విద్యార్థులతోనే దేశ భవిష్యత్
అన్నపురెడ్డిపల్లి (చండుగొండ) : విద్యార్థుల మేధస్సు దేశానికి అవసరమని, వారి పైనే దేశ భవిష్యత్ ఆధారపడి ఉందని కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. అన్నపురెడ్డిపల్లి గురుకుల కళాశాలలో మూడు రోజులుగా కొనసాగుతున్న జిల్లాస్థాయి సైన్స్‌ఫేర్ బుధవారం ముగిసింది. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ.. విద్యార్థులు చదువుతో పాటు ఆట పాటలు, వైజ్ఞానిక ప్రదర్శనలపై దృష్టి పెట్టాలని సూచించారు. విద్యార్థుల ప్రయోగాలను పరిశీలించి.. అద్భుతంగా ఉన్నాయని ప్రశంసించారు. నిత్యం మంచి ఆలోచనలతో ఉంటే చదువుతోపాటు ఇతర అంశాలపై దృష్టి సారించవచ్చని అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రధాన ఆదాయ వనరు వ్యవసాయ రంగమేనని, వ్యవసాయం అంటే కూలీ పని కాదని, సమాజంలో రైతులదే ప్రథమ స్థానమని చెప్పారు. ఎస్పీ రోహిత్‌రాజ్ మాట్లాడుతూ.. విద్యార్థులు తమ సందేహాలను నివృత్తి చేసుకునేందుకు ప్రశ్నించేతత్వం అలవర్చుకోవాలని సూచించారు. నైపుణ్యంతో నేర్చుకునే ప్రతీ అంశం జీవితంలో పనికొస్తుందని అన్నారు. చెడు వ్యసనాల జోలికి పోకుండా విలువలు, క్రమశిక్షణతో మెలగాలని హితవు పలికారు. అంతకుముందు ఆయన శ్రీభ్రమరాంబ సమేత మల్లికార్జునస్వామిని దర్శించుకున్నారు.
అంకితభావంతో ముందుకు సాగాలి
మారుమూల ప్రాంతమైనప్పటికీ జిల్లా నలుమూలల నుంచి 800 పైగా ఎగ్గిబిట్స్ రావడం సంతోషంగా ఉందని ఎమ్మెల్యే జారే ఆదినారాయణ అన్నారు. విద్యార్థులు ఇదే అంకితభావంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. కార్యక్రమ విజయవంతానికి సహకరించిన అధికారులు, ఉపాధ్యాయులకు కృతజ్ఞతలు తెలిపారు. ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య మాట్లాడుతూ.. మారుమూల ప్రాంతంలో జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శన విజయవంతం చేసిన జారే ఆదినారాయణను ‘శభాష్ తమ్ముడు’ అంటూ అభినందించారు.
రాష్ట్రస్థాయికి 27 మంది..
జిల్లా స్థాయి సైన్స్‌ఫేర్‌లో అసాధరణ ప్రతిభ కనబర్చి ప్రయోగాలు ప్రదర్శించిన 27 మంది విద్యార్థులు రాష్ట్రస్థాయికి ఎంపికయ్యారు. వారికి కలెక్టర్, ఎస్పీలతో పాటు ఎమ్మెల్యేలు జారే ఆదినారాయణ, కోరం కనకయ్య చేతుల మీదుగా ప్రశంసాపత్రాలు, జ్ఞాపికలు అందజేశారు. కార్యక్రమంలో రాష్ట్ర మార్క్‌ఫెడ్ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు, డీఈఓ వెంకటేశ్వరాచారి, డీఎస్‌ఓ చలపతిరాజు, తహసీల్దార్ జగదీశ్వర్‌ప్రసాద్, ఎంపీడీఓ మహాలక్ష్మి, ఎంఈఓ ఆనంద్‌కుమార్, పర్సా వెంకట్, గాంధీ పాల్గొన్నారు.
వారి మేధస్సు దేశానికి అవసరం
చిన్నప్పటి నుంచే అన్ని రంగాలపై దృష్టి పెట్టాలి
కలెక్టర్ జితేష్ వి పాటిల్
Comments
Please login to add a commentAdd a comment