మతిస్థిమితం లేని వ్యక్తి హల్‌చల్
అశ్వారావుపేటరూరల్: మతిస్థిమితం లేని ఓ వ్యక్తి హల్‌చల్ చేశాడు. దీంతో కానిస్టేబుల్ స్వల్పంగా గాయపడిన ఘటన మంగళవారం చోటుచేసుకుంది. అశ్వారావుపేటలోని సబ్ సెంటర్–3లో సెకండ్ ఏఎన్‌ఎంగా విధులు నిర్వహిస్తున్న అరుణ భోజన విరామంలో స్థానిక బ్యాంక్ వద్దకు వెళ్లింది. ఆ సమయంలో మతిస్థిమితం లేని వ్యక్తి సబ్ సెంటర్‌లోకి వెళ్లి టేబుల్‌పై ఉన్న ట్యాబ్‌ను తీసుకెళ్లాడు. కాగా, బ్యాంక్ నుంచి తిరిగి వచ్చిన ఏఎన్‌ఎంకు ట్యాబ్ కనిపించ లేదు. దీంతో స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వగా, సిబ్బంది విచారణ చేశారు. సబ్ సెంటర్ సమీపంలోనే ట్యాబ్ లొకేషన్ చూపించడంతో గాలించారు. సబ్ సెంటర్ పక్కనే ఉన్న శిథిలమైన భవనం లోపల ఉన్న మతిస్థిమితం లేని వ్యక్తి వద్ద ఉన్నట్లు గుర్తించారు. దీంతో ట్యాబ్ ఇవ్వాలని, పోలీస్ సిబ్బంది కోరగా వాగ్వాదానికి దిగాడు. అంతేకాదు పోలీస్ సిబ్బంది, స్థానికులపై రాళ్లు, కర్రలతో దాడికి యత్నించాడు. ఈ ఘటనలో ఓ కానిస్టేబుల్ స్వల్పంగా గాయపడ్డాడు. తర్వాత పోలీస్ సిబ్బంది అంతా కలిసి మతిస్థిమితం లేని వ్యక్తిని చుట్టుముట్టి అదుపులోకి తీసుకొని ట్యాబ్‌ను స్వాధీనం చేసుకున్నారు. కాగా, దాదాపు అరగంట పాటు మతిస్థిమితం లేని వ్యక్తి హల్‌చల్ చేయడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment