చేపలు సరే.. రొయ్యల మాటేంటి ?
● ఈ ఏడాది పంపిణీకి మంగళం పాడినట్టేనా.. ● గత సంవత్సరం 15 చెరువుల్లో 23 లక్షల పిల్లలు విడుదల
పాల్వంచరూరల్: చెరువుల్లో రొయ్య పిల్లల పంపిణీకి ఈ ఏడాది ప్రభుత్వం మంగళం పాడినట్టేనా అని మత్య్సకారులు నిరుత్సాహపడుతున్నారు. చేప పిల్లలను సరఫరా చేసిన అధికారులు.. రొయ్యల పంపిణీపై ఎలాంటి ప్రకటనా చేయడం లేదు. గత సంవత్సరం చేప పిల్లలతో పాటే రొయ్యలు కూడా విడుదల చేయగా.. ఈ ఏడాది వాటి ఊసే లేకపోవడంతో సొసైటీ సభ్యులకు నిరీక్షణ తప్పడం లేదు.
గతేడాది 23 లక్షల పిల్లలు..
మత్స్యకారుల ఆర్థిక పరిపుష్టిని పెంచే లక్ష్యంతో ప్రభుత్వం ప్రతీ సంవత్సరం చేప, రొయ్య పిల్లలను ఉచితంగా పంపిణీ చేస్తోంది. ఆయా చెరువుల పరిధిలోని మత్స్యకారులు సొసైటీగా ఏర్పడి చేపల పెంపకం చేపడుతున్నారు. మంచినీటి చెరువుల్లో రొయ్యలను సైతం పెంచేవారు. గతేడాది సుజాతనగర్ మండలంలోని సింగభూపాలెం, బూర్గంపాడు మండలం నకిరపేటతో పాటు అశ్వారావుపేట, ములకలపల్లి, ఇల్లెందు, టేకులపల్లి, జూలూరుపాడు, చర్ల, అశ్వాపురం, చండ్రుగొండ, మణుగూరు మండలాల పరిధిలోని 15 చెరువుల్లో 23 లక్షల రొయ్య పిల్లలను పంపిణీచేశారు. ఆయా చెరువుల్లో రొయ్య పిల్లలు బాగానే పెరిగినప్పటికీ.. జిల్లాలో చేపల పెంపునకు గల అనువైన వాతావరణం రొయ్యల ఉత్పత్తికి లేదని మత్స్యశాఖ అధికారులు అంటుండడం గమనార్హం. గత సంవత్సరం రొయ్యల పెంపకం ఆశాజనకంగానే ఉందని, ఈ ఏడాది కూడా రొయ్య పిల్లలు పంపిణీ చేయాలని, తద్వారా తమ ఆర్థికాభివృద్ధికి దోహదం చేయాలని మత్స్యకారులు కోరుతున్నారు.
ఐదునెలల్లో దిగుబడి..
రొయ్యల్లో రెండు రకాలు ఉంటాయి. ఉప్పునీటిలో పెరిగే రొయ్యలు(టైగర్ రొయ్యలు), మరో రకం మంచినీటిలో పెరిగే రొయ్యలు. వాటిలో మంచినీటి రొయ్యల పెంపకానికి జిల్లా వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. ఈ పిల్లలు చెరువులో పోసిన ఐదు నెలల్లో విక్రయానికి అనువుగా పెరుగుతాయి. మార్కెట్‌లో వాటి ధర కిలో రూ.300కు పైగా ఉంటుంది. వీటి విక్రయం ద్వారా మత్స్య పారిశ్రామక సభ్యులు ఆర్థికాభివృద్ధి సాధించే అవకాశం ఉంటుంది.
చేప పిల్లలూ సగమే..
మత్స్యకారులను ఆర్థికంగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో 2016 – 17 సంవత్సరం నుంచి ప్రభుత్వం 100 శాతం సబ్సిడీతో చేప పిల్లలను పంపిణీ చేస్తోంది. చేపలు పెరిగిన తర్వాత పట్టేందుకు వలలు, రవాణా చేసేందుకు ద్విచక్ర వాహనాలను కూడా సబ్సిడీపై అందించింది. జిల్లాలో 734 చెరువులు, మూడు జలాశయాలు ఉండగా గతేడాది ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో 1.76 కోట్ల చేప పిల్లలను పంపిణీ చేశారు. అయితే ఈ ఏడాది 86 లక్షల పిల్ల లను మాత్రమే విడుదల చేయగా.. అందులోనూ తీవ్ర జాప్యం జరిగింది. కొన్ని చెరువుల్లో నవంబర్‌లో సైతం చేప పిల్లలు పోశారు. మార్చి, ఏప్రిల్ వరకు చెరువుల్లో నీరు ఎండిపోతుందని, ఇలా అయితే పిల్లలు ఎలా పెరుగుతాయని మత్స్యకారులు ప్రశ్నిస్తున్నారు. ఇది తమకు తీవ్ర నష్టం కలిగిస్తుందని వాపోతున్నారు.
రొయ్యల పంపిణీపై ఆదేశాలు రాలేదు..
జిల్లాలో గతేడాది 15 చెరువుల్లో 23 లక్షల రొయ్య పిల్లలను పంపిణీ చేశాం. ఈ ఏడాది కూడా ప్రతిపాదనలు పంపించినా ప్రభుత్వం నుంచి ఇంతవరకు ఎలాంటి ఆదేశాలు రాలేదు. – ఎండీ.ఇంతియాజ్ అహ్మద్‌ఖాన్,
జిల్లా మత్స్యశాఖ అధికారి
Comments
Please login to add a commentAdd a comment