ముత్తంగి అలంకరణలో రామయ్య | Sakshi
Sakshi News home page

ముత్తంగి అలంకరణలో రామయ్య

Published Tue, May 7 2024 4:45 AM

ముత్తంగి అలంకరణలో రామయ్య

భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారు ముత్తంగి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ప్రతి సోమవారం స్వామివారిని ముత్తంగి రూపంలో అలంకరించడం ఇక్కడ ప్రత్యేకత. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామి వారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు.

పెద్దమ్మతల్లి ఆలయంలో వైభవంగా రుద్రహోమం

పాల్వంచరూరల్‌ : మాసశివరాత్రిని పురస్కరించుకుని పెద్దమ్మతల్లి ఆలయంలో సోమవారం వైభవంగా రుద్రహోమం నిర్వహించారు. అమ్మవారికి సువర్ణ పుష్పార్చన చేశారు. ముందుగా మేళతాళాలు, వేదమంత్రాల నడుమ స్వామివారిని అర్చకులు ఊరేగేంపుగా యాగశాల వద్దకు తీసుకొచ్చారు. అనంతరం మండపారాధన, గణపతిపూజ గావించి, రుద్రహోమం చేశారు. చివరన పూర్ణహుతి కార్యక్రమాన్ని జరిపించారు. హోమంలో పాల్గొన్న భక్త దంపతులకు అర్చకులు అమ్మవారి శేషావస్త్ర ప్రసాదాలు అందజేశారు.

ఈసెట్‌ ప్రశాంతం

సుజాతనగర్‌: స్థానిక అబ్దుల్‌ కలాం ఇంజనీరింగ్‌ కళాశాలలో సోమవారం నిర్వహించిన ఈ సెట్‌ ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరిగిన ఈ పరీక్షకు 130 మందికి గాను 129 మంది హాజరయ్యారని నిర్వాహకులు తెలిపారు.

నేటి నుంచి ఈఏపీ సెట్‌.

ఇంజనీరింగ్‌లో ప్రవేశాలకు నిర్వహించే ఈఏపీ సెట్‌ను అబ్దుల్‌ కలాం ఇంజనీరింగ్‌ కళాశాలలో మంగళ, బుధ, గురు, శుక్రవారాల్లో నిర్వహించనున్నారు. రెండు షిఫ్టుల్లో పరీక్ష జరగనుంది. మొత్తం 130 మంది పరీక్షలకు హాజరవుతారని నిర్వాహకులు తెలిపారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి సెషన్‌, మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 గంటల వరకు రెండో సెషన్‌ పరీక్ష ఉంటుందని, నిర్ణీత సమయానికంటే గంటన్నర ముందుగానే లోపలికి అనుమతిస్తామని వివరించారు.

లక్ష్మీకాలనీలో వైద్య బృందం

భద్రాచలం(చర్లరూరల్‌) : చర్ల మండలం లక్ష్మీకాలనీని కొత్తగూడెం మెడికల్‌ కాలేజీ ఎపిడమాలజీ బృందం సోమవారం సందర్శించింది. గ్రామంలో ఇటీవల జ్వరాలు విజృంభించి ఒకే ఇంట్లో ఇద్దరు అన్నదమ్ములు మృతి చెందడంతో పాటు జ్వరాలు అధికంగా నమోదవుతున్న నేపథ్యంలో గ్రామస్తుల ఆహారపు అలవాట్లు, ఆరోగ్య వివరాలను వైద్యులు అడిగి తెలుసుకున్నారు. లక్ష్మీకాలనీలో అందరి రక్త నమూనాలను సేకరించాలని సిబ్బందికి సూచించారు. కార్యక్రమంలో కొయ్యూరు పీహెచ్‌సీ వైద్యాధికారి శ్రీధర్‌, డాక్టర్‌ మోకాళ్ల వెంకటేశ్వరరావు, డాక్టర్‌ చాణక్య, డాక్టర్‌ లాస్య పాల్గొన్నారు. కాగా, జ్వరంతో అన్నదమ్ములు మృతిచెందిన కుటుంబాన్ని ఏడీఎంహెచ్‌ఓ డాక్టర్‌ భాస్కర్‌ నాయక్‌ సోమవారం పరామర్శించారు. జ్వరాల విషయంలో నిర్లక్ష్యంగా ఉండొద్దని సూచించారు.

భద్రాద్రి కవికి అవార్డు

భద్రాచలంటౌన్‌: భద్రాచలం పట్టణానికి చెందిన ప్రముఖ కవి పేరిశెట్టి బాబు(రూపాబాబు)కు పలు అవార్డులు లభించాయి. పెద్దపల్లి జిల్లా మంథనిలో శ్రీ గౌతమేశ్వర సాహితీ సంస్థ వార్షికోత్సవాల సందర్భంగా జరిగిన కార్యక్రమంలో బాబుకు ‘సాహితీ శేఖర‘ బిరుదు, ‘స్ఫూర్తి శిఖరం‘ అవార్డు ప్రదానం చేసి ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో ప్రముఖ కవి డాక్టర్‌ వైరాగ్యం ప్రభాకర్‌, పర్యావరణవేత్త పిట్టల రవిబాబు, పురం మంగ పాల్గొన్నారు.

పట్టభద్రుల స్థానానికి 13మంది నామినేషన్లు

నల్లగొండ: ఖమ్మం – వరంగల్‌ – నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సంబంధించి ఐదో రోజైన సోమవారం 13 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. బీఆర్‌ఎస్‌ నుంచి ఏనుగుల రాకేష్‌రెడ్డి, టీడీపీ నుంచి ముండ్ర మల్లికార్జునరావు, ధర్మ సమాజ్‌ పార్టీ నుంచి బరిగల దుర్గాప్రసాద్‌, నేషనల్‌ నవక్రాంతి పార్టీ నుంచి కర్ని రవి సమర్పించారు. అంతేకాక స్వతంత్రులగా పులిపాక సుజాత, చీదల్ల వెంకట సాంబశివరావు, చీదల్ల ఉమామహేశ్వరి, తాడిశెట్టి క్రాంతికుమార్‌, అయితగోని రాఘవేంద్ర, బక్క జడ్సన్‌, బుగ్గ శ్రీకాంత్‌, పాలకూరి అశోక్‌కుమార్‌, దేశగాని సాంబశివరావు తమ నామినేషన్లను అసిస్టెంట్‌ రిటర్నింగ్‌ అధికారి సీహెచ్‌.మహేందర్‌కు అందజేశారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement