మెడికల్‌లో మెస్ గోల!
భయాందోళనలో విద్యార్థులు..
ఇటీవల మెడికల్ కాలేజీ హాస్టళ్లకు సరఫరా చేసిన భోజనం తిని కొందరు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. అయితే ఈ విషయాన్ని కాలేజీ యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లడానికి విద్యార్థులు వెనకాడుతున్నారు. గతంలో మెస్ బాగా లేదని ఫిర్యాదు చేస్తే.. పరిష్కారం చూపకపోగా నెలల తరబడి తిండికి ఇబ్బంది పడే దుస్థితి ఎదురైంది. దీంతో మధ్యాహ్నం వేళ పస్తులున్న విద్యార్థులకు.. రాత్రి వేళ భోజనానికి పాల్వంచ పట్టణంలోని హోటళ్లే దిక్కయ్యాయి. ఒక్కోసారి పదుల సంఖ్యలో వచ్చే విద్యార్థులకు ఆ హోటళ్లు కూడా భోజనం అందించలేకపోయాయి. దీంతో మెస్ విషయంలో మరోసారి ఫిర్యాదు చేస్తే పరిస్థితి మరింత దిగజారుతుందనే భయాందోళనలో విద్యార్థులు ఉన్నారు.
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: జిల్లాకు 2022 – 23 విద్యాసంవత్సరంలో 150 సీట్లతో వైద్య కళాశాల మంజూరైంది. నర్సింగ్ కాలేజీ కోసం నిర్మించిన భవనాల్లోనే మెడికల్ కాలేజీ తరగతులు ప్రారంభించారు. ఇప్పటికే రెండు బ్యాచ్‌ల విద్యార్థులు ఇక్కడ చదువుతుండగా మరో బ్యాచ్ విద్యార్థులు కూడా రానున్నారు. ఇక్కడ చదివే అమ్మాయిలు, అబ్బాయిలకు పాల్వంచలో వేర్వేరుగా హాస్టళ్లు నిర్వహిస్తున్నారు. విద్యార్థులే సొంతంగా డబ్బు చెల్లించేలా మెస్ కాంట్రాక్టర్‌ను నియమించారు. అయితే నాణ్యమైన భోజనం అందడం లేదని విద్యార్థులు గత మార్చిలో ఆందోళన చేయగా సదరు కాంట్రాక్టర్‌ను తప్పించారు. ఆ తర్వాత ఐదారు నెలల పాటు విద్యార్థులు ఇబ్బంది పడినా మరే ఇతర ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయలేదు. ఇటీవల మహిళా శక్తి పేరుతో స్వయం సహాయక సంఘానికి అప్పగించినా పరిస్థితి మారలేదు.
బస్ సర్వీస్‌ల పంచాయితీ..
వైద్య కళాశాల తరగతి గదులు, హాస్టల్, బోధనాస్పత్రులు వేర్వేరు చోట ఉండటంతో విద్యార్థుల రాకపోకలకు ఇబ్బంది కలుగుతోంది. దీంతో కాలేజీ అవసరాల కోసం అద్దె ప్రాతిపదికన మూడు బస్సులను గతేడాది ఏర్పాటు చేశారు. ముందుగా వీటిని ఇతర ప్రాంతాల నుంచి కొత్తగూడెం వచ్చే ప్రథమ సంవత్సర విద్యార్థులకే ఉపయోగించాలని, అందుకు సంబంధించిన చార్జీలను వారే చెల్లించాలని నిర్ణయించారు. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితుల కారణంగా ప్రథమ, ద్వితీయ సంవత్సర విద్యార్థులు పలువురు కూడా ఈ బస్ సర్వీస్‌ను ఉపయోగించుకున్నారు. దీంతో తమతో పాటు సెకండియర్ విద్యార్థుల నుంచి కూడా బస్ చార్జీలు వసూలు చేయాలని ఫస్టియర్ వారు డిమాండ్ చేస్తున్నారు. అయితే ద్వితీయ సంవత్సర విద్యార్థుల నుంచి దీనిపై సానుకూల స్పందన కరువైంది. ఇలా బస్ సర్వీస్‌ల బకాయిలు పేరుకుపోతున్నాయి. గత ఫిబ్రవరి నుంచి అక్టోబర్ వరకు ఒక్క రూపాయి కూడా చెల్లించకపోవడంతో ఇటీవల సదరు కాంట్రాక్టర్ సర్వీసు నిలిపేసేందుకు సిద్ధం కాగా చర్చలు, హామీలతో వెనక్కి తగ్గాడు.
ఇన్‌చార్జ్‌ల పాలన
మెడికల్ కాలేజీకి మొదట ప్రిన్సిపాల్‌గా లక్ష్మణ్‌రావు నియమితులయ్యారు. అయితే నిర్వహణ పరమైన లోపాలపై ఆరోపణలు రావడంతో ఈ ఏడాది సెప్టెంబర్‌లో ఆయనను బదిలీ చేశారు. అప్పటి నుంచి పాథాలజీ ప్రొఫెసర్ రాజ్‌కుమార్ ఇన్‌చార్జ్ ప్రిన్సిపాల్‌గా వ్యవహరిస్తున్నారు. దీంతో కాలేజీ నిర్వహణ వ్యవహారాల్లో పూర్తిస్థాయి నిర్ణయాలు ఆయన తీసుకోవడం లేదు. ఫలితంగా ఇక్కడ సమస్యలు నానాటికీ పేరుకుపోతున్నాయి. ఇప్పటికై నా మంత్రులు, ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు స్పందించి వైద్య కళాశాలలో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.
మెస్‌లో సమస్య లేదు
మెస్‌లో సమస్య ఉన్న అంశం నా దృష్టికి రాలేదు. ఒకరిద్దరు విద్యార్థులు బయట తినడం వల్ల ఫుడ్ పాయిజన్ అయి ఇబ్బంది పడ్డారు. బస్సులకు సంబంధించిన విషయంలో కాలేజీ మేనేజ్‌మెంట్ కేవలం అనుసంధానకర్త మాత్రమే. పూర్తి బాధ్యత మాది కాదు.
– రాజ్‌కుమార్, ఇన్‌చార్జ్ ప్రిన్సిపాల్
వైద్య కళాశాలలో పూర్తికాని హాస్టల్, మెస్ నిర్మాణ పనులు
ప్రైవేట్ హాస్టళ్లు, హోటళ్లను ఆశ్రయిస్తున్న విద్యార్థులు
గతంలో కాలేజీ మెస్
బాగా లేదంటూ ఆందోళన
కాంట్రాక్టు రద్దుతో నెలల తరబడి ఇబ్బంది పడిన విద్యార్థులు
భోజనం విషయంలో మళ్లీ తప్పని ఇక్కట్లు
వాట్సాప్ గ్రూపులో చర్చ..
మెడికల్ కాలేజీ విద్యార్థుల తల్లిదండ్రులకు సంబంధించిన వాట్సాప్ గ్రూపులో మెస్‌లో భోజనం బాగా లేని విషయంపై చర్చ జరిగింది. దీంతో కొందరు తల్లిదండ్రులు చొరవ చూపించి భోజనంలో లోపాలు లేకుండా చూడాలని మెస్ నిర్వాహకుడితో పాటు కాలేజీ మేనేజ్‌మెంట్‌కు చెప్పారు. అక్కడి నుంచి సరైన భరోసా రాకపోవడంతో ఫుడ్ ఇన్‌స్పెక్టర్ దృష్టికి తీసుకెళ్లినట్టు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment