కలెక్టర్ దృష్టి పెడితేనే..
కొత్తగూడెం ఎకో టూరిజం సెంట్రల్ పార్క్ మెరుగు..
● నిర్వహణ లోపాలతో కళ తప్పుతున్న ‘చలమల’ వనం ● బోటింగ్, కాటేజీలు ఏర్పాటు చేయాలని కోరుతున్న జిల్లావాసులు
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: జిల్లాను పర్యాటక రంగంలో అగ్రగామిగా నిలిపేందుకు కలెక్టర్ జితేష్ వి.పాటిల్ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే పర్యాటక రంగానికి అనువుగా ఉండే చండ్రుగొండ మండలంలోని కనకగిరి గుట్టలు, లక్ష్మీదేవిపల్లి మండలంలోని కారుకొండ గుట్టలు, అశ్వాపురం మండలంలో తుమ్మల చెరువులను స్వయంగా సందర్శించి పరిశీలించారు. ఎవరూ ఊహించని విధంగా కిన్నెరసాని–కేటీపీఎస్ కెనాల్‌లో పుట్టిలను ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. ఇతర ప్రాంతాల పర్యాటకులను ఆకట్టుకునేలా, స్థానికత ఉట్టి పడేలా మట్టి గోడలతో ఇంటి నిర్మాణాలు చేపట్టే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇలా జిల్లాలో పర్యాటక రంగాన్ని పట్టాలెక్కించేందుకు ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదే క్రమంలో కొత్తగూడెంలోని చలమల శ్రీనివాసరావు సెంట్రల్ పార్క్‌పై కూడా దృష్టి సారించాలని జిల్లావాసులు కోరుతున్నారు.
సెంట్రల్ పార్కు వాకింగ్‌కే పరిమితమా..?
ఎకో టూరిజాన్ని ప్రోత్సహించడంలో భాగంగా ఇల్లెందు క్రాస్‌రోడ్డు దగ్గర సుమారు మూడు వందల ఎకరాల విస్తీర్ణంలో సెంట్రల్ పార్కు ఏర్పాటు చేశారు. చిట్టడవిని తలపించే ఈ పార్కులో వివిధ రకాల పళ్లు, పూల మొక్కలు విరివిగా ఉన్నాయి. అతి పెద్ద వాకింగ్ ట్రాక్ సుమారు నాలుగు కిలోమీటర్ల వరకు ఉంటుంది. ట్రాక్ మధ్యలో వాటర్ స్పోర్ట్స్, అడ్వెంచర్ స్పోర్ట్స్, ఓపెన్ జిమ్, యోగా పగోడాలు, పిక్నిక్ సెంటర్లు, చిల్డ్రన్స్ స్పోర్ట్స్ ఎంటర్‌టైన్‌మెంట్ జోన్లు , క్యాంటీన్, ఎత్తైన వ్యూ పాయింట్లు తదితర సౌకర్యాలు ఉన్నాయి. అతి విశాలమైన పార్కులో తిరిగేందుకు వీలుగా బ్యాటరీ కార్లు కూడా ఉన్నాయి. ఫ్యామిలీతో వస్తే ఒక రోజంతా గడిపేందుకు వీలుగా తీర్చిదిద్దారు. ప్రకృతి పర్యాటక విభాగంలో విస్త్రృతమైన అభివృద్ధి ఆస్కారం కలిగిన ఈ పార్కు ప్రస్తుతం వాకింగ్ ట్రాక్, వనభోజనాల వేడుకలకే పరిమితమవుతోంది. కేవలం నిర్వహణ లోపాల కారణంగా రోజురోజుకూ కళ తప్పుతోంది.
కాటేజీలను అందుబాటులోకి తేవాలి
పార్కును ఆరంభించిన కొత్తలో అడ్వెంచర్ టూరిజంలో భాగంగా వంద మీటర్లకు పైగా నిడివితో రోప్ వాక్ వే ఏర్పాటు చేశారు. అయితే నిర్వహణ లోపాల కారణంగా మొత్తం పాడైపోయింది. ఇలాగే కొనసాగితే ఆనవాళ్లు కూడా కోల్పోయే ప్రమాదముంది. పర్యాటకుల బసకు వీలుగా మూడు కాటేజీలు నిర్మించారు. అనంతరం వాటిని అటవీశాఖ ఉన్నతాధికారుల క్యాంపు ఆఫీసులుగా మార్చేశారు. దీంతో ఏడాదిలో నాలుగైదు రోజులు మినహా మిగిలిన సమయంలో నిరుపయోగంగా ఉంటున్నాయి. పార్కుకు ఉన్న ప్రాధాన్యత, ఇక్కడున్న సౌకర్యాలను దృష్టిలో ఉంచుకుని కాటేజీలను సామాన్యులకు అందుబాటులోకి తేవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
చెత్త కుప్పల్లో బోట్లు..
బోటింగ్ కోసం కేటాయించిన చెరువు మధ్యలో బుద్ధుడి విగ్రహం ఏర్పాటు చేశారు. విహరించేందుకు వీలుగా జెట్టీ, బోట్లు కూడా వచ్చాయి. కానీ బోటింగ్ సౌకర్యం ప్రజలకు అందుబాటులోకి రాలేదు. దీంతో జలవిహారం కోసం తెచ్చిన బోట్లు చెత్త కుప్పలపాలయ్యాయి. బోటింగ్ ఏరియా చుట్టూ ఆకర్షణీయంగా తీర్చిదిద్దిన ఏషియన్ ఏనుగు విగ్రహం, కుర్చీలు, బెంచీలు ప్రారంభానికి ముందే విరిగిపోతున్నాయి. సెంట్రల్ పార్కులో సగానికి పైగా టాయిలెట్ల తలుపులు విరిగిపోయాయి. నల్లా పని చేయక నిరుపయోగంగా మారాయి. ఇక పగోడాల విషయానికి వస్తే బైసన్ జంక్షన్ దగ్గరున్న పగోడాలే వినియోగంలో ఉన్నాయి. మిగిలినవి కనిపించని విధంగా చెట్లు, చెత్తతో కమ్ముకుపోయాయి. టాయిలెట్లను రిపేర్ చేసి పగోడాలను శుభ్రం చేస్తే మరోసారి పార్కు కొత్త కళ సంతరించుకునే అవకాశం ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment