పెండింగ్ దరఖాస్తులపై దృష్టి సారించాలి
సింగరేణి(కొత్తగూడెం): పెండింగ్ దరఖాస్తులపై దృష్టి సారించాలని ఎన్నికల పరిశీలకులు బాల మాయాదేవి సూచించారు. ఆదివారం కలెక్టర్ సమావేశ మందిరంలో జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ జితేష్ వి.పాటిల్‌తో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ ఆదేశాల ప్రకారం విధులు నిర్వహించాలన్నారు. పెండింగ్‌లో ఉన్న ఫామ్ 6,7,8లను పరిష్కరించాలని, దివ్యాంగ ఓటర్లను గుర్తించాలని, అన్ని రాజకీయ పార్టీలతో సమావేశాలు నిర్వహించాలని ఆదేశించారు. నాణ్యమైన ఓటరు ఏపిక్ కార్డులను ప్రింట్ చేసి పంపిణీ చేయాలన్నారు. కళాశాలల్లో ఓటరు నమోదు, ఓటు హక్కుపై అవగాహన చైతన్య కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. పోలింగ్ కేంద్రాల్లో మౌలిక వసతులు కల్పించాలని చెప్పారు. తొలుత బాలమాయాదేవికి పూలమొక్క అందజేసి స్వాగతం పలికారు. అనంతరం కలెక్టర్ ఆమెకు పోలింగ్ కేంద్రాలు, ఓటర్ ఐడీ కార్డుల జారీ, పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాట్లు తదితర అంశాలను వివరించారు. స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కాశయ్య, భద్రాచలం ఆర్డీఓ దామోదర్ రావు, రంగా ప్రసాద్, ఇందిర తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment