ప్రశాంతతకు నిలయం
● 122 ఏళ్ల నాటి సీఎస్‌ఐ చర్చి ● బ్రిటీష్ హయాం నుంచి ప్రార్థనలు ● క్రిస్మస్‌కు ముస్తాబవుతున్న ఆలయం
ఇల్లెందు: పట్టణంలో 122 ఏళ్ల నాటి సీఎస్‌ఐ చర్చి క్రిస్మస్ పర్వ దినానికి ముస్తాబవుతోంది. అయితే ఈ చర్చిలో క్రిస్మస్ పర్వదినం ఇదే చివరిది కావచ్చని తెలుస్తోంది. పురాతన భవనం కావటం వల్ల దీని మన్నిక మీద అనుమానాలు ఉన్నాయి. ఈ చర్చి ఇలా ఉండగా మిషన్ స్కూల్ వద్ద మరో చర్చి నిర్మాణం సాగుతోంది. వచ్చే ఆగస్టు నాటికి పూర్తయ్యేలా పనులు సాగుతున్నాయి. వచ్చే క్రిస్మస్ పర్వదినం నూతన చర్చిలో జరిగే అవకాశాలు ఉన్నాయి.
122 ఏళ్ల చరిత్ర
గుండాల రోడ్‌లో కోర్టు వద్ద గల సీఎస్‌ఐ చర్చి 122 ఏళ్ల చరిత్రను కలిగి ఉంది. నేటికీ ఆ చర్చి భవనం చెక్కుచెదరకుండా దర్శనమిస్తోంది. బ్రిటీష్ హయం నుంచి నేటి వరకు ఈ చర్చీల్లో ప్రార్థనలు కొనసాగుతున్నాయి. 1902లో హెన్రీ లార్డ్ బిషఫ్ ఆఫ్ మద్రాస్ ఈ చర్చిని నిర్మించారు. నాడు 35 క్రిస్టియన్ కుటుంబాలు ఏసును ఆరాధించుకునేందుకు వీలుగా ఈ చర్చిని స్థాపించారు. దినదినాభివృద్ధి చెందుతూ నేడు 600 కుటుంబాల వరకు ఈ చర్చికి వస్తుంటారు. ఈ చర్చికి అనుబంధంగా మిషన్ స్కూల్‌ను ఏర్పాటు చేశారు. 1908లో ఏర్పాటు చేసిన మిషన్ భవనంలో వైద్యశాల, విద్యాలయాన్ని ఏర్పాటు చేశారు. ఈ విద్యాలయంలో ఎందరో ప్రముఖులు విద్యనభ్యసించారు. చర్చికి వస్తున్న భక్తుల విరాళాలతోనే నిర్వహణ కొనసాగుతోంది. ఇక్కడి వ్యవహారాలన్నీ డోర్నకల్ బిషప్ కె.పద్మారావు నేతృత్వంలో సాగుతున్నాయి. ఏటా డిసెంబర్ 25వ తేదీన క్రిస్మస్ వేడుకలకు ఈ చర్చి వేదికగా మారుతుంది. సుదూర ప్రాంతాల్లో ఉన్న వారు సైతం ఈ చర్చికి వచ్చి ప్రార్థనలు చేస్తుంటారు.
ఆవిర్భావం ఇలా..
ఇంగ్లాండ్ నుంచి బ్రిటీష్ వారు ఇక్కడ బొగ్గు వెలికి తీసే క్రమంలో 35 కుటుంబాలు నివాసం ఉండేవి. వారి కోసం 1902లో లార్డ్ బిషప్ హెన్రీ ఈ చర్చిని నిర్మించారు. ఈ చర్చి ఆధ్వర్యంలో కొత్తగూడెం, ఖమ్మం, వరంగల్, సూర్యాపేట, నల్లగొండ జిల్లాల్లో కార్యకలాపాలు సాగుతున్నాయి. ఒక్క ఇల్లెందు పట్టణంలోనే మరో రెండు చర్చిలు ఉన్నాయి. డోర్నకల్ కేంద్రంగా బిషప్ పద్మారావు నేతృత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం క్రిస్మస్ కేడకలకు ముస్తాబవుతోంది. ప్రత్యేక ప్రార్థనలు, వివాహాలు సాగుతున్నాయి. కాగా, చర్చి ఆవరణలో ఉన్న ఓ వృక్షం నాడు బ్రిటీష్‌వారు ఇంగ్లాండ్ నుంచి తెచ్చి నాటారు. ఆ వృక్షం నేటికీ అలాగే ఉంది. అయితే ఆకులు రాలిపోయిన తరుణంలో పూలు పూసే ఈ వృక్షం ఎండిపోయినట్లు ఉంటుంది.
సందేశానికి ప్రాముఖ్యత ఉంటుంది
ఏడాదికి ఒకసారి జరిగే క్రిస్మస్ పండుగ అంగరంగ వైభవంగా జరుగుతుంది. పండు గ పూట ప్రత్యేక ప్రార్థనలు జరుగుతాయి. పండుగ మరుసటి రోజున పేదలకు వస్త్ర దానం, అన్నదానం చేస్తాం. ముఖ్యంగా పండుగ రోజున చర్చిలో ప్రార్థనలు, సందేశానికి అత్యంత ప్రాధాన్యత ఉంటుంది. ఈ సందేశం ప్రతీఒక్కరూ వినవచ్చు. – పి.బాబూరావు, పాస్టర్,
సీఎస్‌ఐ చైర్మన్, వీరామణి
Comments
Please login to add a commentAdd a comment