ఏఐటీయూసీ పోరాట ఫలితమే హక్కులు..
సూపర్‌బజార్(కొత్తగూడెం): దేశంలో, రాష్ట్రంలో కార్మికులు, ఉద్యోగులు అనుభవించే ప్రతీ హక్కు ఏఐటీయూసీ పోరాట ఫలితంగానే వచ్చాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. రుద్రంపూర్ కమ్యూనిటీ హాల్‌లో రెండు రోజుల పాటు నిర్వహించిన జిల్లా స్థాయి రాజకీయ శిక్షణా తరగతులు బుధవారం ముగిశాయి. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ.. పని భద్రత, కనీస వేతనాలు అమలు చేయడం పాలకులు, యాజమాన్యాల బాధ్యత అని అన్నారు. అయితే నేడు దీన్ని విస్మరించి పాలన సాగిస్తున్నారని విమర్శించారు. ఎన్నో పోరాటాలు, ప్రాణ త్యాగాలతో సాధించుకున్న 44 కార్మిక చట్టాలను నాలుగు కోడ్‌లుగా విభజించిన కేంద్ర ప్రభుత్వం కార్మిక సంక్షేమాన్ని యాజమాన్యాలకు, పారిశ్రామిక వేత్తలకు తాకట్టు పెడుతోందని ఆరోపించారు. ఆదానీ, అంబానీ వంటి పెట్టుబడిదారులకు మోదీ సర్కార్ ఊడిగం చేయడం మినహా దేశ ప్రజలకు, కార్మికులకు చేసిందేమీ లేదని విమర్శించారు. చట్టాలు, హక్కుల అమలుకు కార్మికులు తిరగబడాలని పిలుపునిచ్చారు. సమావేశంలో ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాలరాజు, కార్యదర్శి సింగు నరసింహారావు, జిల్లా గౌరవాధ్యక్షుడు ఎస్‌కే సాబీర్‌పాషా, జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కంచర్ల జమలయ్య, ప్రసాద్, వట్టికొండ మల్లికార్జునరావు, గోనె మణి, డి.శంకర్, వేల్పుల మల్లికార్జున్, టి.రాజు, రాంచందర్, బండి నాగేశ్వరావు, విజయలక్ష్మి, వెంకటేశ్వర్లు, బంధం నాగయ్య, కె రాము తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment