పత్తి మిల్లులో కార్మికుడి మృతి
● పత్తి మీద పడడంతో ఊపిరి ఆడక కన్నుమూత
తిరుమలాయపాలెం: మండలంలోని గోల్‌తండా పరిధిలోని శ్రీ భాగ్యలక్ష్మి కాటన్ ఇండస్ట్రీస్‌లో పనిచేస్తున్న ఓ కార్మికుడు మృతి చెందాడు. ఎస్‌ఐ కూచిపూడి జగదీష్ తెలిపిన వివరాలు.. మహారాష్ట్రకు చెందిన మాధవన్(20) కొన్నాళ్లుగా మిల్లులో పనిచేస్తుండగా మంగళవారం రాత్రి పత్తి బేళ్లపై నిద్రించాడు. అయితే, అర్ధరాత్రి చలి పెరగడంతో పక్కనే కుప్పగా వేసిన పత్తిలో పడుకున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని గమనించని యంత్రం డ్రైవర్ పత్తిని తీస్తుండగా మాధవన్‌పై పడడంతో ఊపిరి ఆడక అస్వస్థతకు గురయ్యాడు. కాసేపయ్యాక సహచర కార్మికులకు మాధవన్ కనిపించకపోవడంతో సీసీ కెమెరాల పుటేజీని పరిశీలించి పత్తిలో కూరుకుపోయినట్లు గుర్తించారు. ఆపై వాహనంలో ఆయనను ఖమ్మం ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడి తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వగా, వారు చేరుకున్నాక అజాగ్రత్తగా యంత్రాన్ని నడిపిన వ్యక్తిపై కేసు నమోదు చేయనున్నట్లు ఎస్సై తెలిపారు.
కుటుంబ కలహాలతో ఆత్మహత్యాయత్నం
సత్తుపల్లి: కుటుంబ కలహాల కారణంగా ఓ యువకుడు గొంతు కోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. వివరాలిలా ఉన్నాయి. సత్తుపల్లి ఎన్టీఆర్ నగర్‌కు చెందిన ఇమ్రాన్ బేతుపల్లికి చెందిన నందినిని ఇటీవల ప్రేమవివాహం చేసుకున్నాడు. కొన్నాళ్లకు ఇరువురి మధ్య గొడవలు మొదలవడంతో నందిని పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో బుధవారం బేతుపల్లికి వెళ్లిన ఇమ్రాన్ తన భార్యను పంపించాలని ఆమె కుటుంబీకులను బెదిరిస్తూ బ్లేడ్‌తో పీక కోసుకోవడంతో తీవ్ర రక్తస్రావమైంది. ఈమేరకు ఆయనను సత్తుపల్లి ప్రభుత్వాస్పత్రికి తరలించగా అక్కడి నుంచి పారిపోయే యత్నం చేయడంతో కుటుంబీకులు, ఆస్పత్రి సిబ్బంది పట్టుకుని చికిత్స చేశారు. గతంలో కూడా ఇమ్రాన్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడని కుటుంబ సభ్యులు తెలిపారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
చేపల వేటకు వెళ్లిన వ్యక్తి గల్లంతు
చింతకాని: మండలంలోని తిమ్మినేనిపాలెంకు చెందిన కొమ్ము మహేందర్ (55) గ్రామ సమీపంలోని మున్నేరులో బుధవారం చేపల వేటకు వెళ్లి గల్లంతయ్యాడు. ఆయన సాయంత్రమైనా ఇంటికి రాకపోవటంతో కుటుంబీకులు, గ్రామస్తులు మున్నేరు వద్దకు వెళ్లి వెతికారు. అయినా ఫలితం లేక పోలీసులకు సమాచారం ఇవ్వగా ఎస్సై నాగుల్‌మీరా.. అగ్నిమాపక సిబ్బందితో పాటు గజ ఈతగాళ్లను పిలిపించి రాత్రి వరకు గాలించినా మహేందర్ ఆచూకీ లభించలేదు. దీంతో గురువారం ఉదయం మళ్లీ గాలింపు చేపడుతామని ఎస్సై తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment