సన్నరకం.. ధర మందం
● మార్కెట్‌లో సన్నరకం ధాన్యానికి తగ్గిన డిమాండ్ ● సాగు విస్తీర్ణం పెరగడంతో దక్కని మద్దతు ధర ● ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో విక్రయిస్తేనే ‘ఎంఎస్‌పీ’ ● అక్కడ అమ్మాలంటే తేమ శాతం తంటాలు..
బూర్గంపాడు: మార్కెట్‌లో డిమాండ్ ఎక్కువగా ఉండే సన్నరకం ధాన్యం ధర ఈ ఏడాది మందమైంది. రాష్ట్ర ప్రభుత్వం సన్నరకం ధాన్యానికి క్వింటాకు రూ.500 బోనస్ ప్రకటించటంతో రైతులు ఎక్కువగా ఈ రకాలనే సాగుచేశారు. పొరుగు రాష్ట్రాల్లోనూ ఈ ఏడాది వరి సాగు విస్తీర్ణం గణనీయంగా పెరడగంతో ధాన్యం ధరపై ప్రభావం పడుతోంది. గత ఐదారేళ్లుగా సన్నరకం ధాన్యాన్ని రైతులు కోసిన వెంటనే మిల్లర్లు పచ్చి వడ్లనే అధిక ధరలకు కొనుగోలు చేసేవారు. గతేడాది వానాకాలం సీజన్‌లో సన్నరకం ధాన్యం పచ్చివే క్వింటా రూ.2,300 నుంచి రూ.2,700 వరకు ధర పలికింది. ఈ సంవత్సరం మాత్రం సన్నరకం ధాన్యం కొనుగోళ్లకు మిల్లర్లు అంతగా ఆసక్తి చూపడం లేదు. ప్రస్తుతం బాగా ఆరిన ధాన్యాన్నే క్వింటా రూ.2వేల చొప్పున కొనుగోలు చేస్తున్నారు.
1.75 లక్షల ఎకరాల్లో సాగు..
జిల్లాలో ఈ ఏడాది సుమారు 1.75లక్షల ఎకరాల్లో రైతులు వరిసాగు చేశారు. ఇందులో 80 శాతం సన్నరకాలే ఉన్నాయి. అయితే అధిక వర్షాలు, తెగుళ్లు, పురుగు, దోమ ఉధృతితో ఈ రకం ధాన్యం సాగుకు పెట్టుబడి ఖర్చులు పెరగగా, దిగుబడి గణనీయంగా తగ్గింది. ఎకరాకు 25 నుంచి 30 బస్తాల వరకే దిగుబడి వస్తుండడం, మరోవైపు ఖర్చులు పెరగడం రైతులను కలవరపరుస్తోంది. ఇక మార్కెట్‌లో సన్నరకం ధాన్యానికి డిమాండ్ ఉంటుందని ఆశించినా ప్రతికూల పరిస్థితులే ఎదురయ్యాయి. గతంలో సన్నరకం ధాన్యాన్ని కోసిన వెంటనే ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల మిల్లర్లు పచ్చి వడ్లనే అధిక ధరకు కొనుగోలు చేసేవారు. ఈ సంవత్సరం ఆ రాష్ట్రాల్లోనూ ఽవరి సాగు విస్తీర్ణం పెరగడంతో అక్కడి మిల్లర్లు ఇటు రావడం లేదు. ప్రభుత్వం ప్రకటించిన రూ. 500 బోనస్ వస్తుందనే ఆశతో రైతులు ఈ ఏడాది ఎక్కువ విస్తీర్ణంలో సన్నరకాలను సాగు చేశారు. అధిక పెట్టుబడి పెట్టినా సరైన దిగుబడి రాకపోవడంతో దిగులు చెందుతున్నారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో విక్రయించే రైతులకు ధాన్యం నగదు ముందుగా చెల్లిస్తున్న అధికారులు.. ఆ తర్వాత రైతుల ఖాతాల్లో బోనస్ డబ్బు జమ చేస్తామని చెబుతున్నారు. అలా కాకుండా మొత్తం డబ్బు కొనుగోలు కేంద్రాల్లో వెంటనే చెల్లించాలని రైతులు కోరుతున్నారు.
కొనుగోళ్లు వేగవంతం చేయాలి
వడ్ల కొనుగోళ్లు వేగవంతం చేయాలి. ధాన్యం రోజుల తరబడి ఆరబెట్టాలంటే చాలా ఖర్చులవుతున్నాయి. ఈ ఏడాది సన్న రకం వడ్లు సాగు చేస్తే ఎకరానికి 25 బస్తాల దిగుబడి వచ్చింది. పెట్టుబడులు బాగా పెరిగాయి. వడ్లు అమ్మితే పెట్టుబడి ఖర్చులు కూడా వచ్చే పరిస్థితి లేదు.
– నీరుడు రాజు, రైతు, బూర్గంపాడు
బోనస్ కూడా వెంటనే చెల్లించాలి
ధాన్యం డబ్బుతో పాటు ప్రభుత్వం ప్రకటించిన క్వింటాకు రూ. 500 బోనస్ కూడా రైతుల ఖాతాల్లో వెంటనే జమచేయాలి. ఈ ఏడాది దిగుబడులు బాగా తగ్గాయి. పెట్టుబడులు కూడా తిరిగి రాని పరిస్థితి. కొనుగోలు కేంద్రాలలో అమ్మిన ధాన్యానికి హమాలీ చార్జీలు ప్రభుత్వమే భరించాలి.
– ఆవుల వెంకటేశ్వరరెడ్డి, రైతు, రెడ్డిపాలెం
ప్రభుత్వ కేంద్రాల్లో తేమ శాతం కొర్రీలు
మిల్లర్లు, ప్రైవేట్ వ్యాపారులు తక్కువ ధరకే సన్నరకం ధాన్యం కొనుగోలు చేస్తుండగా.. మద్దతు ధర దక్కాలంటే రైతులు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించాలి. అక్కడ మద్దతు ధరతో పాటు క్వింటాకు రూ.500 బోనస్ కూడా చెల్లిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అయితే ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయించాలంటే తేమశాతం 17కు మించకూడదు. ఇందుకు కనీసం వారం, పది రోజుల పాటు ధాన్యాన్ని ఆరబెట్టాలి. ఇక కొనుగోలు కేంద్రాల్లో విక్రయించే ధాన్యానికి రైతులే హమాలీ చార్జీ కింద క్వింటాకు రూ.100కు పైగా చెల్లించాల్సి వస్తోంది. అదే ప్రైవేటు వ్యాపారులకు అమ్మితే ఈ ఖర్చులన్నీ వారే భరిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment