వినియోగదారుల హక్కులను కాపాడాలి
సూపర్‌బజార్(కొత్తగూడెం): జాతీయ వినియోగదారుల దినోత్సవం సందర్భంగా పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌లో జాతీయ వినియోగదారుల దినోత్సవాన్ని మంగళవారం నిర్వహించారు. అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. వినియోగదారుల హక్కులను కాపాడటానికి 1986 లో చట్టం అమలులోకి రాగా.. 2019లో మార్పులు చేసి వినియోగదారుల హక్కుల పరిరక్షణ చట్టంగా రూపొందించారని తెలిపారు. రాయితీలు, ఉచిత ప్రకటనలను ఆన్‌లైన్‌లో చూసి మోసపోవద్దని, పాస్‌వర్డ్‌లను సులువుగా పెట్టుకోవద్దని, ఓటీపీలను ఇతరులతో పంచుకోవద్దని సూచించారు. కొనుగోలు చేసిన వస్తువు తయారీ, చిరునామా, గడువు తేదీ, కస్టమర్ కేర్ నంబర్‌ను సరిచూసుకోవాలని పేర్కొన్నారు. డిజిటల్ పేమెంట్లు, క్యూఆర్ కోడ్, మొబైల్ యాప్ ద్వారా చెల్లింపుల విషయంలో వినియోగదారులు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. తూకాలలో మోసపోవద్దని, వ్యాపారులు ఉపయోగించే తూనికలు, కొలతల పరికరాలకు సకాలంలో ముద్ర వేయించుకుని లైసెన్స్ తీసుకోవాలని వివరించారు. ఈ కార్యక్రమంలో డీఎస్‌ఓ రుక్మిణి, డీఎం సివిల్ త్రినాథ్‌బాబు, జిల్లా లీగల్ మెట్రాలజీ అధికారి మనోహర్, డీఈఓ వెంకటేశ్వరాచారి, వలంటరీ ఆర్గనైజర్లు జూలూరి రఘుమాచారి, తెలంగాణ రాష్ట్ర వినియోగదారుల హక్కుల సంస్థ ప్రధాన కార్యదర్శి గుగులోత్ బాలు, మహమ్మద్ రియాజ్, ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment