రామయ్యకు సువర్ణ పుష్పార్చన
భద్రాచలం: భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి వారి మూలమూర్తులకు ఆదివారం అభిషేకం చేశారు. అనంతరం సువర్ణ పుష్పార్చన గావించారు. తొలుత తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం మేళతాళాల నడుమ సీతాలక్ష్మణ సమేతుడైన రామయ్యను గర్భగుడి నుంచి ఊరేగింపుగా తీసుకొచ్చి చిత్రకూట మండపంలో కొలువుదీర్చారు. విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం అనంతరం కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
శ్రీ కనకదుర్గమ్మ
తల్లికి విశేష పూజలు
పాల్వంచరూరల్: శ్రీకనకదుర్గమ్మ తల్లికి అర్చకులు విశేష పూజలు నిర్వహించారు. మండలంలోని శ్రీకనకదుర్గ (పెద్దమ్మతల్లి) ఆలయానికి ఆదివారం జిల్లా నలుమూలల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. దీంతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది. క్యూలైన్ ద్వారా భక్తులు అమ్మవారిని దర్శించుకోగా, అర్చకులు విశేష పూజలు జరిపారు. భక్తులు అన్న ప్రాసనలు, ఒడిబియ్యం, పసుపు కుంకుమలు, చీరలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. పూజా కార్యక్రమంలో ఈఓ రజనీకుమారి, వేదపండితులు పద్మనాభశర్మ, అర్చకులు రవికుమార్‌శర్మ పాల్గొన్నారు.
కిన్నెరసానిలో
సండే సందడి
ఒకరోజు ఆదాయం రూ.32,785
పాల్వంచరూరల్ : పాల్వంచ మండలంలోని కిన్నెరసానిలో ఆదివారం పర్యాటకులు సందడి చేశారు. జిల్లా నలుమూలలతో పాటు పొరుగు జిల్లాల నుంచి అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఈ సందర్భంగా డ్యామ్ పైనుంచి జలాశయాన్ని, డీర్‌పార్కులో దుప్పులను వీక్షించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆనందోత్సాహాల నడుమ గడిపారు. 494 మంది పర్యాటకులు కిన్నెరసానిలోకి ప్రవేశించడం ద్వారా వైల్డ్‌లైఫ్ శాఖకు రూ.18,385 ఆదాయం లభించగా, 400 మంది బోటు షికారు చేయడం ద్వారా పర్యాటకాభివృద్ధి సంస్థకు రూ.14,400 ఆదాయం లభించినట్లు నిర్వాహకులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment