపు
మాచర్ల: పట్టణంలో ఎరువుల వ్యాపారి రూ.2.50కోట్లు అప్పు చేసి పది రోజులుగా కనిపించకుండా వెళ్లిపోయాడు. వ్యాపారి ఆచూకీ కోసం అప్పులు ఇచ్చిన వారు ఆందోళనలో ఉన్నారు. పట్టణంలోని అంబేడ్కర్ సెంటర్ సమీపంలో గత కొన్ని సంవత్సరాలుగా ఎరువుల వ్యాపారం చేస్తూ చిట్టీపాటల వారికి డబ్బులు ఇవ్వకుండా వెళ్లిపోయాడు. బంధువులు, స్నేహితులు, తదితర వారి వద్ద రూ. 2.50 కోట్ల వరకు అప్పు చేశాడు. దుకాణానికి తాళాలు వేసి కనిపించకుండా వెళ్లిపోయాడు. అప్పులు ఇచ్చిన వారు ఆందోళన చెందుతున్నారు. వ్యాపారి కోసం గాలింపులు చేస్తున్నారు. బాధితులు పోలీసులను ఆశ్రయించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇంతకు ముందు కూడా ఇలాంటి ఘటన చేసి పెద్దలతో మాట్లాడుకుని గ్రామంలోకి అడుగు పెట్టాడు. జనంలో నమ్మకం పెంచుకుని అప్పులు చేసి మళ్లీ కనిపించకుండా పోవడంపై పట్టణంలో చర్చ జరుగుతోంది.
మొక్కలు నాటి సంరక్షించాలి
నరసరావుపేట: పర్యావరణమే ధ్యేయంగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి చెట్లుగా పెంచి ఆక్సిజన్ లభ్యతను పెంచాల్సిన అవసరం ఉందని జిల్లా వ్యవసాయాధికారి ఐ.మురళి పేర్కొన్నారు. వరల్డ్ అగ్రి ఫారెస్టు సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ట్రీస్ అవుట్‌సైడ్ ఫారెస్టు ఇన్ ఇండియా(టోపీ) కార్యక్రమంలో భాగంగా మాస్టర్ ట్రైనర్లకు సర్టిఫికేట్లు అందజేసే కార్యక్రమం శనివారం మున్సిపల్ అతిథి గృహంలో నిర్వహించారు. మురళి మాట్లాడుతూ దేశంలో ఉన్న భూ విస్తీర్ణంలో 30 శాతం అటవీ ప్రాంతం ఉండాల్సిన అవసరం ఉందన్నారు. కోవిడ్ సమయంలో ప్రతి ఒక్కరూ ఆక్సిజన్ కోసం వెంపర్లాడిన పరిస్థితి ఒక్కసారి గుర్తు చేసుకోవాలని కోరారు. మొక్కలు నాటి చెట్లుగా పెంచటమనేది ఒక సోషల్ యాక్టివిటీగా మారాలని కోరారు. ఉద్యాన శాఖ జిల్లా అధికారి సీహెచ్.వి.రమణారెడ్డి మాట్లాడారు.
Comments
Please login to add a commentAdd a comment