నేత్రపర్వంగా రామయ్య నిత్యకల్యాణం
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి నిత్యకల్యాణ వేడుక గురువారం నేత్రపర్వంగా సాగింది. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామి వారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు.
పెద్దమ్మతల్లికి
సువర్ణ పుష్పార్చన
పాల్వంచరూరల్ : మండల పరిధిలోని కేశవాపురం – జగన్నాథపురం గ్రామాల మధ్య కొలువుదీరిన శ్రీ పెద్దమ్మతల్లి అమ్మవారికి అర్చకులు గురువారం 108 సువర్ణ పుష్పాలతో వైభవంగా అర్చన నిర్వహించారు. అనంతరం నివేదన, హారతి, మంత్రపుష్పం సమర్పించారు. కార్యక్రమంలో ఈఓ రజనీకుమారి, అర్చకులు పద్మనాభశర్మ, రవికుమార్‌శర్మ తదితరులు పాల్గొన్నారు.
రేపు జాబ్‌మేళా
సింగరేణి(కొత్తగూడెం): కొత్తగూడెంలోని జిల్లా పరిషత్ కార్యాలయంలో ఈనెల 30న జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పన శాఖాధికారి కొండపల్లి శ్రీరామ్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. కిమ్స్ ఫౌండేషన్ అండ్ రీసెర్చ్ సెంటర్ ఆధ్వర్యంలో మూడు నెలల నైపుణ్య శిక్షణ, ఉద్యోగ అవకాశం కల్పిస్తామని పేర్కొన్నారు. జనరల్ డ్యూటీ, హాస్పిటల్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు 18 – 29 సంవత్సరాల మధ్య వయసు ఉండి, ఎస్సెస్సీ, ఇంటర్, డిగ్రీ పూర్తి చేసిన వారు అర్హులని వివరించారు.
మెనూ అమలుపై ఆరా..
పాల్వంచరూరల్ : కిన్నెరసాని క్రీడా పాఠశాలకు అందించే మెనూ ఎలా ఉంటోందని మహబూబాబాద్, ములుగు జిల్లాల క్రీడా శాఖాధికారులు వై.ఆదినారాయణ, సీహెచ్.కొమ్మాలు ఆరా తీశారు. కిన్నెరసాని ఆశ్రమ పాఠశాలను గురువారం వారు పరిశీలించారు. ఏరోజు ఏ ఆహార పదార్థాలు పెడుతున్నారని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. వివిధ క్రీడాంశాల్లో జిల్లా, రాష్ట్ర స్థాయిలో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు ఎలాంటి శిక్షణ ఇస్తున్నారని పరిశీలించారు. వారి వెంట ఏఎస్‌ఓలు ఎస్.వెంకన్న, పద్మజ, లక్ష్మీనారాయణ, జిల్లా స్పోర్ట్స్ అధికారి గోపాల్, ఏటీడీఓ చంద్రమోహన్, పీడీ బాలసుబ్రహ్మణ్యం, పీఈటీ దొడ్డి అంజయ్య, కోచ్‌లు వాసు, ప్రసాద్, సందీప్, మండల్ సునీల్ ఉన్నారు.
ఆర్టీసీ సెక్యూరిటీ అధికారుల అలర్ట్
చుంచుపల్లి: ఆర్టీసీ అద్దె బస్సులతో ప్రమాదాలు పెరుగుతున్నాయని, దీనికి డ్రైవర్ల నిర్లక్ష్యంతో పాటు మద్యం మత్తు ఓ కారణమంటూ మంగళవారం ‘హైర్‌తో అనర్థాలు’ శీర్షికన సాక్షిలో ప్రచురితమైన కథనానికి సెక్యూరిటీ విభాగం అధికారులు స్పందించారు. గురువారం అన్ని డిపోల పరిధిలో డ్రైవర్లకు విస్తృతంగా బ్రీత్ ఎనలైజర్ పరీక్షలు నిర్వహించడమే కాక పర్యవేక్షణ మరింతగా పెంచారు. బస్సుల పనితీరును సైతం పూర్తిస్థాయిలో పరిశీలించిన తర్వాతే బయటకు పంపేందుకు అనుమతి ఇస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment