ఇక నుంచి ఆస్పత్రిలో చేసే ఉద్యోగ నియామకాలన్నీ తప్పనిసరిగా జిల్లా సెలక్షన్ కమిటీ ద్వారా మాత్రమే చేపట్టాలని డీఎంఈ కార్యాలయం తెలిపింది. అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు అధిక మొత్తంలో వేతనాలు చెల్లించిన వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని, స్టాఫ్‌నర్సు రిక్రూట్‌మెంట్‌లో నిబంధనలు పాటించని వారిపై చర్యలు తీసుకోవాలని, కరోనా డైట్ ఫైల్ మాయం చేసిన ఎల్.శ్రీనివాసరావుపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని డీఎంఈ కార్యాలయం ఆదేశాలు జారీ చేసింది. జీజీహెచ్‌లో ఎమ్మారై స్కానింగ్ కాంట్రాక్టర్ ఆర్‌కే డయాగ్నోస్టిక్ ప్రైవేట్ లిమిటెడ్, క్యాథ్‌ల్యాబ్ కాంట్రాక్టర్ లక్ష్మీఆరుష్ హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ వారి వద్ద నుంచి విద్యుత్ బిల్లులను 30 రోజుల్లోగా వడ్డీ సహా తీసుకోవాలని ఆదేశించారు. అసిస్టెంట్ డైరెక్టర్ చింతలపూడి నాగేశ్వరరావుపై వచ్చిన ఆరోపణలను విచారించిన జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ అండ్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అధికారి డి.మనోరమ విచారణ నివేదికను అందజేయాలని ఆదేశించారు. దీంతో ఆస్పత్రిలో పనిచేస్తున్న పలువురు కార్యాలయ అధికారులు, ఉద్యోగులు ఎవరిపై వేటు పడుతుందో అనే భయాందోళనలో ఉన్నారు. కాగా డీఎంఈ కార్యాలయం ఉత్తర్వులపై ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ యశస్వి రమణను ‘సాక్షి’ వివరణ కోరగా.. తమ కార్యాలయానికి ఇంకా ఉత్తర్వులు రాలేదని, అందిన వెంటనే డీఎంఈ ఆదేశాల ప్రకారం క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment